టైమ్ "పర్సన్ ఆఫ్ ది ఇయర్"గా ఎలాన్ మస్క్

టైమ్ "పర్సన్ ఆఫ్ ది ఇయర్"గా ఎలాన్ మస్క్

టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ను టైమ్ మ్యాగజైన్ "పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2021"గా ఎంపిక చేసింది. ఆయనను అపర మేధావి, దార్శనికుడు, వ్యాపారవేత్త, షో మేన్‌గా అభివర్ణించింది. ఈ ఏడాది అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ సందపను అధిగమించిన మస్క్ ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా అవతరించాడు. ప్రపంచ కుబేరుల్లో ఒకరైనప్పటికీ మస్క్ కు సొంత ఇల్లు కూడా లేదని, కొంతకాలంగా తన ఆస్తిని ఆయనే తగ్గించుకుంటున్నారని టైమ్స్ పేర్కొంది. 
ప్రస్తుతం ఎలాన్ మస్క్ సంపద 253 బిలియన్ డాలర్లు కాగా.. ప్రపంచంలో అత్యంత విలువైన కార్ల కంపెనీగా గుర్తింపు పొందిన టెస్లాలో మస్క్ కు 17శాతం షేర్లు ఉన్నాయి. టెస్లాతో పాటు సొంత రాకెట్ కంపెనీ స్పేస్ ఎక్స్ కు కూడా సీఈఓగా వ్యవహరిస్తున్నారు. టెస్లా నుంచి పైసా జీతం తీసుకోకుండా పనిచేస్తున్న ఆయన.. తన వాటా లాభాలు, స్పేస్ ఎక్స్ ఒప్పందాలు , షేర్ల లావాదేవీల ద్వారా బిలియన్లు సంపాదిస్తున్నాడు. 50 ఏళ్ల మస్క్ మౌలిక వసతుల కంపెనీ ది బోరింగ్, బ్రెయిన్ చిప్ స్టార్టప్ న్యూరాలింక్ ఫౌండర్ గా ఉన్నారు. 
టైమ్ మ్యాగజైన్ 1927 నుంచి ఏటా పర్సన్ ఆఫ్ ది ఇయర్ ను ఎంపిక చేస్తోంది. అలా ఎంపిక చేసిన వ్యక్తి ఫొటోను కవర్ పేజీపై ముద్రించి వార్తా కథనాన్ని ప్రచురిస్తోంది. ఈ ఏడాది మస్క్ ను ఎంపిక చేసిన టైమ్ మ్యాగజైన్.. సోషల్ మీడియాలో ఆయనకు అసంఖ్యాక అభిమానులున్నారని, ఇన్వెస్టర్లకు ఆయనపై ఎంతో నమ్మకముందని పేర్కొంది. ట్విట్టర్ లో 6.6 కోట్ల మంది ఫాలోవర్ల ఉన్న ఎలాన్ మస్క్ క్రిప్టో మార్కెట్ ను ఒకే ఒక్క ట్వీట్ తో శాసిస్తున్నాడని ప్రశంసించింది.