యూనియన్లపై ఉద్యోగ, ఉపాధ్యాయుల గుస్సా

యూనియన్లపై ఉద్యోగ, ఉపాధ్యాయుల గుస్సా
  • ఉద్యోగుల సమస్యలపై స్పందించాల్సిన టీఎన్జీవో, టీజీఓ నేతలు మౌనవ్రతం

హైదరాబాద్: టీఎన్జీవో , టీజీఓ సంఘాల నేతలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ సంఘాల నేతలు ప్రవర్తిస్తున్న తీరుపై ఉద్యోగ , ఉపాధ్యాయులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. 317 జీవో ను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేశారు టీచర్లు. ఉద్యోగుల్లో భార్యా భర్తలను.. కుటుంబ సభ్యులను వేర్వేరు జిల్లాలకు విడదీసేలా ఉన్న బదిలీల తీరు వల్ల కష్టాలు భరించలేమంటూ కొంతమంది టీచర్లు ఆత్మహత్యలు కూడా చేసుకున్న విషయం తెలిసిందే. 
అన్ని సంఘాలు ఆందోళన బాట పట్టినా...టీఎన్జీవో, టీజీవో, పీఆర్టీయూ సంఘాలు మాత్రం సైలెంట్ గా ఉన్నాయి. అటు ప్రభుత్వాన్ని ప్రశ్నించక... ఆత్మహత్య చేసుకున్న ఉపాధ్యాయ కుటుంబాలకు భరోసా ఇవ్వకపోవడంపై ఉద్యోగులు ఆగ్రహంతో ఉన్నారు. 
ఉద్యోగుల సమస్యలపై స్పందించాల్సిన టీఎన్జీవో, టీజీఓ నేతలు సైలెంట్ గా ఉంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. 317 జీవో విడుదల తర్వాత చాలామంది టీచర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఐనా టీఎన్జీవో నేతలు స్పందించలేదు. ఉద్యోగులకు సంబంధించిన ఏ సమస్యల పైనా కూడా ఈ మధ్య కాలంలో టీఎన్జీవో, టీజీవో నేతలు స్పందించ లేదు. మిగతా సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నా టీఎన్జీవో, టీజీవో సంఘాల నేతలు మాత్రం సైలెంట్ గా ఉండడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. 
సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో నేతలు సైలెంట్ గా ఉంటున్నారనే ప్రచారం ఉద్యోగ సంఘాల్లో ఉంది. గుర్తింపు ఉద్యోగ సంఘాలుగా 317  జీఓ పైన కానీ, ఇతర ఉద్యోగుల సమస్యలపైనా సీఎంతో సమావేశం కావాల్సిన బాధ్యత సంఘాల నేతలపై ఉన్నా ఆ ప్రయత్నం చేయడం లేదనే విమర్శలున్నాయి.
గతంలో టీఎన్జీవో, టీజీఓ సంఘాలు ఉద్యోగుల సమస్యలపై ఫోకస్ చేసేవి. సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేవి. ప్రభుత్వాలు పట్టించుకోకపోతే ఆందోళనలు కూడా చేసేవారు. కానీ ప్రస్తుతం ప్రభుత్వం ఎలాంటి జీవోలు ఇచ్చినా, ఆ జీవోలు ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉన్నా టీఎన్జీవో , టీజీవో సంఘాల నేతలు మాత్రం తమకేమీ పట్టనట్టుగా ఉంటున్నారనే ఆరోపణలున్నాయి. 
సోషల్ మీడియాలో, వాట్సప్ గ్రూప్ ల్లో TNGO,TGO నేతల పై సెటైర్లు వేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. ఉద్యోగ సంఘాలు ఉద్యోగులకూ అండగా ఉండడం లేదని పోస్ట్ లతో తమ అభిప్రాయాలను షేర్ చేసుకుంటున్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పటి ప్రభుత్వాలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన టీఎన్జీవో, టీజీవో సంఘాలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉంటున్నాయని ప్రశ్నిస్తున్నారు ఉద్యోగులు. టీఎన్జీవో టీజీవో ల్లో గత వైభవం లేకుండా పోయిందనే చర్చ ఉద్యోగుల్లో జరుగుతోంది. ఇది ఉద్యోగుల హక్కులను భవిష్యత్తులో కాలరాయడమే అవుతుందని అంటున్నారు.