
ఖానాపూర్: నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వరదల కారణంగా గోదావరి నది ఉధృతంగా ప్రవహించి ఖానాపూర్‌లో శ్మశాన వాటిక మునిగింది. శ్మశానంలో ఉన్న శివుడి విగ్రహాన్ని గోదావరి నీళ్లు తాకాయి. భారీ ప్రవాహానికి శ్మశానం ధ్వంసమైంది. గోదావరి నది పరివాహక ప్రాంతంలో పంటపొలాలు మునిగిపోయాయి. శ్రీరాం సాగర్(SRSP) ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడంతో వరద ఉధృతి విపరీతంగా పెరిగింది. ఎస్సారెస్పీ ప్రాజెక్టులోకి గడిచిన మూడు రోజుల్లో 25 టీఎంసీల నీరు చేరింది.
ప్రాజెక్టు పూర్తి కెపాసిటీ 90 టీఎంసీలుకాగా 15వ తేదీన 47 టీఎంసీలున్న నీరు 16న 50 టీఎంసీలకు, 17న 68 టీఎంసీలకు, 18న 73 టీఎంసీలకు చేరింది. ఎగువ గోదావరి నుంచి భారీగా వరద పోటెత్తడంతో ఇంజినీర్లు సోమవారం ప్రాజెక్టు రెగ్యులేషన్ ప్రారంభించారు. ఇన్ఫ్లో ఆధారంగా బయటకు నీరు వదులుతున్నారు. ఎస్పారెస్పీకి మొత్తం 42 ఫ్లడ్ గేట్లుండగా ఉదయం 9 గంటలకు తొమ్మిది గేట్లు ఓపెన్ చేసి 25 వేల క్యూసెక్కులను మొదట వదిలిన ఇంజినీర్లు.. క్రమంగా 39 గేట్ల వరకు ఎత్తి 1,51,257 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. రాత్రి 10 గంటలకు 34 గేట్లు ఓపెన్ చేసి అదే లెవెల్ నీటిని వదులుతున్నారు.
నిర్మల్ జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతుండడంతో దాదాపు 20కి పైగా మారుమూల గ్రామాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయి. ముఖ్యంగా కడెం, పెంబి మండలాల్లోని ఈ మారుమూల పల్లెలకు ప్రస్తుతం కమ్యూనికేషన్ లేకుండా పోయింది. ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖల పరిధిలోని రోడ్లు, వంతెనలు చాలా చోట్ల దెబ్బతిన్నాయి. కడెం ప్రాజెక్టు 6 గేట్లను పైకెత్తి 34,493 క్యూసెక్కులకు నీటిని వదులుతున్నారు.
గడ్డన్న వాగు ప్రాజెక్టు 3 గేట్లు పైకెత్తి దాదాపు 13వేల క్యూసెక్కులు, స్వర్ణ ప్రాజెక్టు 2 గేట్లను పైకెత్తి 10వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎస్సారెస్పీ ప్రాజెక్టు 32 గేట్లు పైకెత్తి దిగువకు నీటిని విడుదల చేయడంతో జిల్లాలో ప్రవహించే గోదావరి నది ఉప్పొంగుతోంది. నది పరివాహకంలో ఉన్న నిర్మల్, సోన్, లక్ష్మణ చందా, మామడ, ఖానాపూర్ మండలాల్లోని పలు గ్రామాలను అధికారులు అప్రమత్తం చేశారు.