సాగర్, తిరుపతి బైపోల్స్​: 4 రాష్ట్రాలు, ఒక యూటీలో ఎలక్షన్ వార్

సాగర్, తిరుపతి బైపోల్స్​: 4 రాష్ట్రాలు, ఒక యూటీలో ఎలక్షన్ వార్

తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో సింగిల్ ఫేజ్​లో పోలింగ్
అస్సాంలో 3 దశలు, వెస్ట్ బెంగాల్​లో ఏకంగా 8 దశల్లో ఎన్నికలు
మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 దాకాకొనసాగనున్న ప్రక్రియ
తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో సింగిల్ ఫేజ్​లో పోలింగ్
అస్సాంలో 3 దశలు, వెస్ట్ బెంగాల్‌‌లో ఏకంగా 8 ఫేజ్‌‌ల్లో ఎన్నికలు
మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 దాకా కొనసాగనున్న ప్రక్రియ
మే 2న అన్ని రాష్ట్రాల రిజల్ట్స్.. ఆయా రాష్ట్రాల్లో అమల్లోకి ఎన్నికల కోడ్

న్యూఢిల్లీ, వెలుగు: మినీ ఎన్నికల సంగ్రామానికి తెరలేచింది. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికల నగారా మోగింది. తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీలకు మార్చి నుంచి ఏప్రిల్ దాకా పలు దశల్లో ఎలక్షన్లు జరగనున్నాయి. శుక్రవారం ఈ మేరకు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ షెడ్యూలు రిలీజ్ చేసింది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో పోలింగ్ జరగనుంది. అస్సాంలో మూడు దశల్లో, పశ్చిమ బెంగాల్​లో మాత్రం ఏకంగా 8 దశల్లో పోలింగ్ జరగనుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల రిజల్ట్స్​ను మే 2న ప్రకటిస్తారు. ఆయా రాష్ట్రాల్లో శుక్రవారం నుంచే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) సునీల్ అరోరా తెలిపారు. ‘‘ఎన్నికలు జరిగే రాష్ర్టాల్లో సెంట్రల్ ఆర్మ్​డ్ పోలీస్ ఫోర్సు (సీఏపీఎఫ్)లను మోహరిస్తాం. సమస్యాత్మక ప్రాంతాల్లోని పోలింగ్ స్టేషన్లలో అవసరమైనంత మేరకు సీఏపీఎఫ్ జవాన్లతో బందోబస్తు ఏర్పాటు చేస్తాం” అని చెప్పారు.

పోలింగ్ స్టేషన్ల సంఖ్య పెంపు

గత ఎన్నికలతో పోలిస్తే తాజాగా పోలింగ్ స్టేషన్ల సంఖ్యను భారీగానే పెంచారు. అస్సాంలో 34.7%, తమిళనాడులో 34.73%, వెస్ట్ బెంగాల్​లో 31.65%, కేరళలో 89.65%, పుదుచ్చేరిలో 67.65% పోలింగ్ కేంద్రాలను పెంచినట్లు అరోరా తెలిపారు. గతంలో ప్రతి 1,500 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం ఉండగా, కరోనా నేపథ్యంలో ఓటర్ల సంఖ్యను వెయ్యికి కుదించినట్లు
వెల్లడించారు.

ఇంకా ఏం చెప్పారంటే..

కరోనా నేపథ్యంలో పోలింగ్ సమయాన్ని మరో గంటపాటు పొడిగించారు.
కరోనా దృష్ట్యా ఆన్ లైన్ లో నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం  కల్పించారు.
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారినే ఎన్నికల సిబ్బందిగా నియమిస్తారు.
కరోనా పాజిటివ్ ఓటర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
80 ఏండ్లు పైబడిన వారికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును ఉపయోగించుకునే అవకాశం కల్పించారు.
రోడ్ షోలో 5 వాహనాలకు మించి ఉండకూడదు.
ఇంటింటి ప్రచారంలో అభ్యర్థితోపాటు, నలుగురు మాత్రమే పాల్గొనాలి.
పుదుచ్చేరిని మినహాయిస్తే, మిగతా నాలుగు రాష్ట్రాల్లో ఒక్కో అభ్యర్థి ఎన్నికల ఖర్చును రూ.30.8 లక్షలకు పెంచారు.

