మస్క్​ కీలక ప్రకటన.. మరో 6 నెలల్లో మనుషుల మెదడులో చిప్

మస్క్​ కీలక ప్రకటన.. మరో 6 నెలల్లో మనుషుల మెదడులో చిప్

చూపు కోల్పోయిన వారికి మళ్లీ చూపు వస్తే.. 

పక్షవాతం వచ్చిన వారు మళ్లీ పూర్వంలా కోలుకుంటే.. 

పార్కిన్​ సన్స్​, మతిమరుపు, అల్జీమర్స్ వంటి మొండి వ్యాధులకు ప్రభావవంతమైన చికిత్స సాధ్యమైతే.. గొప్ప అద్భుతమే కదా! 

అధునాతన టెక్నాలజీతో ఈ అద్భుతాలను చేసి చూపించే దిశగా అపర కుబేరుడు  ఎలాన్​ మస్క్​ అడుగులు వేస్తున్నారు. టెస్లా.. స్పేస్​ ఎక్స్​.. ట్విట్టర్​ వంటి దిగ్గజ కంపెనీల అధినేతగా ఖ్యాతి  గడించిన మస్క్​తన మరో కంపెనీ ‘న్యూరాలింక్’ తో కనీవినీ ఎరుగని సరికొత్త సంచలనాలకు తెర తీసేందుకు ప్రణాళికలు రచిస్తున్నాడు. మనిషి మెదడులో ఎలక్ట్రానిక్​ చిప్​ను అమర్చేందుకు సంబంధించిన  బ్రెయిన్​ కంప్యూటర్​ ఇంటర్​ ఫేస్ (బీసీఐ) టెక్నాలజీని అభివృద్ధి చేసే దిశగా ముందడుగు వేయబోతున్నాడు.  బీసీఐ టెక్నాలజీతో ఇప్పటికే జంతువులపై ప్రయోగ పరీక్షలు పూర్తిచేసిన న్యూరాలింక్​ కంపెనీ.. మరో 6 నెలల్లోగా మనుషులపైనా ట్రయల్స్​ ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. కాలిఫోర్నియాలోని ఫ్రెమోంట్​ లో ఉన్న న్యూరాలింక్స్​ ప్రధాన కార్యాలయంలో   ఏర్పాటుచేసిన ఓ సమావేశంలో మస్క్ ఈవిషయాన్ని స్వయంగా వెల్లడించారు.​బ్రెయిన్​ లోని ఎలక్ట్రానిక్​ చిప్​ ను అమర్చేందుకు సంబంధించిన టెక్నాలజీతో మనుషులపై ప్రయోగాలు చేసేందుకు సంబంధించి అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్డీఏ)తో సంప్రదింపులు ఆశాజనక రీతిలో జరిగాయని తెలిపారు. ఆర్టిఫీషియల్​ ఇంటెలిజెన్స్​(కృత్రిమ మేధ) ను అధిగమించేలా మానవ మేధస్సును పెంచే లక్ష్యంతో బ్రెయిన్​ చిప్​ ప్రాజెక్టును మస్క్​ ముందుకు తీసుకుపోతున్నారు.   

మస్క్​ చేయలేనిది.. మరో కంపెనీ చేసింది

వాస్తవానికి బ్రెయిన్​ చిప్​ టెక్నాలజీతో మనుషులపై ట్రయల్స్​ కు 2020 చివరికల్లా అమెరికా ఎఫ్​డీఏ నుంచి అనుమతులు వస్తాయని మస్క్​ భావించారు. కానీ అలా జరగలేదు. ఇదే సమయంలో మరో అమెరికా కంపెనీ ‘సింక్రాన్’ విప్లవాత్మకంగా పురోగమించింది. మస్క్​ కంపెనీ న్యూరాలింక్​ చేయలేనిది .. చేసి చూపించింది.  మెదడు, నరాల సంబంధిత వ్యాధులు, పక్షవాతంతో బాధపడుతున్న నలుగురు ఆస్ట్రేలియన్ల మెదడులో చిప్​ ను అమర్చి సింక్రాన్​ కంపెనీ పరీక్షించింది.  

ప్రపంచంలోనే తొలిసారిగా ప్రయోగాత్మకంగా ఓ వ్యక్తి మెదడులో చిప్​ ను అమర్చిన ఘనతను సైతం 2022 జులై 19న సింక్రాన్​దక్కించుకుంది. న్యూయార్క్​ సిటీలోని మౌంట్​ సినాయ్​ వెస్ట్​ హాస్పిటల్​ లో దీనికి సంబంధించిన సర్జరీని సింక్రాన్​ కంపెనీ వైద్య నిపుణులు నిర్వహించారు. దాదాపు 2 గంటలపాటు ఆ అరుదైన సర్జరీ జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈఏడాదిలో ఒకానొక దశలో సింక్రాన్​ కంపెనీలో పెట్టుబడులు పెట్టాలని ఎలాన్​ మస్క్  నిర్ణయించుకున్నారు. దీనిపై సింక్రాన్​  కంపెనీ వ్యవస్థాపకుడు థామస్​ ఆక్స్​ లేతో నేరుగా కలిసి మాట్లాడారు. అయితే ఆ చర్చలు ఎక్కడిదాకా వచ్చాయనేది తెలియరాలేదు.