ఆఫీసర్స్‌‌ డుమ్మాలపై నజరేదీ?

ఆఫీసర్స్‌‌ డుమ్మాలపై నజరేదీ?

విద్యుత్‌‌ శాఖలో కొందరిపై విమర్శలు
ప్రస్తుతం హైదరాబాద్‌‌ హెడ్డాఫీస్‌‌లోనే బయోమెట్రిక్‌‌
రాష్ట్రమంతా అమలు చేయాలని వినియోగదారుల డిమాండ్‌‌

విద్యుత్‌‌ శాఖలో ఆఫీసర్లు, క్షేత్రస్థాయి సిబ్బంది గైర్హాజరుపై సరైన విధానం లేకపోవడంతో సమస్యల పరిష్కారంలో ఇబ్బందులేర్పడుతున్నాయి. జిల్లా, మండల, క్షేత్రస్థాయిలో చాలా మంది సిబ్బంది సంతకం పెట్టి వెళ్లిపోతున్నారన్న విమర్శలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని కరెంట్‌‌ ఆఫీసులు, సబ్‌‌స్టేషన్లలో బయోమెట్రిక్‌‌ పెట్టాలన్న డిమాండ్‌‌ వస్తోంది. ప్రస్తుతం టీఎస్‌‌ ఎస్‌‌పీడీసీఎల్‌‌ హెడ్డాఫీస్‌‌, మింట్‌‌ కాంపౌండ్‌‌, నార్త్‌‌ సర్కిళ్ల మెయిన్‌‌ ఆఫీసుల్లోనే బయోమెట్రిక్‌‌ ఉంది. ఇటీవలే అమల్లోకి వచ్చిన ఈ విధానంపై కొందరు అధికారులు చిర్రుబుర్రులాడుతున్నా.. దీని అమలుకే ప్రభుత్వం మొగ్గుచూపుతోంది. బయోమెట్రిక్‌‌ అమలు చేసినా గత నెలలో కొందరు ఎంప్లాయీస్‌‌ డ్యూటీలకు డుమ్మా కొట్టడంతో జీతంలో కోత పెట్టారు. సదరు అధికారులు తమ పలుకుబడి ఉపయోగించి రికమెండేషన్‌‌తో ఎలాగోలా పూర్తి జీతం పడేలా చేసుకున్నారు. కానీ ప్రతి నెలా ఇలా చేసుకోవడం ఇబ్బందికానున్న నేపథ్యంతో ఆఫీస్‌‌కు టైమ్‌‌కు రావడమే బెటరని ఫిక్స్‌‌ అయినట్టు సమాచారం.

బయోమెట్రిక్‌‌తోనే చెక్‌‌

టైమ్‌‌కు సిబ్బంది అందుబాటులో ఉండడం లేదని క్షేత్రస్థాయి నుంచి కంప్లేట్స్‌‌ వస్తున్న నేపథ్యంలో విద్యుత్‌‌ శాఖలోని అన్ని ఆఫీసులు, సబ్‌‌స్టేషన్లలో బయోమెట్రిక్‌‌ తీసుకురావాలని ప్రభుత్వం కొన్నాళ్ల క్రితమే ఆలోచన చేసినా కార్యరూపం దాల్చలేదు. ఈ మధ్యే ఏపీలోని విద్యుత్‌‌ శాఖలో పూర్తిస్థాయి బయోమెట్రిక్‌‌ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఇక్కడా అదే విధానాన్ని అమలు చేస్తే  క్షేత్రస్థాయి నుంచి కంప్లేంట్స్‌‌ తగ్గి సేవల్లో డిలే ఉండదని భావిస్తున్నారు.

అటెండెన్స్‌‌ మానిటరింగ్‌‌ యాప్‌‌ ఇంకా బెటర్‌‌

రాష్ట్రంలోని కరెంట్‌‌ ఆఫీసులు, సబ్‌‌స్టేషన్లలో ఇంకా రిజిస్టర్‌‌ విధానమే అమల్లో ఉంది. అటెండెన్స్‌‌ మానిటరింగ్‌‌ యాప్‌‌ను సిబ్బంది మోబైల్స్‌‌లో ఇన్‌‌స్టాల్‌‌ చేస్తే క్షేత్రస్థాయి సిబ్బంది ఆఫీసులో ఉన్నారా? ఎక్కడ పనిచేస్తున్నారు? వంటి విషయాలు ఈజీగా తెలుసుకునే వీలుంటుంది. క్షేత్రస్థాయి పరిశీలనలో ఉన్నామని చెబుతూ సొంత పనులపై వెళ్తున్న ఆఫీసర్స్‌‌కు ఈ యాప్‌‌ ద్వారా చెక్‌‌ పెట్టొచ్చు. నలుగురు పని చేయాల్సిన సబ్‌‌స్టేషన్‌‌లో వంతుల వారీగా ఒక్కొక్కరు పనిచేస్తూ మిగిలిన వారు డుమ్మాలు కొట్టడం వంటి వాటికీ ఈ యాప్‌‌తో చెక్‌‌ పడే అవకాశం ఉంది. ఆఫీసులు, విద్యుత్‌‌ లైన్లు, సబ్‌‌స్టేషన్లను జియోట్యాగింగ్‌‌ చేస్తే మరింత పారదర్శకత పెరగనుంది.