
- అవుట్ సోర్సింగ్‌లో 20 వేల మంది దాకా బోగస్ ఉద్యోగులు ఉంటారని అంచనా
- తాత్కాలిక ఉద్యోగుల లెక్కపై లేని స్పష్టత
- అన్ని శాఖల్లో రెగ్యులర్, టెంపరరీ ఎంప్లాయ్స్ లెక్కలు తీస్తున్న ఆర్థిక శాఖ
- ఆధార్ కార్డు, ఫోన్ నంబర్లతో ఈ నెల 25లోగా వివరాలు అప్‌డేట్ చేయాలని ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వంలో పని చేస్తున్న రెగ్యులర్, టెంపరరీ ఉద్యోగుల లెక్కలపై గందరగోళం నెలకొన్నది. ఏ శాఖలో ఎంతమంది రెగ్యులర్, టెంపరరీ ఉద్యోగులు పని చేస్తున్నారో వారి పూర్తి వివరాలు ఆర్థిక శాఖ వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేయాలని గతంలోనే ప్రభుత్వం ఆదేశించింది.
కానీ ఇంతవరకు ఆ వివరాలను పూర్తిస్థాయిలో నమోదు చేయకపోవడం, అవుట్ సోర్సింగ్ఉద్యోగాల లెక్కల్లో తేడాలు వస్తుండడంతో ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ఉద్యోగుల్లో దాదాపు 20 వేల మంది దాకా బోగస్ ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా జీహెచ్‌ఎంసీతో పాటు ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, ప్రభుత్వ సంస్థలు, యూనివర్సిటీల్లో బోగస్ఉద్యోగులు ఉన్నట్టు అనుమానిస్తున్నారు.
కాగా, కొందరి వివరాలు అప్‌డేట్ చేయలేదని, పూర్తిస్థాయిలో చేస్తే ఈ సంఖ్య తగ్గే అవకాశం ఉంటుందని సెక్రటేరియెట్ వర్గాలు వెల్లడించాయి.
అదే సమయంలో ప్రభుత్వంలోని వివిధ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, తాత్కాలిక సిబ్బంది వివరాల నమోదు విషయంలో కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, గౌరవ వేతనం, రోజువారీ వేతనం కింద ఉన్న అన్ని రకాల తాత్కాలిక సిబ్బంది వివరాలను ఐఎఫ్‌ఎంఐఎస్ పోర్టల్‌లోని కేడర్ స్ట్రెంత్ లాగిన్‌లో తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలని స్పష్టం చేసింది. అయితే వివరాల నమోదులో చాలా విభాగాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో శుక్రవారం ఆర్థిక శాఖ సర్క్యులర్ జారీ చేసింది.
ఆధార్ కార్డు వివరాలు, సెల్ నెంబర్‌తో సహా ఉద్యోగుల పూర్తి సమాచారాన్ని ఈ నెల 25లోగా తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలని అన్ని శాఖల అధిపతులు, కార్యదర్శులను ఆదేశించింది. గడువులోగా ఉద్యోగుల వివరాలను నమోదు చేయడంలో విఫలమైతే, ఆ సిబ్బందికి సంబంధించిన అక్టోబర్ నెల జీతం, రెమ్యునరేషన్ క్లెయిమ్ ప్రక్రియను అనుమతించబోమని ఆర్థిక శాఖ తేల్చి చెప్పింది.
డేటాను ఈ నెల 20లోపు అప్‌లోడ్ చేయాలని ఆదేశించినప్పటికీ, చాలా విభాగాలు ఆ ప్రక్రియను పూర్తి చేయలేకపోయాయి. సెక్రటేరియెట్‌లోని అన్ని విభాగాలు ఈ ఆదేశాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఆదేశాలు జారీ చేశారు.
శాఖలోని ఉద్యోగుల కంటే ..ఎక్కువ సంఖ్యలో అప్‌డేట్..
తాత్కాలిక ఉద్యోగుల గణాంకాలు గందరగోళానికి గురిచేస్తున్నాయి. రాష్ట్రంలోని మొత్తం తాత్కాలిక ఉద్యోగుల సంఖ్య 4,93,820గా చూపినప్పటికీ.. పలు శాఖల్లో ఉన్న తాత్కాలిక ఉద్యోగుల సంఖ్య కంటే పోర్టల్‌లో నమోదు చేసిన ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉంది.
