అమెరికా పెట్టుబడిదారీ దేశం.. మమ్దానీ సోషలిజం పని చేస్తుందా?

 అమెరికా పెట్టుబడిదారీ దేశం.. మమ్దానీ సోషలిజం పని చేస్తుందా?

ప్రస్తుత ప్రపంచ పరిస్థితిలో అమెరికా పెట్టుబడి దారీదేశం వ్యవస్థకు, యూరప్​లో చాలా దేశాల్లో అమలులో ఉన్న  పెట్టుబడిదారీ దేశాల మధ్య ఒక తేడా ఉంది. అమెరికాలో పెట్టుబడిదారీదేశం ఒక పాఠశాల విద్యావ్యవస్థ అంశంలో తప్ప మిగతా అన్ని రంగాల్లో ప్రజాజీవితం మార్కెట్​ పోటీలో బతకాల్సిందే. వైద్య రంగం, ట్రాన్స్​పోర్టు, ఉన్నత విద్య అన్ని ప్రైవేటు మార్కెట్​ పోటీలో నడుస్తున్నాయి. 

యూరప్​లోని చాలా దేశాల్లో  వైద్యం, గ్రాడ్యుయేషన్​ లెవల్​ వరకు విద్య, ఇతర కొన్ని రంగాల్లో ప్రభుత్వం వల్ల పేదలు, మధ్యతరగతి వారు కొంత సునాయాసంగా బతుకుతారు. అమెరికాలో అలా లేదు.  వృద్ధులకు కూడా అమెరికాలో పెద్దగా ప్రభుత్వ ఆదరణ లేదు. ఇంత బలమైన ప్రైవేటు ప్రజాస్వామ్య వ్యవస్థలో జోహరాన్​ మమ్దానీ న్యూయార్క్​ నగర  మేయర్​ ఒక డెమోక్రాటిక్​ సోషలిస్టు ఎజెండాతో గెలిచారు. 

కర్నాటక, తెలంగాణలో కాంగ్రెస్​ ఒక అడుగు ముందుకేసి చాలా రంగాల్లో పేదలకు, దిగువ మధ్యతరగతికి ఉచితాలను ప్రవేశ పెట్టినట్టు న్యూయార్క్​లో  కూడా అలాంటి ఉచితాలను ప్రకటించి గెలిచాడు. ట్రంప్​ ఫండమెంటలిస్ట్​ అమెరికా జాతీయవాద పట్టుదలకు వ్యతిరేకంగా మల్టీ–కల్చరల్​ అమెరికాకు తాను ప్రతినిధినని గెలిచాడు మమ్దానీ. తాను పుట్టుకతో అమెరికా సిటిజన్​ కాదు. తాను ముస్లిం. పాలస్తీనా మద్దతుదారు.


ఇజ్రాయెల్​ ప్రస్తుత పాలసీకి పూర్తిగా వ్యతిరేకిని అని చెప్పి కూడా ఎన్నికల్లో గెలవడం జోహర్​ డెమోక్రటిక్​​ పార్టీ ఎజెండాను మరో కొత్త మలుపుతిప్పాడు. అయితే అమెరికన్​ పెట్టుబడిదారీ వర్గం మమ్దానీని  తాను ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చనిస్తుందా?   ఒకవేళ ఆయన తన సోషలిస్టు ఎజెండా అమలు చేస్తే అమెరికాకు, ప్రపంచానికి  ఆయన నగరపాలన ఎటువంటి మెసేజ్​ను ఇస్తుంది చూడాలి. 

