మీకు ఎడిట్ బటన్ కావాలా

మీకు ఎడిట్ బటన్ కావాలా

ట్విట్టర్‌‌లో ట్వీట్ చేసేటప్పుడు చాలామంది చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. సెలబ్రిటీలు కూడా చాలాసార్లు తప్పులు చేశారు. అందుకే ట్విట్టర్‌‌‌‌ని చేజిక్కుంచుకున్న ఎలాన్‌‌ మస్క్‌‌ ఎడిట్‌‌ బటన్‌‌ మీద ఈ మధ్యే ఒక ట్వీట్‌‌ కూడా పెట్టాడు. అయితే.. ఎలాన్ మస్క్ తల్లి మాయే మస్క్ కూడా ఎడిట్‌‌ బటన్‌‌ కోసం ప్రశ్నించింది. ఆమె ఒక ట్వీట్‌‌లో సంవత్సరాన్ని తప్పుగా రాసింది. తర్వాత మాయే మస్క్ దాన్ని ఎడిట్‌‌ చేసే అవకాశం లేక..  మరో ట్వీట్‌‌ చేసింది. అందులో ట్విట్టర్‌‌లోని ఎడిట్ బటన్ ఫీచర్ గురించి కూడా ప్రశ్నించింది. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్‌‌గా మారింది. 

ట్విట్టర్ వాడేవాళ్లు చాలా ఏండ్ల నుంచి ట్వీట్లను ఎడిట్‌‌ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని రిక్వెస్ట్‌‌ చేస్తున్నారు. అయితే, ఈ ఫీచర్‌‌పై పనిచేస్తున్నట్లు కంపెనీ ఈ మధ్యే ప్రకటించింది. పోయిన నెలలో ఎలాన్ మస్క్ తన ఫాలోవర్స్‌‌ని ‘‘మీకు ఎడిట్ బటన్ కావాలా?” అని ట్విట్టర్ పోల్ పెట్టాడు. అందులో 73.6% మంది ఎడిట్‌‌ ఫీచర్ కావాలని, 26.4% మంది వద్దని ఓటు వేశారు. 

మాయే మస్క్ తాజ్‌‌మహల్‌‌ దగ్గర దిగిన ఫొటోను షేర్‌‌‌‌ చేస్తూ.. అది 2007లో తాజ్‌‌మహల్‌‌ని విజిట్‌‌ చేసినప్పటిదని ట్వీట్‌‌ చేసింది. వాస్తవానికి ఆ ఫొటో 2012లో తీసుకున్నది. పొరపాటున 2007 అని రాసింది. ఆ విషయం గుర్తొచ్చి వెంటనే మరో ట్వీట్‌‌లో సంవత్సరాన్ని 2012గా మార్చి, ఎడిట్ బటన్ ఫీచర్‌‌పై ట్విట్టర్‌‌ని ప్రశ్నించింది. అయితే.. మాయే పోస్ట్ పెట్టకముందే ఎలాన్‌‌ మస్క్‌‌ 2007లో తాజ్‌‌మహల్‌‌ని సందర్శించినట్టు ఒక ట్వీట్‌‌ చేశాడు. తాజ్ మహల్‌‌, ఆగ్రా కోట నిర్మాణాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని, ఇవి నిజంగా ప్రపంచ వింతలేనని మస్క్ ఆ ట్వీట్‌‌లో చెప్పాడు. ఆ తర్వాత ఎలాన్ అమ్మమ్మ, తాతయ్యలు కూడా1954లో తాజ్‌‌మహల్‌‌ను సందర్శించారని ట్విట్టర్‌‌ ద్వారా చెప్పింది  మాయే మస్క్. వాళ్లు దక్షిణాఫ్రికా నుంచి ఆస్ట్రేలియా వెళ్తుండగా ఇండియాకి వచ్చి తాజ్‌‌మహల్‌‌‌‌ను చూసినట్టు ఆమె చెప్పింది. ఆ ఫొటోలను కూడా షేర్ చేసింది. ఆ తర్వాత తన ఫొటో షేర్‌‌‌‌ చేసింది.