బిహార్ ఫలితాలు నమ్మశక్యంగా లేవు : కేసీ వేణుగోపాల్

బిహార్ ఫలితాలు నమ్మశక్యంగా లేవు : కేసీ వేణుగోపాల్

త్వరలో ఆధారాలతో సహా వస్తం: కేసీ వేణుగోపాల్

పార్టీ నేతలతో భేటీ అయిన రాహుల్, ఖర్గే.. ఓటమిపై సమీక్ష

న్యూఢిల్లీ: బిహార్​అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నమ్మశక్యంగాలేవని, వాటిని బిహార్​రాష్ట్ర ప్రజలే విశ్వసించడం లేదని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ(ఆర్గనైజేషన్) కేసీ వేణుగోపాల్​అన్నారు. మొత్తం ఎన్నికల ప్రక్రియ ప్రశ్నార్థకంగా ఉందని, పారదర్శకత లేదని ఆరోపించారు. 

బిహార్ రిజల్ట్స్​పై పార్టీ విశ్లేషిస్తున్నదని కొద్దిరోజుల్లో కచ్చితమైన రుజువులతో వస్తామని తెలిపారు. బిహార్​అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఫలితాలపై చర్చించేందుకు శనివారం కాంగ్రెస్​జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్​సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్​అగ్రనేత రాహుల్​గాంధీ భేటీ అయ్యారు. 

ఢిల్లీలోని ఖర్గే నివాసంలో జరిగిన ఈ సమావేశంలో కేసీ వేణుగోపాల్, పార్టీ ట్రెజరర్ అజయ్​మాకెన్, బిహార్ కాంగ్రెస్​ఇన్​చార్జ్ కృష్ణ అల్లవరు పాల్గొన్నారు. సమావేశం తర్వాత కేసీ వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతూ బిహార్​ఫలితాలు విశ్వసించేలా లేవన్నారు. మా కూటమి పక్షాలతో కూడా చర్చించామని వారు కూడా వీటిని నమ్మడం లేదని చెప్పారు. ఎందుకంటే ఒక పార్టీకి 90 శాతం కంటే ఎక్కవ స్ట్రైక్​రేటు రావడం అనేది హిస్టరీలోనే లేదన్నారు. 

ఈ రిజల్ట్స్ పై మేం సమగ్రంగా విశ్లేషిస్తున్నామని, బిహార్ అంతటా కూడా డేటా సేకరిస్తున్నామని ఒకటిరెండు వారాల్లో కచ్చితమైన రుజువులతో వస్తామన్నారు. ఎన్నికల కమిషన్​తీరు ఏకపక్షంగా, సందేహాస్పదంగా ఉందని.. ఈ విషయాన్ని తమ కూటమి ఎన్నికల ప్రచారంలో నిరంతరంగా లేవనెత్తిందని గుర్తుచేశారు. ఎలక్షన్ ‘ఫెయిర్​గా లేదు”అని రాహుల్​గాంధీ చేసిన కామెంట్ల గురించి మీడియా అడిగా.. ‘‘మేము ఎన్నికల కమిషన్ పాత్ర గురించి మాట్లాడుతున్నం. 

హర్యానా అసెంబ్లీ ఎన్నికలు రిగ్గింగ్ అయ్యాయని ఆరోపించాం. ఆధారాలతో సహా ఈ విషయం చెప్పాం. మేం చూపిన ఆధారాలపై సందేహాలుంటే అడగాలని ఎన్నికల కమిషన్ ను కూడా కోరాము’’అని వేణుగోపాల్ అన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేసిన 61 సీట్లలో కేవలం ఆరు చోట్ల మాత్రమే గెలిచింది. ఇది 2010 తర్వాత రెండో దారుణ ఓటమి. అప్పుడు కేవలం నాలుగు సీట్లు వచ్చాయి.