మొత్తం ప్రపంచంలో  ముఖ్యంగా ప్రజాస్వామ్యదేశాల్లో మతజాడ్యం పెరుగుతున్న దశలో మమ్దానీ అమెరికాలో తనకు తాను ముస్లింను అని ప్రకటించుకొని ఇండియా తల్లి వారసత్వాన్ని కాకుండా, ఉగాండా ముస్లిం తండ్రి వారసత్వాన్ని ఓన్​ చేసుకొని కూడా న్యూయార్క్​ వంటి అతిపెద్ద నగర మేయర్​గా గెలవడం విచిత్రమే. ఆయన  తల్లి మీరా నాయర్​ ముంబయిలో పుట్టి పెరిగిన స్త్రీ, ప్రఖ్యాత సినిమా ప్రొడ్యూసర్, తండ్రి గుజరాత్​ ముస్లిం ఉగాండాలో సెటిల్​ అయిన కుటుంబ నేపథ్యంకల వ్యక్తి. జోహరాన్​ పుట్టాకే వాళ్లు న్యూయార్క్​లో సెటిల్​ అయ్యారు.  అటువంటి నేపథ్యం ఉన్న జోహరాన్​ ట్రంప్​ను ఎదిరించి, పెట్టుబడిదారులందరినీ ఎదిరించి గెలవడం ఆశ్చర్యమే. అయితే, తన ప్రచార పద్ధతితోపోటు తాను ముందు తెచ్చిన వెల్ఫేర్​ స్కీములు ట్రంప్​ పాలసీలకు పూర్తిగా భిన్నమైనందున అక్కడి ప్రజానీకం ఒక ఎక్స్​పరిమెంటుగా ఓటు వేశారు. 

పెట్టుబడిదారీ వ్యవస్థ కొత్త అవతారం

గ్లోబలైజేషన్​ తరువాత పెట్టుబడిదారీ వ్యవస్థ కొత్త అవతారమెత్తింది. ఇప్పుడున్నది కారల్​ మార్క్స్ నాటి పెట్టుబడిదారీ వ్యవస్థ కాదు. ఆనాడు యూరప్​ దేశాల్లో క్రోనీ కేపిటలిజం .. అంటే రాజ్యం తన బడ్జెట్​ డబ్బును పెట్టుబడిదారులకు కాంట్రాక్టుల రూపంలో ఇచ్చి, సొంత కుటుంబ పెట్టుబడిదారుల ఆస్తులను  పెంచడం. ఈ  పద్ధతి రాజ్యంలో ఆదాయ మార్కెట్​ ఎకానమీ నుంచి పెరుగుతున్నా  కొంతమేరకు ప్రజాపన్నుల ద్వారా పెరుగుతుంది. అమెరికాలో ట్రంప్​ ఒక పెద్ద రియల్​ఎస్టేట్​ పెట్టుబడిదారుడు. ఆ పెట్టుబడిని ఇప్పుడు రాజ్య పన్నుల  నుంచి కూడా అతను పెంచుకుంటున్నాడు.

 ఎలాన్​ మస్క్​ కూడా రాజ్య డబ్బు ఆసరాతో  కొత్త ఎక్స్ పరిమెంటు  చేస్తున్నాడు. అందుకే అతను ట్రంప్​ను వేలకోట్లు పెట్టి గెలిపించాడు. భారతదేశంలో మోదీ, ఆర్​ఎస్​ఎస్​ అనుబంధంతో బాగా డబ్బు కూడబెట్టుకున్న పెట్టుబడిదారులు అదానీ, అంబానీలు. రాజ్యం వారికి కాంట్రాక్టులు ఇస్తుంది. వారు బీజేపీ, ఆర్​ఎస్ఎస్​కు ఆర్థిక వనరులు సమకూరుస్తారు. ఈ పద్ధతి కాంగ్రెస్​ అధికారంలో ఉన్నప్పుడు చిన్నరూపంలో ఉంటే ఇప్పుడది చాలా పెద్దరూపం తీసుకుంది. ఎన్నికల వ్యవస్థను బీజేపీ అనుకూలంగా ఈ క్రోనీ క్యాపిటలిస్టులే  నడుపుతున్నారు. 