తమిళనాడు

234 సీట్లు ఉన్న తమిళనాడు అసెంబ్లీకి ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 12న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. మార్చి 19 దాకా నామినేషన్లు స్వీకరిస్తారు. ఏప్రిల్ 6న పోలింగ్ జరుగుతుంది. మాజీ సీఎంలు ఎం.కరుణానిధి, జె.జయలలిత లేకుండా జరుగుతున్న తొలి, పూర్తిస్థాయి అసెంబ్లీ ఎన్నికలు ఇవే కావడం గమనార్హం.

కేరళ

కేరళలోనూ ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. 140 సీట్లు ఉన్న అసెంబ్లీకి మార్చి 12న నోటిఫికేషన్ ఇస్తారు. మార్చి 19 దాకా నామినేషన్ల దరఖాస్తుకు గడువు. ఏప్రిల్ 6న పోలింగ్ జరుగుతుంది. కేరళ అసెంబ్లీ పదవీకాలం జూన్ 1న ముగియనుంది. దీంతో నెల రోజుల ముందే కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది.

పశ్చిమ బెంగాల్

పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రాసెస్ సుదీర్ఘంగా సాగనుంది. 294 అసెంబ్లీ సీట్లకు ఏకంగా 8 దశల్లో పోలింగ్ జరగనుంది. మార్చి 27న తొలి దశ, ఏప్రిల్ 1న సెకండ్ ఫేజ్, 6న థర్డ్ ఫేజ్, 10న నాలుగు, 17న ఐదు, 22న ఆరు, 26న ఏడు, 29న 8వ ఫేజ్ పూర్తి కానుంది. అల్లర్లు జరిగే ప్రమాదం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో 8 విడుతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఈసీ తెలిపింది.

అస్సాం

126 అసెంబ్లీ సీట్లు ఉన్న అస్సాంలో మూడు దశల్లో ఎలక్షన్లు జరుగుతాయి.

మార్చి 27న తొలి దశ, ఏప్రిల్ 1న రెండో దశ, ఏప్రిల్ 6న మూడో దశ ఎన్నికలు జరుగుతాయి. ఫస్ట్ ఫేజ్​కు మార్చి 2 నుంచే నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది. ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం మే 31తో ముగియనుంది.

పుదుచ్చేరి

30 అసెంబ్లీ సీట్లు ఉన్న పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు నిర్వహిస్తారు. ఏప్రిల్ 6న పోలింగ్ జరుగుతుం ది. మార్చి 12న నోటిఫికేషన్ ఇస్తారు. 19వ తేదీ దాకా నామినేషన్లు తీసుకుంటారు. ప్రస్తుత అసెంబ్లీ పదవీ కాలం జూన్ 8 దాకా ఉంది. ప్రస్తుతం పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన నడుస్తోంది. అసెంబ్లీలో మెజారిటీ లేక కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మధ్యే కుప్పకూలింది.

సాగర్, తిరుపతి బైపోల్స్​ కూడా..

4 రాష్ట్రాలు, ఒక యూటీతోపాటే వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న లోక్​సభ, అసెంబ్లీ సీట్లలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. వీటికి సంబంధించి షెడ్యూల్ ను త్వరలోనే రిలీజ్ చేస్తామని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. గత ఏడాది డిసెంబర్ 1న నోముల నర్సింహయ్య చనిపోవడంతో నాగార్జున సాగర్ అసెంబ్లీ సీటు ఖాళీ అయింది. ఏపీలో ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ చనిపోవడంతో తిరుపతి పార్లమెంటు సీటు ఖాళీ అయింది. దీంతో సాగర్, తిరుపతి సీట్లకు కూడా త్వరలో బై ఎలక్షన్స్ జరగనున్నాయి.