హైదరాబాద్, వెలుగు: యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో (వైటీపీఎస్) పలు ఉద్యోగాలను ఔట్‌సోర్సింగ్‌కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 7న చలో వైటీపీఎస్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ప్రకటించింది. ఈ నిరసన కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యుత్ శాఖ ఉద్యోగులు, కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది.
గురువారం హైదరాబాద్‌లోని ‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్’ ఆడిటోరియంలో తెలంగాణ పవర్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ట్రాన్స్‌కో, జెన్‌కో, ఎస్‌పీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్ సంస్థల నుంచి భారీగా ఆఫీస్ బేరర్లు పాల్గొన్నారు. విద్యుత్ రంగంలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న పలు సమస్యలపై ఈ సందర్భంగా చర్చించి, పలు తీర్మానాలను ఆమోదించారు. సమస్యలపై చర్చించిన పలు తీర్మానాలను ఆ సంఘం చైర్మన్ సాయిబాబా వెల్లడించారు.