దీంతో కాంగ్రెస్​గాని,  ఉత్తర భారతదేశంలో  ప్రాంతీయపార్టీలకు ఎన్నికలకు కావాల్సిన ఆదాయం లేదు. అందుకే బీజేపీ  సులభంగా డబ్బు, మందిబలం, ఆర్​ఎస్​ఎస్​ క్యాడర్​ ఆర్థిక, సోషల్​ మీడియా వనరులను దింపి గెలుస్తుంది. ఈస్థితిలో  కాంగ్రెస్​ జాతీయస్థాయిలో ఎన్నికలు గెలవడం కష్టం. మరి దీనికి మందు ఏమిటంటే.. ప్రజాపంపిణీని పెంచే వెల్ఫేర్​ వ్యవస్థను పెద్ద ఎత్తున ముందుకు తేవడం. కులగణన కూడా దీనికొక సాధనం. 

రాహుల్​ ఆలోచన అదే!

ప్రజలకు ఉచితాల  శాతం పెంచి పెట్టుబడుదారులకు చేరే కాంట్రాక్టు డబ్బును సంక్షోభంలో  పడెయ్యాలి. రాహుల్​ గాంధీ ఆలోచన ఇదే. ఈ పద్ధతిని మమ్దానీ అమెరికాలో కూడా ముందుకు తెచ్చాడు. శ్రమజీవులకు రాజ్యం చాలా ఉచితాలను ఇవ్వాలని పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఎన్నికల రంగాన్ని  ఇంకో రూపంలోకి మార్చాలి. ఇప్పటివరకు అమెరికాలో బస్సుల్లో ఫ్రీ ట్రావెల్, ల్యాండ్​ లార్డ్​పై రెంట్​ కంట్రోల్, ఉచిత ఇండ్ల నిర్మాణం (ఇందిరమ్మ ఇండ్లు) లాంటివి లేవు. పనికి వేతనాలిచ్చి, ఒబామాకేర్ లాంటి ఇన్సూరెన్స్ ద్వారా అతి తక్కువ ధరకు మెడికల్​ ఇన్సూరెన్సులు ఉన్నాయి. 

వాటిని అన్నింటినీ ట్రంప్​ వ్యతిరేకించి వాటికి  కమ్యూనిస్టు ఆర్థిక విధానాలు అని పేరుపెట్టాడు. అది గత ఆరునెలల్లోనే బెడిసికొట్టి ఇప్పుడు తక్కువ ఆదాయం ఉన్నవారికి ఇంటికి 200 డాలర్లు ఉచితంగా ఇస్తానంటున్నాడు. కానీ, జోహరాన్​ మమ్దానీ ఒక వ్యవస్థీకృత  ప్రజాస్వామ్య సోషలిజాన్ని ఎన్నికల ద్వారా అమెరికాలో ప్రవేశపెట్టాలని పోరాటం మొదలుపెట్టాడు. ఆ ఎజెండాతో ఇప్పడు గెలిచాడు. 

నెహ్రూ ఐడియాలజీ

ఈ సిద్ధాంత ఆరాధ్యుడు నెహ్రూ.. అందుకే మమ్దానీ నెహ్రూను కోట్​ చేసి అమెరికా ఆర్థికవేత్తలను ఆశ్చర్యపరిచాడు. ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చే ప్రజాస్వామ్య ప్రభుత్వాలు డెమోక్రాటిక్​ సోషలిస్ట్​ వ్యవస్థ ద్వారా అతి బీదలకు చేయూతనివ్వాలని ఒక అధికారిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది జవహర్​లాల్​ నెహ్రూనే.  అయితే, ఇదే సిద్ధాంతాన్ని కమ్యూనిస్టులు  ముందుకుతెచ్చిన ప్రొలటేరియట్​ డిక్టేటర్​షిప్​ను..వ్యతిరేకిస్తూనే, ఎన్నికల రంగానికి ముడేసి అంబేద్కర్​ స్టేట్​ సోషలిజం అన్నారు. మమ్దానీ తల్లిదండ్రులు నెహ్రూ  ఆలోచనలు కలిగినవారు. అంతేకాక భారతీయ ముస్లింలలో సోషలిజం బోధనతో  అంగీకరించేవారంతా నెహ్రూ ఆలోచనతో ఈ దేశంలో తమకూ బతుకుతెరువు ఉంటుందని నమ్మారు.  

