ప్రధాని మోడీ ఫాలోవర్లలో చేరిన మస్క్.. టెస్లాను ఇండియాకు తెచ్చేందుకేనా..?

ప్రధాని మోడీ ఫాలోవర్లలో చేరిన మస్క్.. టెస్లాను ఇండియాకు తెచ్చేందుకేనా..?

మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌  ట్విట్టర్ చీఫ్, బిలియనీర్ ఎలాన్ మస్క్ ట్విట్టర్ లో ప్రధాని నరేంద్ర మోడీని ఫాలో కావడం ప్రారంభించారు. మస్క్ అనుసరించే 195 మంది వ్యక్తుల జాబితాను పరిశీలిస్తే..  ఇందులో  ప్రధాని మోడీ పేరు కనిపించడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మస్క్ ను ఇప్పటివరకు 134.3 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. మార్చి చివరిలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాను అధిగమించి, ఆ తర్వాత మస్క్ ఈ ఘనతను సాధించారు. 87.7 మిలియన్ల మంది ఫాలోవర్లతో ట్విట్టర్‌లోనే అత్యధికంగా అనుసరించే నాయకులలో ప్రధాని మోడీ ఒకరు.

మస్క్, ప్రధాని మోడీని ఫాలో అవుతుండడంతో పలు ఆసక్తికర ప్రశ్నలతో కామెంట్ల బాక్స్ నిండిపోయింది. మోడీని ఫాలో అవుతున్నారంటే.. టెస్లా త్వరలోనే ఇండియాకి రాబోతుందనడానికి ఇదే సంకేతమా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. మన దేశాన్ని మరింత మెరుగ్గా, సుసంపన్నంగా, ప్రగతిశీలంగా, ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి మన ప్రధాని మోదీజీ ప్రయత్నాలు చేస్తుండగా, ఎలోన్ మస్క్ కూడా ప్రపంచాన్ని పరిశుభ్రంగా, సమాజానికి, నేటి పిల్లలకు మెరుగైన భవిష్యత్తును, జీవితాన్ని అందించడానికి ప్రయత్నిస్తున్నారంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ విడుదల చేసిన నివేదిక ప్రకారం, ట్విట్టర్‌లో దాదాపు 450 మిలియన్ల మంది యూజర్స్ ఉండగా.. అందులో మస్క్ ను ఫాలో అయ్యే వారు 30శాతం ఉండడం గమనార్హం. ఇక ఎలాన్ మస్క్ 2022 అక్టోబర్ చివర్లో ట్విట్టర్ బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో అతనికి దాదాపు 110 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండగా..  ఐదు నెలల్లోనే ఈ సంఖ్య 133 మిలియన్లకు పెరిగింది. బరాక్ ఒబామా, జస్టిన్ బీబర్ తర్వాత అత్యధిక మంది అనుసరించే ట్విట్టర్ యూజర్లలో మస్క్ మూడోవాడు.