
న్యూఢిల్లీ: టెస్లా బాస్ ఎలన్ మస్క్ ట్విట్టర్ కంపెనీలో వాటాలు కొన్నారు. ఎలన్ మస్క్ రివోకబుల్ ట్రస్ట్ కింద ఈ సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌లో 9.2 శాతం వాటా (73,486,938 షేర్ల) ను ఆయన కొనుగోలు చేశారు. దీంతో ట్విట్టర్ షేర్లు సోమవారం 23% పెరిగాయి. మస్క్ పరోక్షంగా వాటాను కొనడం బట్టి చూస్తుంటే ఆయనకు కంపెనీని నడిపే ఆలోచన లేనట్టు తెలుస్తోందని ఎనలిస్టులు అంటున్నారు. ఫ్రీ స్పీచ్‌కు ట్విట్టర్ కట్టుబడి ఉందా? అనే పోల్‌ను కొన్ని రోజుల కిందట మస్క్ పోస్ట్ చేశారు. ఈ పోస్టు పెట్టిన కొన్ని రోజులకే ట్విట్టర్లో వాటా కొన్నట్టు ఎస్‌ఈసీ ఫైలింగ్‌లో బయటపడింది. ఈ పోల్‌ను పోస్ట్ చేసిన రెండు గంటల్లోపే 20 లక్షల మంది తమ ఓటు వేశారు. ఇందులో 64 శాతం మంది ‘నో’ ఓటు వేయడం గమనించాలి. ఈ పోల్ పెట్టిన 24 గంటల్లోపే ట్విటర్ అల్గారిథమ్ ఓపెన్ సోర్స్‌గా ఉండాలని మస్క్ మరో ట్వీట్ చేశారు. దీనికి ట్విట్టర్ పౌండర్ జాక్ డోర్సే స్పందించారు కూడా. ఏ అల్గారిథమ్ వాడాలి (వాడకూడదు) అనే ఛాయిస్ అందరికి ఓపెన్‌గా ఉండాలని మస్క్ ట్వీట్‌కు రిప్లేగా డోర్సే పోస్ట్ చేశారు. కిందటేడాది నవంబర్‌లో ట్విట్టర్ సీఈఓ పదవికి జాక్ డోర్సే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎలన్ మస్క్‌కు 8 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.