నల్గొండ జిల్లాలో కొలువుదీరిన పాలకవర్గాలు

నల్గొండ జిల్లాలో కొలువుదీరిన పాలకవర్గాలు
  • ప్రశాంతంగా పాలకమండలి సభ్యుల ప్రమాణ స్వీకారం 
  • చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ల ఎంపిక పూర్తి 
  • నల్గొండ కార్పొరేషన్, 11 మున్సిపాలిటీ లలో ఏకగ్రీవం 

నల్గొండ, వెలుగు: జిల్లాలో  చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించారు. నల్గొండ కార్పొరేషన్ తో పాటు, 11 మున్సిపాలిటీ లలో ఎన్నికైన నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నిక నిర్వహించగా సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. నల్గొండ తొలి మేయర్ పీఠాన్ని బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి చేజిక్కించుకోగా డిప్యూటీ మేయర్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీకి చెందిన మహమ్మద్ అష్రఫ్ అలీ ఆమేర్ దక్కింది. 

సూర్యాపేట చైర్ పర్సన్ గా నివేదిత    

సూర్యాపేట చైర్ పర్సన్ గా మొరిశెట్టి నివేదిత, వైస్ ఛైర్మన్ గా మహ్మద్ షఫీ ఉల్లాను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. సూర్యాపేట మున్సిపల్ కార్యాలయంలో ఎన్నిక అధికారి సూర్యాపేట ఆర్డీవో వేణు మాధవరావు, సహాయ ఎన్నిక  అధికారి, సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ హనుమంత రెడ్డి ఆధ్వర్యంలో చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నిక నిర్వహించారు.మున్సిపల్ ఎన్నిక అనంతరం  క్యాంప్ వెళ్ళిన కాంగ్రెస్ కౌన్సిలర్లు నేరుగా ఎన్నికకు హాజరయ్యారు.

48 మంది కౌన్సిల్ సభ్యుల చేత ముందుగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం సీల్డ్ కవర్ లో వచ్చిన చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ పేర్లను అందించగ  46 వ వార్డ్ సభ్యురాలు మొరిశెట్టి నివేదిత  పేరును 44 వ వార్డుకు చెందిన గుణగంటి హేమ ప్రపోజ్ చేశారు. వీరికి 31 మంది కాంగ్రెస్ సభ్యులు. ముగ్గురు ఇండిపెండెంట్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అనంతరం వైస్ చైర్మన్ గా 41 వ వార్డుకు చెందిన మహమ్మద్ షఫీ ఉల్లా పేరును 33 వ వార్డు సభ్యులు నాగుల శ్రీనివాస్,  నామ అరుణ ప్రపోజ్ చేశారు, 31 మంది కాంగ్రెస్ సభ్యులు ముగ్గురి ఇండిపెండెంట్ సభ్యులు చేతులెత్తి ఆమోదం తెలిపారు. దీంతో  చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఎక గ్రీవమైనది. 

నల్లగొండ కార్పొరేషన్​మేయర్ గా బుర్రి చైతన్య

నల్గొండ అర్బన్, వెలుగు: నల్గొండ కార్పొ రేషన్ తొలి మేయర్ గా 32 వ వార్డు కార్పొరేటర్ బుర్రి చైత న్య శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్ గా 45వ డివిజన్ కార్పొరేటర్ మహమ్మద్ అష్రఫ్ అలీ ఆమేర్​ ఎన్నికయ్యారు. సోమవారం నల్గొండ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో మేయర్‌‌, డిప్యూటీ మేయర్ లతో పాటు 48 డివిజన్ల కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి హాజరయ్యారు. స్పెషల్ ఆఫీసర్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పాల్వాయి శ్రవణ్ కుమార్ మేయర్, డిప్యూటీ మేయర్లతోపాటు కార్పొరే టర్ల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మేయర్​ బుర్రి చైతన్య మాట్లాడుతూ..  మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి సహాకారంతో నల్గొండను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు.  

బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పారు

గత రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలు ఆదరించి కాంగ్రెస్ పార్టీకి మున్సిపాలిటీలో తిరుగు లేని విజయాన్ని అందించారని, ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, డీసీసీ అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూర్యాపేట మున్సిపాలిటీలో ప్రజలు కాంగ్రెస్ ను ఆదరించారని అభివృద్ధి సంక్షేమానికి పట్టం కట్టి సూర్యాపేట మున్సిపాలిటీ హస్తగతం చేశారన్నారు. గత పది ఏళ్లు పాలించిన బిఆర్ఎస్ ప్రజా సమస్యలను గాలికి వదిలిందని అందుకే ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సూర్యాపేట మున్సిపాలిటీ అన్ని రంగాల్లో ఆదర్శంగా ఉంచి అభివృద్ధిలో నెంబర్ వన్ గా చేస్తామన్నారు.