హైదరాబాద్ లో అవినీతికి వ్యతిరేకంగా హౌసింగ్ సిబ్బంది పాదయాత్ర

హైదరాబాద్ లో అవినీతికి వ్యతిరేకంగా హౌసింగ్ సిబ్బంది పాదయాత్ర
  • ‌‌‌‌‌‌ప్రధాన కార్యాలయం నుంచి లిబర్టీ వరకు ర్యాలీ

హైదరాబాద్, వెలుగు: అవినీతికి వ్యతిరేకంగా హౌసింగ్​ కార్పొరేషన్​ సిబ్బంది శనివారం హైదరాబాద్ లో పాదయాత్ర చేశారు. ‘లంచం వద్దు, సేవే లక్ష్యం’, ‘నిజాయితీ మా విలువ-, అవినీతి మా శత్రువు’ అని రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు. 

హిమాయత్ నగర్ లోని ప్రధాన కార్యాలయం నుంచి లిబర్టీ వరకు పాదయాత్రగా తరలివెళ్లారు.  సంస్థ ఎండీ వీపీ గౌతమ్​ ఆధ్వర్యంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రాజెక్టు డైరెక్టర్లు, మేనేజర్లు, అసిస్టెంట్  మేనేజర్లు తదితర ఆపీసర్లతో పాటు, ప్రధాన కార్యాలయంలోని ఉన్నతాధికారులు, సిబ్బంది అందరూ కలిసి లిబర్టీ సమీపంలో మానవహారం నిర్వహించారు. 

అవినీతికి వ్యతిరేకంగా చేపడుతున్న కాల్ సెంటర్, హెల్ప్ డెస్క్  తదితర వివరాలతో కూడిన కార్యక్రమాల పోస్టర్లను ఆవిష్కరించి అవినీతికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంస్థ ఎండీ గౌతమ్​ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలులో భాగస్వామ్యులైన వివిధ విభాగాల సిబ్బంది, ఆఫీసర్లతో పాటు, ప్రజల్లో కూడా చైతన్యం తీసుకువచ్చేలా అవినీతి వ్యతిరేక కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు.