53% మందికి ఎంప్లాయిబిలిటీ స్కిల్

53%  మందికి ఎంప్లాయిబిలిటీ స్కిల్
  • అబ్బాయిల్లో 47 శాతమే.. ఉద్యోగాల్లో మాత్రం టాప్
  • జాబ్స్ చేస్తున్న అమ్మాయిలు 33 శాతమే.. ఇండియా స్కిల్స్ రిపోర్ట్‌‌లో వెల్లడి
  • ఉద్యోగ అవకాశాలున్న రాష్ట్రాల్లో తెలంగాణకు ఏడో స్థానం

హైదరాబాద్, వెలుగు: అబ్బాయిలతో పోలిస్తే తాము ఎందులోనూ తక్కువ కాదని అంటుంటారు అమ్మాయిలు. అన్ని రంగాల్లో గట్టి పోటీనిస్తున్న యువతులు.. ఎంప్లాయిబిలిటీ విషయంలో అబ్బాయిల కంటే జరంత ఎక్కువేనని నిరూపించుకున్నారు. దేశవ్యాప్తంగా 2022లో 53 శాతం మంది అమ్మాయిలకు ఎంప్లాయిబులిటీ ఉండగా, అబ్బాయిలకు 47 శాతమే ఉన్నట్లు ఇటీవల రిలీజైన ఇండియా స్కిల్స్ రిపోర్టులో వెల్లడైంది. 2023లో అమ్మాయిలకు 53%, అబ్బాయిలకు 47% ఉండనున్నదని తేలింది. దేశవ్యాప్తంగా వీబాక్స్ అనే సంస్థ వివిధ కార్పొరేట్ సంస్థలు, స్టూడెంట్లతో ఎంప్లాయిమెంట్, టాలెంట్ తదితర అంశాలపై ఆన్‌‌లైన్ సర్వే నిర్వహించింది. ‘ఇండియా స్కిల్స్’ పేరుతో నిర్వహించిన ఈ సర్వేలో 3.75 లక్షల మంది స్టూడెంట్లు పాల్గొన్నారు.

జాబ్స్‌‌లో జరంత పెరిగిన్రు

ఉద్యోగాలు చేసే విషయంలో మాత్రం అబ్బాయిలే ముందంజలో ఉంటున్నారు. టాలెంట్ ఉన్నప్పటికీ.. అమ్మాయిలు వివిధ కారణాలతో జాబ్స్‌‌లో చేరలేకపోతున్నారు. 2022లో జాబ్స్ చేస్తున్న వారిలో 67% మంది అబ్బాయిలుండగా, 33% మంది అమ్మాయిలున్నారు. 2023 సంవత్సరంలోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతుందని రిపోర్టులో పేర్కొన్నారు. 

చదువులు కాగానే అమ్మాయిలకు పెండ్లి చేస్తుండటం, దూర ప్రాంతాల్లో జాబ్స్ వచ్చినా వెళ్లేందుకు ఇష్టపడకపోవడంతో ఇలా అవుతున్నదని విద్యావేత్తలు చెబుతున్నారు. అయితే గతంతో పోలిస్తే పరిస్థితి కాస్త మెరుగుపడింది. జాబ్స్ చేస్తున్న అమ్మాయిల సంఖ్య పెరుగుతున్నది. 2020లో 23% మంది అమ్మాయిలు జాబ్స్ చేయగా, ప్రస్తుతం అది 33 శాతానికి పెరిగింది. త్వరలోనే అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు జాబ్స్ చేసే పరిస్థితులు వస్తాయని పలు కంపెనీల ప్రతినిధులు పేర్కొంటున్నారు.

జాబ్స్ ఫెసిలిటీలో యూపీ టాప్

దేశంలో ఎంప్లాయిబులిటీకి అవకాశమున్న రాష్ట్రాల టాప్ టెన్ జాబితాలో తెలంగాణ (65.06%) ఏడో స్థానంలో నిలిచింది. టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉత్తర ప్రదేశ్ (72.7%) ఉండగా, తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, ఢిల్లీ, ఏపీ, రాజస్థాన్, కర్నాటక, తెలంగాణ, పంజాబ్, ఒడిశా, హర్యానా ఉన్నాయి. ఎక్కువ ఎంప్లాయిబులిటీ ఉన్న టాప్ టెన్ సిటీల్లో హైదరాబాద్ లేకపోవడం గమనార్హం. టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ముంబై, లక్నో, మంగళూరు, న్యూఢిల్లీ, పుణె ఉన్నాయి. దేశంలో పనిచేసేందుకు పర్ఫెక్ట్ వర్క్ ఏరియా జాబితాలో బెంగళూరు టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉండగా, తర్వాతి స్థానాల్లో చెన్నై, ఢిల్లీ, పుణె, హైదరాబాద్ ఉన్నాయి. అబ్బాయిలు పనిచేసేందుకు పర్ఫెక్ట్ సిటీల్లో బెంగళూరు, పుణే, చెన్నై, కొయంబత్తూర్ ఉండగా.. ఈ కేటగిరీలో హైదరాబాద్ సిటీ లేదు. కానీ అమ్మాయిలు పనిచేసేందుకు పర్ఫెక్ట్ సిటీల్లో టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బెంగళూరు తర్వాత హైదరాబాదే ఉంది.

బీకామ్ వాళ్లకే జాబ్స్ చాన్స్ ఎక్కువ

దేశవ్యాప్తంగా బీకామ్ చదివిన వారికే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశముందని సర్వేలో తేలింది. 2023లో బీటెక్/బీఈ చేసిన వారికి 57.44% మందికి జాబ్స్ వచ్చే చాన్స్ ఉండగా, బీకామ్ చదివిన 60.62% మంది ఉద్యోగాలు పొందనున్నట్టు వెల్లడైంది. 2022లో బీకామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వారికి 42.62% మందికి జాబ్స్ రాగా, ఈ సారి ఉపాధి అవకాశాలు 12 శాతం పెరగనున్నాయి. అదే బీటెక్​లో 2022 కంటే 2023లో 2 శాతం జాబ్స్ ఆఫర్స్ పెరిగే అవకాశం ఉంది. 2023లో ఎంబీఏ చదివిన 60.0% మందికి, బీఫార్మా చేసిన 57.51% మందికి, బీఎస్సీ చేసిన 37.69% మందికి, ఎంసీఏ చేసిన 30.64% మందికి, పాలిటెక్నిక్ చదివిన 27.61% మందికి జాబ్స్ అవకాశముందని సర్వేలో వెల్లడైంది.