యాదిలో..ఆరో మొఘల్ చక్రవర్తి.. ఔరంగజేబు

యాదిలో..ఆరో మొఘల్ చక్రవర్తి..  ఔరంగజేబు

అక్బర్​ మనవడు, ఆరో మొఘల్​ చక్రవర్తి ఔరంగజేబు. 1618 నవంబర్​లో గుజరాత్​లోని దహడ్​లో పుట్టాడు. మొదట అతనికి మొహమ్మద్ అని పేరు పెట్టారు. తర్వాత ఆయన తండ్రి దాన్ని ఔరంగజేబుగా మార్చాడు. ఆ పేరుకు అర్థం సింహాసనపు ఆభరణం. చిన్నప్పుడు అతని విద్యాభ్యాసాన్ని ముస్లిం పాఠశాల అధ్యాపకుడికి అప్పగించారు. అతడు ఖురాన్​ని కంఠస్తం చేయించాడు. ఆయనకు 18 ఏండ్ల వయసులో ఈలోకం కంటే పరలోకం మీద ఆసక్తి ఉండేది. 

ఫకీరు దుస్తులు వేసుకుని, నిరాడంబరంగా ఏకాంతంగా దేవునితో గడపాలి అనుకునేవాడు.1636 నుంచి ఎనిమిదేండ్లపాటు దక్కన్​ వైస్రాయ్​గా ఉన్నాడు. 1644 మే 2న అగ్నిప్రమాదంలో గాయపడిన తన అక్కను చూడడానికి వెళ్లాడు. అప్పుడు ఆయన సైనిక దుస్తుల్లో రాజభవనంలోకి వెళ్లడం చూసిన తండ్రి కోపోద్రిక్తుడయ్యాడు. వెంటనే ఆయన పదవిని తీసేశాడు. తర్వాత ఆయన ఈ ప్రపంచాన్ని విసర్జించాలనే తన ఉద్దేశాన్ని ధైర్యంగా తండ్రికి చెప్పాడు. అందుకు తండ్రి ఆగ్రహంతో అతని పదవి, బిరుదు, ఆదాయాన్ని అదే నెల 28న వాపసు తీసుకున్నాడు. 

సంవత్సర కాలం పశ్చిమ ఘాట్​ అడవుల్లో దేవునితో సంభాషిస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత తిరిగి ఈ ప్రపంచంలోకి వచ్చాడు. ఔరంగజేబును తన తండ్రి మూడేండ్లలో బాల్ఖ్, బదక్షక్​ సంస్థానాలను పరిపాలించడానికి పంపాడు. కొంతకాలం గడిచిన తర్వాత గొప్ప పోరాట యోధులైన అలీ మర్దాన్, జయసింహ, సాద్​ అల్లా దగ్గర యుద్ధ విద్యలు, కఠిన పరిస్థితుల్లో దృఢంగా ఉండడమెలాగో నేర్చుకున్నాడు. షాజహాన్  కొడుకులతో లేదా వాళ్లలో వాళ్లే పోరాడుకోవాల్సిన పరిస్థితులు వస్తాయేమోనని భయపడి  దారాను తన దగ్గర ఉంచుకుని మిగతావారిని తలో దిక్కుకు పంపాడు. 

ఆ తర్వాత చక్రవర్తి అయిన దారాతో ఔరంగజేబుకు  కొన్ని మనస్పర్థలు వచ్చినా తిరిగి కలిసిపోయారు. షాజహాన్ జబ్బు పడ్డాడని తెలిసి ఔరంగజేబు నెమలి సింహాసనం కోసం పోరాటానికి రెడీ అయ్యాడు. అనుకున్నట్లే అన్నదమ్ముల మధ్య గొడవలు జరిగాయి. ఎట్టకేలకు నెమలి సింహాసనాన్ని అధిష్టించి.. 50 ఏండ్లపాటు పరిపాలించాడు. 1707 మార్చి 4న మరణించాడు. ఆయన ఇష్టానుసారమే దౌలతాబాద్​ దగ్గర సమాధి చేశారు. 

- మేకల మదన్​మోహన్​ రావు, కవి, రచయిత-