
హైదరాబాద్: చైతన్యపురిలోని మెట్రో రైల్వే స్టేషన్ వద్ద విద్యుత్తు సంస్థ జప్తు నోటీసు అంటించింది. రూ. 31 వేల 829 బకాయి ఉన్నట్లు అందులో పేర్కొంది. ‘మెస్సర్స్ థేల్స్ ఇండియా ప్రైవేట్ ఏజెన్సీ’ 2015 జులై 23న మెట్రో పనుల కోసం విద్యుత్తు కనెక్షన్ తీసుకుంది. ఆ తర్వాత సదరు ఏజెన్సీ పనులు ముగించుకుని వెళ్లిపోయింది. 2021 డిసెంబరు నాటికి బకాయిపడిన వినియోగదారుల నుంచి వసూలుకు టీజీ ఎస్పీడీసీఎల్ చర్యలు చేపట్టింది.
ఇందులో భాగంగా సరూర్ నగర్ ఆపరేషన్స్ ఏఈ జప్తు నోటీసు మెట్రో స్టేషను అంటించారు. విద్యుత్ కనెక్షన్ మెట్రో రైలు సంస్థ పేరున లేదని.. కానీ మెట్రో కోసం పని చేసిన ఏజెన్సీ మెస్సర్స్ థేల్స్ చిరునామా, నంబరును కనుగొనడానికి అక్కడ జప్తు నోటీసు అంటించారు. రోజూ ఈ స్టేషన్లో రాకపోకలు సాగించే ప్రయాణికులు జప్తు నోటీసును చూసి చర్చించుకుంటున్నారు.