ప్రమోషన్లు లేవు.. డీఏలు లేవు.. రాష్ట్ర సర్కార్ పై ఉద్యోగుల అసంతృప్తి

ప్రమోషన్లు లేవు.. డీఏలు లేవు.. రాష్ట్ర సర్కార్ పై ఉద్యోగుల అసంతృప్తి
  • రాష్ట్ర సర్కార్​పై ఉద్యోగుల అసంతృప్తి
  • మూడేండ్లుగా బదిలీలు చేయట్లేదు
  • ఈహెచ్ఎస్ అమలైతలే.. మెడికల్ బిల్లులు ఇస్తలే
  • సమస్యలు పరిష్కరించకపోవడంపై ఆగ్రహం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సర్కార్ పై ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. సమస్యలు పరిష్కరించడం లేదని ఫైర్ అవుతున్నారు. తమది ఎంప్లాయ్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పుకుంటున్న బీఆర్ఎస్ సర్కార్.. ఉద్యోగులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. పెండింగ్ డీఏలు ఇవ్వడం లేదని, మూడేండ్లుగా బదిలీలు, ప్రమోషన్లు లేవని, పీఆర్సీ, ఈహెచ్ఎస్ అమలు, 317 జీవో, సీపీఎస్ రద్దు తదితర సమస్యలు పరిష్కరించడం లేదని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. ‘‘రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు 3.20 లక్షల మంది ఉన్నారు. మరో 3 లక్షల మంది పెన్షనర్లు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కలిపి మొత్తంగా దాదాపు 9.50 లక్షల మంది ఉంటారు. ఉద్యోగులు, వాళ్ల కుటుంబసభ్యులు కలిపి 40 లక్షల మంది ఓటర్లు ఉంటారు. ప్రభుత్వం మా సమస్యలు పరిష్కరించకపోతే వచ్చే ఎన్నికల్లో మేమేంటో చూపిస్తాం” అని ఉద్యోగులు సర్కార్ ను హెచ్చరిస్తున్నారు.

పీఆర్సీ గడువు ఈ నెల 30తో ముగుస్తుంది. వచ్చే నెల 1 నుంచి కొత్త పీఆర్సీ అమలు కావాల్సి ఉంది. కానీ ప్రభుత్వం ఇంత వరకు పీఆర్సీ కమిటీ వేయలేదు. ఎలక్షన్ల తర్వాతే పీఆర్సీ ఇవ్వాలని సర్కార్ భావిస్తున్నట్లు తెలిసింది. పీఆర్సీ అమలు చేసే వరకు 30 శాతం ఐఆర్ (మధ్యంతర భృతి) ఇవ్వాలని నిర్ణయించిందని, అందుకే పీఆర్సీ కమిటీ వేయలేదని సమాచారం. ఐఆర్ నే ఇవ్వాలని ఉద్యోగులు కూడా కోరుతున్నారు. 2018 ఎన్నికల ముందు పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేసి, రెండేండ్ల తర్వాత రిపోర్టు ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. ఇక రాష్ర్ట ఏర్పాటు నాటి నుంచి సకాలంలో డీఏలు రావడం లేదని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. ‘‘గతంలో కేంద్రం ఇవ్వగానే డీఏలు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కానీ ఇప్పుడు కేంద్రం ఇచ్చినా ఇవ్వడం లేదు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఒక్క డీఏ అయినా ప్రకటిస్తారని ఆశించాం. కానీ సీఎం ఎలాంటి ప్రకటన చేయలేదు” అని వాపోయారు. కాగా, ఉద్యోగులకు 2022 
జనవరి, జులై, 2023 జనవరి డీఏలు పెండింగ్ లో ఉన్నాయి.