National Press Day ( Novemner 16) : పత్రికలు పీడితుల స్వరమై నిలవాలి..ప్రజాస్వామ్యంలో పత్రికలదే కీలక పాత్ర

National Press Day  ( Novemner 16) : పత్రికలు పీడితుల స్వరమై నిలవాలి..ప్రజాస్వామ్యంలో పత్రికలదే కీలక పాత్ర

ప్రజాస్వామ్య విప్లవం వర్ధిల్లాలంటే పత్రికలదే కీలక పాత్ర. నిరంతరం సామాజిక చైతన్యానికి సేంద్రీయ పదార్థమై ముందుకు నడిపిస్తాయి. అందుకే పత్రికలను నాలుగో స్తంభంగా అభివర్ణిస్తారు.  ప్రభుత్వ నిర్ణయాలు, విధానాల గురించి ప్రజలకు తెలియజేస్తాయి. ప్రజల స్పందనను ప్రభుత్వానికి అందిస్తాయి. పత్రికలు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఒక వారధిగా వ్యవహరిస్తాయి. 

అమెరికాలాంటి ప్రజాస్వామ్య సమాజంలో పత్రికలను ప్రత్యామ్నాయ ప్రభుత్వంగా, ప్రజా కోర్టుగా పేర్కొంటారు. ప్రపంచంలోని ఏ ప్రజాస్వామ్య సమాజంలోనైనా జరుగుతున్న సంఘటనలు,  పరిణామాలు తాలూకు సమగ్ర సమాచారాన్ని పౌరులకు అందించడంలో పత్రికలు తోడ్పడతాయి. ఆ సమాచారాన్ని విశ్లేషిస్తాయి లేదా వాటికి భాష్యం చెబుతాయి. విశ్లేషణతో కూడిన  సంపాదకీయాలు, వ్యాసాలు ప్రచురిస్తాయి.

పత్రికా స్వేచ్ఛ విషయంలో భారత రాజ్యాంగంలో ఎక్కడా అధికారికంగా ప్రస్తావించకపోయినప్పటికీ   అధికరణ19A(1) ప్రకారం పౌరులందరికీ కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగానే పత్రికా స్వేచ్ఛను చూస్తుంటారు. ఈ విషయాన్ని ‘క్రాస్ రోడ్స్’ అనే వారపత్రిక విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో  నిర్వచించినది. 

ఇండియాలో పత్రికా స్వేచ్ఛను పరిరక్షించడానికి నవంబర్ 16న 1966లో 'ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా"ను ఏర్పాటు చేశారు. ఈ కౌన్సిల్​ను 1978లో చట్టంగా మార్చి  పత్రికా స్వేచ్చను  కాపాడే  ప్రయత్నం చేశారు. కావున ప్రతి ఏటా నవంబర్16న జాతీయ ప్రెస్ దినోత్సవం  జరుపుకుంటారు 

పత్రికా స్వేచ్ఛకు సవాళ్లు

ప్రపంచ వ్యాప్తంగా 180 దేశాలు, ప్రాంతాల్లో పత్రికా స్వేచ్ఛ తీరుతెన్నులను తెలిపే వరల్డ్‌‌‌‌‌‌‌‌ ప్రెస్‌‌‌‌‌‌‌‌ ఫ్రీడం ఇండెక్స్​ను  ప్యారిస్‌‌‌‌‌‌‌‌లోని రిపోర్టర్స్‌‌‌‌‌‌‌‌ వితౌట్‌‌‌‌‌‌‌‌ బార్డర్స్‌‌‌‌‌‌‌‌ అనే సంస్థ ప్రతి ఏటా అంతర్జాతీయ పత్రికా దినోత్సవం రోజైన మే 3వ తేదీన విడుదల చేస్తోంది. ఈ ఏడాది పత్రికా స్వేచ్ఛ సూచీలో 180 దేశాలకుగాను భారత్ 151 వ  స్థానంలో ఉంది. 

గతేడాది159వ  స్థానంలో నిలిచింది. గతేడాది కంటే కొంత మెరుగుపడిన "చాలా తీవ్రమైన" వర్గంలోనే ఉందని పేర్కొన్నది. మన పొరుగు దేశాలైన నేపాల్ (90వ స్థానం),  మాల్దీవులు (104వ స్థానం), శ్రీలంక (139వ స్థానం), బంగ్లాదేశ్ (149వ స్థానం) కంటే దిగువన ఉన్నాం. ఈ సూచీలో నార్వే, ఎస్టోనియా, నెదర్లాండ్స్ వరుసగా మొదటి మూడు స్థానాల్లో ఉండగా...ఎరిత్రియా లిస్ట్‌‌‌‌‌‌‌‌లో అట్టడుగున ఉంది. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌‌‌‌‌‌‌‌లో పత్రికా స్వేచ్ఛకు ఎదురవుతున్న సవాళ్లను సైతం వరల్డ్‌‌‌‌‌‌‌‌ ప్రెస్‌‌‌‌‌‌‌‌ ఫ్రీడమ్‌‌‌‌‌‌‌‌ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌ వ్యాఖ్యానించింది. 

