
న్యూఢిల్లీ : న్యూఇండియా అస్యూరెన్స్ కింద మెగా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం చూస్తోంది. దీని కోసం డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్సియల్ సర్వీసెస్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ మధ్య చర్చలు జరుగుతున్నట్టు ప్రభుత్వ అధికారులు ధృవీకరించారు. ఈ విలీనం కోసం సంబంధిత విషయాలన్నంటినీ పరిశీలిస్తున్నట్టు తెలిపారు. న్యూ ఇండియా అస్యూరెన్స్ దేశంలోనే అతిపెద్ద జనరల్ ఇన్సూరర్. ఇండియాలో మొత్తం 25 జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలున్నాయి. వాటిలో నాలుగు న్యూ ఇండియా అస్యూరెన్స్, ఓరియెంటల్, నేషనల్, యునైటెడ్ ఇండియాలు మాత్రమే ప్రభుత్వ రంగ ఇన్సూరెన్స్ కంపెనీలు.
తొలుత 2019 బడ్జెట్‌లో ఓరియెంటల్, నేషనల్, యునైటెడ్ ఇన్సూరెన్స్‌లను కలిపి ఒక సంస్థగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. న్యూ ఇండియా అస్యూరెన్స్‌ను అలానే ఉంచాలనుకుంది. కానీ ప్రస్తుతం ఈ నాలుగు సంస్థలను కూడా కలిపేసి ఒక మెగా సంస్థగా ఏర్పాటు చేయాలని భావిస్తోంది. న్యూ ఇండియా అస్యూరెన్స్ మాత్రమే ఇప్పటివరకు లిస్ట్ అయి ఉంది. ఇది 2017లో స్టాక్ మార్కెట్‌లో లిస్టయింది. మిగతా మూడు ప్రభుత్వ రంగ ఇన్సూరర్స్ ఇంకా మార్కెట్‌లో లిస్ట్ కాలేదు. ఇప్పటికే ఇన్సూరెన్స్ రంగంలో చాలా ప్రైవేట్ సంస్థలున్నాయని ప్రభుత్వాధికారులు చెప్పారు. తొలుత ఆ మూడు సంస్థలను కలిపేసి, ఆ తర్వాత ఆ విలీన సంస్థను న్యూ ఇండియాలో విలీనం చేయాలని కూడా ప్రభుత్వం చూస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. ఇది న్యూ ఇండియా ఆర్థిక బలంపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నాయి. ఒకవేళ ఈ నాలుగు సంస్థలు కలిసి ఒక మెగా సంస్థగా ఏర్పడితే, వాటి వాటా ప్రీమియమ్స్‌లో సుమారు 42 శాతంగా ఉండనుంది.
గ్రాస్ డైరెక్ట్ ప్రీమియమ్స్‌లో న్యూ ఇండియా మార్కెట్ షేరు మే ముగింపు నాటికి 16.80 శాతంగా ఉందని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా తాజా డేటాలో వెల్లడైంది. మిగతా మూడు ప్రభుత్వ రంగ ఇన్సూరర్స్ వాటా 25 శాతం వరకు ఉంటుంది. నష్టాల్లో నడుస్తోన్న ప్రభుత్వ రంగ జనరల్ ఇన్సూరర్స్‌కు మద్దతు ఇస్తూ, ఆర్థిక మంత్రిత్వ శాఖ ముందుకు నడిపిస్తోంది. ఈ సంస్థల మధ్య ధరల కొట్లాటలను కూడా పరిష్కరిస్తోంది. దీంతో 2017 ఆర్థిక సంవత్సరంలో రూ.16,012 కోట్లుగా ఉన్న ప్రభుత్వ రంగ ఇన్సూరర్స్ నష్టాలు 2018 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.12,603 కోట్లకు తగ్గాయి. అయితే తొలుత మూడు చిన్న కంపెనీలను కలిపేసి వాటిని స్టెబిలైజ్ చేయడం ఉత్తమమని ఓరియెంటల్ మాజీ ఛైర్మన్ ఆర్‌కే కౌల్ చెప్పారు. న్యూ ఇండియా అస్యూరెన్స్ ప్రస్తుతం బాగానే పనిచేస్తోందని తెలిపారు. ఇంటర్నేషనల్‌గా కూడా ఇది మంచి ఉనికిని కలిగి ఉందన్నారు. ఈ సమయంలో దీని ఆపరేషన్స్‌కు అంతరాయాలు సృష్టించడం సరియైనది కాదని సూచించారు. ఐఆర్‌డీఏఐ తాజా వార్షిక రిపోర్ట్‌ల ప్రకారం నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ రంగం కూడా 2017లో 16.7 శాతం పెరిగినట్టు వెల్లడైంది.