న్యూఢిల్లీ: ఆన్‌లైన్ ఎస్‌బీఐ, యోనో లైట్‌లో ఈ నెల 30 తర్వాత నుంచి ఎంక్యాష్ ఫీచర్‌ను ఉపయోగించడానికి వీలుండదు. స్టేట్ బ్యాంక్ ఇండియా (ఎస్‌బీఐ) ఈ సౌకర్యాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. గతంలో బెనిఫిషరీ రిజిస్ట్రేషన్ చేయకుండానే ఎంక్యాష్ ద్వారా ఎవరికైనా డబ్బు పంపడానికి వీలుండేది. మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఉంటే సరిపోయేది. కస్టమర్లు యూపీఐ, ఐఎంపీఎస్, నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ వంటి డిజిటల్ చెల్లింపు మార్గాలను ఉపయోగించాలని ఎస్‌బీఐ సూచించింది.
ఎంక్యాష్ ఎలా పనిచేస్తుందంటే?
ఎస్‌బీఐ కస్టమర్ తమ ఆన్‌లైన్ బ్యాంకింగ్ అకౌంట్ లేదా యోనో ద్వారా పంపిన డబ్బును ఎంక్యాష్ యాప్ ద్వారా బెనిఫిషరీ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ ట్రాన్సాక్షన్ పూర్తి చేయడానికి పాస్‌కోడ్ అవసరం. డబ్బు పంపిన ఎస్‌బీఐ కస్టమర్ 8 అంకెల పాస్‌కోడ్ సెట్ చేస్తారు. ఎవరికి డబ్బు పంపారో వారి మొబైల్ నెంబర్ లేదా ఈ–మెయిల్‌కు ఈ పాస్‌కోడ్ డిటెయిల్స్ వెళతాయి. ఎంక్యాష్ ద్వారా ఏ బ్యాంక్ ఖాతాలోకైనా ఫండ్స్‌ను క్లెయిమ్ చేసుకోవచ్చు. ఖాతా నంబర్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ను ఫేవరెట్‌గా సేవ్ చేసుకోవచ్చు.