రాజకీయ, కార్పొరేట్ సంస్థల ఆధిపత్యం మీడియా స్వాతంత్ర్యానికి ముప్పు కలిగిస్తున్నాయి. ప్రభుత్వాన్ని విమర్శించే జర్నలిస్టులు వేధింపులు, బెదిరింపులు, చట్టపరమైన ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నది. ఈ క్రమంలో  ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు, ప్రజా సంఘాలు, ప్రభుత్వాలు పత్రికలకు వెన్నుదన్నుగా నిలవాల్సిన అవసరం ఉంది. 

పత్రికలు పీడిత వర్గాల  గొంతుక కావాలి

పత్రికలు సమాజంలోని అన్యాయాలు, నిరంకుశత్వం, వివక్ష వంటి సమస్యలను ప్రస్తావిస్తూ అణగారిన వర్గాల చైతన్యం కోసం  కృషి చేయాలని  డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్  పేర్కొన్నారు. ఆయన మూక్ నాయక్,  బహిష్కృత భారత్, సమత, జనతా వంటి పత్రికలను ప్రారంభించి అట్టడుగు, అణగారిన వర్గాల సమస్యలను ప్రస్తావించారు. వారి విముక్తి కోసం పనిచేశారు. 

చారిత్రకంగా కులతత్వంతో కూడిన భారతదేశంలో మెజారిటీ మీడియా రంగం సైతం కొన్ని ఆధిపత్య కులాల చేతిలోనే ఉందనేది కాదనలేని సత్యం. దీంతో  పీడిత వర్గాల సమస్యలకు ఆశించిన స్థాయిలో స్థానం లభించడం లేదనే అపవాదు ఉంది.  పేదల కష్టాలను, నిరుద్యోగుల వెతలను, అధికారుల అవినీతిని  ప్రజలు,  ప్రభుత్వాల ముందు ఉంచాలి.   కొన్ని సందర్భాలలో స్వేచ్ఛ పేరుతో వాస్తవాలను కూడా వక్రీకరించడం జరుగుతుంటాయి. ఫలితంగా పత్రికలు తమ ఉనికిని కోల్పోతాయి. 

ప్రభుత్వాలు జర్నలిస్టులకు రక్షణ కల్పించాలి. జర్నలిజంలో నైతికత అవసరం. ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాలు క్షణాల్లో వార్తను చేరవేస్తున్నాయి. మరోవైపు తప్పుడు వార్తలను కూడా వైరల్ చేస్తున్నాయి.  ఈ క్రమంలో పత్రికలు మరింత బాధ్యతాయుతంగా మెదులుతూ, విశ్వసనీయతను మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉంది.

పత్రికలకు పెరుగుతున్న ఆదరణ

భారతదేశంలో స్వాతంత్ర్యోద్యమ కాలం నుంచి నేటి వరకు ప్రజలను చైతన్యం చేసే ముఖ్య సాధనాలు పత్రికలే. ఇటీవల భారతదేశంలో వార్తా దినపత్రికలకు ఆదరణ పెరిగిందని ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్(ఏబీసీ) తెలపడం సానుకూలాంశం. 

ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు నిర్వహించిన ఆడిటింగ్ వివరాల గణాంకాల ప్రకారం మొదటి ఆరు నెలల్లో వార్తా దినపత్రికల అమ్మకాల్లో పురోగతి కనబడడం ఇందుకు నిదర్శనం. గత ఏడాదితో పోల్చితే ఇది 2.77శాతం అధికమని ఏబీసీ తెలిపింది. ఈ పురోగతి వార్తా దినపత్రికలపై పాఠకులకున్న నమ్మకాన్ని తెలియజేస్తోందని అభిప్రాయపడింది. అంతేకాదు విశ్వసనీయ, ధ్రువీకరించిన, లోతైన సమాచారం కోసం పాఠకులు వార్తా దినపత్రికలను చదువుతున్నారని ఏబీసీ వెల్లడించింది. 

దినపత్రికలు శక్తిమంతమైన మాధ్యమంగా మారాయనడానికి సర్క్యులేషన్ పెరుగుదల నిదర్శనంగా నిలుస్తోందని ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్ తెలిపింది. ఈ క్రమంలో పత్రికలు స్వేచ్ఛగా, బాధ్యతగా వ్యవహరించి ప్రజల పక్షాన నిలిచినప్పుడు మరింత ఆదరణ పెరుగుతుంది.

- సంపతి రమేశ్ మహరాజ్, సోషల్​ ఎనలిస్ట్​–