సమగ్ర శిక్ష ఉద్యోగులకు.. అక్టోబర్ జీతాలు రాలె

సమగ్ర శిక్ష ఉద్యోగులకు.. అక్టోబర్ జీతాలు రాలె

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సమగ్ర శిక్షలో పని చేస్తున్న ఉద్యోగులకు అక్టోబర్ నెలకు సంబంధించి ఇంత వరకూ జీతాలు రాలేదు. దీపావళి వరకైనా జీతాలు వస్తాయని ఎదురు చూసినప్పటికీ.. నవంబర్ నెలలో సగం రోజులు గడిచినా ఇప్పటికీ జీతం అందలేదు. సర్కారు పెద్దలు మాత్రం ప్రతి నెలా ఫస్ట్ వీక్ లోపే జీతాలిస్తున్నట్టు చెప్తున్నారు. అయితే, సమగ్ర శిక్షలో బడ్జెట్ లేకపోవడంతోనే జీతాలు ఆగిపోయాయని అధికారులు పేర్కొంటున్నారు. 

రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష అభియాన్ (ఎస్​ఎస్​ఏ) ప్రాజెక్టు కింద 18,600 మంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో కేజీబీవీ టీచర్లు, సిబ్బంది, సీఆర్పీలు, ఎంఐఎస్​ కోఆర్డినేటర్లు, మోడల్ స్కూల్ హాస్టల్ సిబ్బంది, పీటీఐలు, ఐఈఆర్పీలు, కంప్యూటర్ ఆపరేటర్లు తదితర ఎంప్లాయీస్ ఉన్నారు. వీరికి వచ్చేదే తక్కువ జీతం.. దాన్నీ కూడా ప్రభుత్వం సకాలంలో ఇవ్వడం లేదు.  దీంతో ఎంప్లాయీస్ అంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

ఈఎంఐలు, ఇంటి కిరాయిలు, ఇతర అవసరాలకు అప్పులు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ ప్రాజెక్టుకు కేంద్రం 60% నిధులు ఇస్తే, 40% రాష్ట్రం ఇస్తుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 2023–24 విద్యా సంవత్సరానికి గానూ ఫస్ట్ ఫేజ్ నిధులను రెండు నెలల క్రితమే రిలీజ్ చేసింది. అయినా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం బడ్జెట్ ను విడుదల చేయకపోవడంతో సమగ్ర శిక్ష ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే బడ్జెట్ రిలీజ్ చేసి, జీతాలు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.