కొండగట్టు అంజన్నకు బంగారు కిరీటం..

కొండగట్టు అంజన్నకు బంగారు కిరీటం..
  • హైదరాబాద్ కు చెందిన ఏమ్మాఆర్ కంపెనీ చైర్మన్ రూ. కోటి విలువైన ఆభరణాల బహూకరణ

కొండగట్టు, వెలుగు: జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్నకు హైదరాబాద్ చెందిన దాత  బంగారు కిరీటాన్ని బహుకరించారు. సోమవారం ఏఎమ్మార్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చైర్మన్ మహేశ్​రెడ్డి, రాధిక దంపతులు ఆలయాన్ని సందర్శించారు. రాగితో చేసి 325 గ్రాముల బంగారు పూత పూసిన కిరీటం, శ్రీరామ ముద్ర అంతరాలయంలోని గోడలకు 48 కిలోల 500 గ్రాముల వెండి తాపడాలు, మకరతోరణం తయారు చేయించి అందజేశారు. 

అనంతరం అర్చకులు సంప్రోక్షణ చేసి స్వామివారి మూల విరాట్ కు కిరీటాన్ని అమర్చారు. రెండేండ్ల కింద కొండగట్టు అంతరాలయంలో దొంగలు పడి గోడలకు ఉన్న వెండి తాపడాలను,  విలువైన వస్తువులను దోచుకెళ్లిన విషయం తెలిసిందే. అప్పటినుంచి కొత్తవి తయారు చేయించడంలో అధికారులు నిర్లక్ష్యంగా ఉంటున్నారు. 

ఆలయ అధికారి ద్వారా సమాచారం తెలుసుకున్న ఏఎమ్మార్ ప్రతినిధులు రూ. కోటి విలువైన బంగారు, వెండి ఆభరణాలు తయారు చేయించి అందజేశారు. ఏఎమ్మార్ కంపెనీ ప్రతినిధులు అర్చకులకు సంభావన అందస్తుండగా  ఆలయ అధికారులు, సిబ్బంది కూడా క్యూ లైన్ లో నిలబడి తీసుకున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.