వ్యవసాయ శాఖలో మొత్తం తాత్కాలిక ఉద్యోగులు 2,545 మంది అని చూపగా, పోర్టల్‌లో అప్‌డేట్ అయిన సంఖ్య 4,574గా ఉంది. బీసీ సంక్షేమ శాఖలో 4,983 మంది తాత్కాలిక ఉద్యోగులకు గాను, 5,135 మంది వివరాలు నమోదయ్యాయి. హెల్త్ డిపార్ట్మెంట్‌లో ఏకంగా 60,934 మంది తాత్కాలిక ఉద్యోగులు ఉండగా, నమోదైన సంఖ్య 62,801గా ఉంది.
మహిళా శిశు సంక్షేమ శాఖలో 60,492 మంది తాత్కాలిక ఉద్యోగులకు గాను 59,375 మంది వివరాలు నమోదయ్యాయి. అంతేగాక 15 వేల నుంచి 20 వేల మంది వరకు కేవలం రికార్డుల్లో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్స్‌గా నమోదైన్నట్టు తెలుస్తున్నది.
వీరంతా బోగస్ ఉద్యోగులై ఉంటారని, వారందరి జీతాలను కొందరు అధికారులు, అవుట్ సోర్సింగ్ఏజెన్సీలు అక్రమంగా కొట్టేస్తున్నట్టు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆధార్ కార్డును అథంటికేట్ చేయాలని ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకున్నది. ఏజెన్సీలు పీఎఫ్సౌకర్యం కల్పిస్తున్నాయా? లేదా? అన్నది కూడా చెక్చేయనున్నారు. ప్రతినెలా ఫస్ట్‌కే రెగ్యులర్ఉద్యోగులకు శాలరీలు ఇవ్వాలని భావిస్తున్నారు.
సగం మంది వివరాలే నమోదు..
ఆర్థిక శాఖకు ఈ నెల 16 నాటికి అందిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం 10,15,512 మంది రెగ్యులర్, తాత్కాలిక సిబ్బంది ఉండగా, కేవలం 4,97,220 మంది వివరాలు మాత్రమే ఐఎఫ్‌ఎంఐఎస్ పోర్టల్‌లో నమోదయ్యాయి. ముఖ్యంగా ఎనర్జీ విభాగం పరిస్థితి దారుణంగా ఉంది. ఆ శాఖలో మొత్తం 73,171 మంది రెగ్యులర్ ఉద్యోగులు ఉండగా, 44 మంది వివరాలు మాత్రమే అప్‌డేట్ చేశారు. ఇక ఆ శాఖలోని తాత్కాలిక ఉద్యోగులు 22,223 మందికి గాను 9 మంది వివరాలు మాత్రమే నమోదయ్యాయి.
సెకండరీ ఎడ్యుకేషన్ విభాగంలో అత్యధికంగా 1,17,167 మంది రెగ్యులర్ ఉద్యోగులు ఉండగా, 93,992 మంది వివరాలు అప్‌డేట్ అయ్యాయి. హోంశాఖలో మొత్తం 82,424 మంది రెగ్యులర్ ఉద్యోగులకు గాను 29,789 మంది వివరాలు మాత్రమే నమోదయ్యాయి.
పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ విభా గంలో అత్యధికంగా 94,179 మంది తాత్కాలిక ఉద్యోగులు ఉండగా, అందులో కేవలం 26,337 మంది వివరాలు మాత్రమే నమోదు చేశారు. హౌసింగ్ విభాగంలో రెగ్యులర్ ఉద్యోగులు 444 మందికి సంబం ధించి డేటా అప్‌డేట్ సున్నాగా ఉంది. అలాగే 289 మంది తాత్కాలిక ఉద్యోగుల డేటా కూడా సున్నాగా నమోదైంది. మొత్తం మీద కీలక విభాగాలైన రవాణా, రోడ్లు, భవనాలు, మైనారిటీస్ వెల్ఫేర్, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి వంటి పలు విభాగాల్లో డేటా నమోదు చాలా తక్కువగా ఉందని నివేదిక స్పష్టం చేసింది.