పీఎఫ్​ వడ్డీ త్వరలోనే వేస్తం

పీఎఫ్​ వడ్డీ త్వరలోనే వేస్తం

న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ ​ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్​(ఈపీఎఫ్ఓ) 2022-23 ఆర్థిక సంవత్సరానికి తన సభ్యులకు 8.15 శాతం వడ్డీ ఇవ్వనుందని సమాచారం. ఈ విషయమై సంస్థ ఇటీవల ఎక్స్​ (అధికారికంగా ట్విట్టర్)ద్వారా ఒక  అప్‌‌‌‌‌‌‌‌డేట్‌‌‌‌‌‌‌‌ ఇచ్చింది. “వడ్డీ జమ చేసే పనులు జరుగుతున్నాయి. అతి త్వరలో వివరాలు తెలుస్తాయి. వడ్డీని పూర్తిగా (అక్యుములేటెడ్​) చెల్లిస్తాం. నష్టం ఉండదు. ఈ విషయంలో ఓపికగా ఉండండి”అని కోరింది.

సకాలంలో వడ్డీ ఎందుకు చెల్లించడం లేదంటూ ప్రశ్నించిన ట్విట్టర్‌‌‌‌ యూజర్‌‌‌‌కు ఈ విధంగా సమాధానం ఇచ్చింది.  ఈపీఎఫ్​పై వడ్డీ రేటును ఏటా సమీక్షిస్తారు. 2022 ఆర్థిక సంవత్సరానికి 7.59 శాతం వడ్డీ చెల్లించారు. ఈసారి చెల్లించే 8.15 శాతం రేటు ఏప్రిల్ 2022 – మార్చి 2023 మధ్య చేసిన డిపాజిట్లకు వర్తిస్తుంది. వడ్డీని నెలవారీగా లెక్కించి  ఏటా ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో జమ చేస్తారు. ఈపీఎఫ్​ఓ ఆరు కోట్ల మంది సభ్యులతో  రూ. 12 లక్షల కోట్లకుపైగా విలువైన కార్పస్‌‌‌‌‌‌‌‌ను నిర్వహిస్తోంది.

 

ALSO READ : బీసీ కోటా అమలులో కాంగ్రెస్ ఫెయిల్ 

మూడు పథకాల ద్వారా తన లబ్ధిదారులకు పీఎఫ్​, పెన్షన్,  బీమా ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ఆగస్టులో కొత్తగా16.99 లక్షల మంది సంస్థలో చేరారు. ఈపీఎఫ్​ఓ సభ్యులు తమ పీఎఫ్ ఖాతా బ్యాలెన్స్,  వడ్డీ  క్రెడిట్‌‌‌‌‌‌‌‌లను ఈపీఎఫ్​ఓ పోర్టల్, ఉమంగ్​ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. లేదా తమ కస్టమర్ కేర్ నంబర్‌‌‌‌‌‌‌‌1800-118-005కు కాల్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చని ఈపీఎఫ్​ఓ పేర్కొంది.