మీరా–మమ్దానీ కుటుంబం వారి కొడుక్కు ఈ సిద్ధాంతాన్ని  చిన్నప్పటి నుండే  నూరిపోసినట్టు ఉన్నారు. ఇండియాలో ఉంటే జోహరాన్​ ఒక పెద్ద బాలీవుడ్​ యాక్టర్​ అయ్యేవాడు. షారుక్​ఖాన్​ను తలదన్నేవాడు. కానీ, అమెరికాలో  ఉండే అతను ఒక కొత్త ప్రజాస్వామ్య సోషలిస్టు ఆచరణకు తెరతీశాడు. అక్కడ రాజకీయ నాయకుడిగా ఎదిగాడు. 

కొత్త నాయకత్వాలు తప్పవు!

అమెరికాలో సమస్యలు అమెరికా పెట్టుబడిదారులు ఆయన్ని ఇప్పటికీ మేం న్యూయార్క్​ వదిలి వెళతామని బెదిరిస్తున్నారు.  న్యూయార్క్​ను ముంబయిగా మార్చాలని మమ్దానీ చూస్తున్నాడని ప్రకటనలు కూడా ఇస్తున్నారు. కానీ, మమ్దానీ డెమోక్రటిక్​ సోషలిస్ట్​ ఎన్నికల ప్రచారం అమెరికా అంతటా అంటుకుంటే ఎక్కడికి పోతారు పెట్టుబడిదారులు. ఒకవైపు అంత ధనం ఉన్న అమెరికాలో చలిలో రోడ్లమీద  పండే జనం ఉంటే ప్రైవేట్​ జెట్​లో పెట్టుబడిదారులు ప్రపంచమంతా తిరుగుతుంటే నీ దగ్గర ఉన్న డబ్బు మాదిరా అని  అన్ని రాష్ట్రాల లోయర్స్​, మిడిల్ క్లాస్​, వర్కింగ్​ క్లాస్​ అడ్డు తిరిగితే ఎక్కడికి పోతారు?   ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ చాలాచోట్ల ఇలా ఉండదు.  

ఒకవైపు చైనా, రష్యావంటి పాత సోషలిస్టు దేశాల్లో వర్గాల మధ్య అంతరాయం పెరిగి ప్రజలకు ఓటుహక్కు లేక ఏంచేయాలో అర్థంకాని స్థితి. పెట్టుబడిదారీ దేశాలు క్రోనీ కేపిటలిస్టు దేశాలుగా మారి వేల, లక్షల కోట్ల ప్రజాధనం ప్రైవేటు పరం అవుతుంటే  ప్రపంచంలో కొత్త నాయకత్వం పుట్టుకురాదు అనుకోవడం భ్రమ! చాలా కుటుంబాలను బతికించేందుకు కాంగ్రెస్​ పార్టీ  కొన్ని శక్తుల వ్యతిరేకతను ఛేదించుకొని  .. రాహుల్​గాంధీ సోషలిస్టు వెల్ఫేర్​ ఎకానమీని ఎత్తుకున్నాడు. 

ఈక్రమంలోనే జోహరాన్​ మమ్దానీ ఆ నినాదంతో కూడా ఎన్నికల్లో  ఎలా గెలవచ్చో  ఎక్స్​పెరిమెంటు చేసి చూపించాడు. ఇది అమెరికా ఎన్నికల రంగంలో పెనుమార్పు తెచ్చే అంశం. ఇప్పటికే టెక్సాస్​ స్టేట్​లో జేమ్సు అనే ఒక యువ డెమొక్రాట్​ సెనెటర్​ పోటీ చేస్తూ ఇటువంటి ప్రచారం చేస్తున్నాడు. అతను జీసెస్​నే ఒక సోషలిస్టుగా చూపిస్తున్నాడు. ప్రజల నుండి ఆదరణ పొందుతున్నాడు. 

- ప్రొ. కంచ ఐలయ్య షఫర్డ్​–