నల్గొండ జిల్లాలో కూలీల ఉపాధి బాట.. రూ.307కు పెరిగిన కూలీ

నల్గొండ జిల్లాలో కూలీల ఉపాధి బాట.. రూ.307కు పెరిగిన కూలీ
  • కరువు పనులకు డిమాండ్ 
  • రూ.307కు పెరిగిన కూలీ 
  • కూలీ గిట్టుబాటు అయ్యేలా చర్యలు 

నల్గొండ, యాదాద్రి, వెలుగు : గ్రామాల్లో ఉపాధి హామీ స్కీంలో కూలీలు పనుల బాట పట్టారు. సాగు పనులు తగ్గిపోవడంతో కూలీలు ఉపాధి పనుల వైపు మొగ్గుచూపుతున్నారు. 2005లో ప్రారంభమైన ఈ స్కీమ్ 2006లో అమల్లోకి వచ్చింది. కూలీల నుంచి వస్తున్న డిమాండ్ స్థాయిలో కాకున్నా ఎంతో కొంత కూలీ పెంచుతూ వస్తోంది. నిరుడు రోజువారీ వేతనం 300 ఉండగా, తాజాగా కేంద్ర ప్రభుత్వం రూ.307కు పెంచింది. 

కూలీలకు దినసరి వేతనం గిట్టుబాటు అయ్యేలా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ చర్యలు చేపట్టింది. సగటున రూ.250 వరకు కూలీలకు అందేలా అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో నల్గొండ జిల్లాలోని 844 గ్రామాలు, సూర్యాపేట జిల్లాలో 475, యాదాద్రి జిల్లాలో 428 పంచాయతీల్లో ఉపాధి హామీ పనులు కొనసాగుతున్నాయి.

కార్డులు ఎక్కువే.. కూలీల హాజరు తక్కువ..

ఉపాధి హామీలో జాబ్ కార్డులు పొందిన వారిలో ఎక్కువ మంది పనులకు వెళ్లడం లేదు. యాదాద్రి జిల్లాలో 1.47 జాబ్​కార్డులు ఉండగా, 2.63 లక్షల మంది మెంబర్లు ఉన్నారు. వీరిలో 1.27 లక్షల మంది మాత్రమే యాక్టివ్​గా ఉన్నారు. అయితే 90 వేల మంది వరకు రెగ్యులర్​గా పనులకు వెళ్తున్నారు. నల్గొండ జిల్లాలో 60 వేల మందికి పైగా, సూర్యాపేట జిల్లాలో 37,775 మంది కూలీలు ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారు. అయితే గతంలో కంటే ఈ సీజన్​లో ఎక్కువ మంది పనులకు వెళ్తున్నారు. 

ఆయకట్టులోనూ పనులకు డిమాండ్​..  

నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలోని మిర్యాలగూడ, నాగార్జునసాగర్​లో కరువు పనులకు డిమాండ్ ​పెరిగింది. ఎఎమ్మార్పీ, డిండి ప్రాజెక్టుల కింద కరువు పరిస్థితి కారణంగా డిండి మండలంలో 3,951 మంది కూలీలు ఉపాధి పనులకు వెళ్తున్నారు. దేవరకొండ మండలంలో 4,568 మంది కూలీలు కరువు పనులపై ఆధారపడుతున్నారు. 

ఎఎమ్మార్పీ పరిధిలోని తిప్పర్తి మండలంలో 2,434 మంది, పీఏపల్లిలో 3,312 మంది కూలీలు హాజరవుతున్నారు. మిర్యాలగూడ మండలంలో 2,944 మంది, తిరుమలగిరి సాగర్​లో 2,720 మంది కూలీలు ఉపాధి పనులు చేస్తున్నారు. మూసీ ప్రాజెక్టు పరిధిలోని నార్కట్​పల్లి, చిట్యాల, కట్టంగూరు మండలాల్లో సైతం ఉపాధి పనులు జోరుగా సాగుతున్నాయి. 

సగటున 300 పని దినాలు..

కరువు నేపథ్యంలో ఈసారి లేబర్ బడ్జెట్ భారీగా పెంచారు. ప్రతి గ్రామంలో సగటున300 పనిదినాలు అందుబాటులో ఉంచారు. కూలీలు ఎప్పుడు పని అడిగినా లేదనకుండా అన్ని రకాల పనులు సిద్ధం చేశారు. ప్రస్తుతం జిల్లాలో ఫాం పాండ్స్, కందకాల తవ్వకం, చెరువుల పూడికతీత, ఫీడర్​చానల్స్, ఎస్సీ, ఎస్టీ, సన్నచిన్న కారు రైతుల భూముల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. నల్గొండ జిల్లావ్యాప్తంగా 3,56,218 కుటుంబాలు ఉండగా.. 7,62,848 మందికి జాబ్​కార్డులు ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో 2.62 లక్షల జాబ్ కార్డులు ఉండగా, వీటిలో 5.70 లక్షల కూలీలు నమోదై ఉన్నారు. 

యాదాద్రి జిల్లాలో 1.43 లక్షల కార్డులు ఉండగా, 2.63 లక్షల మంది కూలీలు నమోదై ఉన్నారు. ఎండాకాలంలో పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో  పని జరిగే ప్రదేశాల్లో కూలీలకు ఎం డ దెబ్బ తగలకుండా ఉండేందుకు ఓఆర్ఎస్​ప్యాకెట్లు అందిస్తున్నారు. వడదెబ్బ తగిలిన కూలీలకు వెంటనే వైద్యం చేసేందుకు ఫస్ట్​ఎయిడ్ కిట్స్​కూడా అందుబాటులో ఉంచినట్టు ఆఫీసర్లు చెప్పారు.

అడిగినంత పని కల్పిస్తాం.. 

కరువు నేపథ్యంలో కూలీలకు అడిగినంత పని కల్పించేందుకు సిద్ధంగా ఉన్నాం. అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రతి కూలీకి సగటున వేతనం గిట్టుబాటు అయ్యేలా చర్యలు చేపట్టాం.
వీవీ అప్పారావు, డీఆర్డీఏ పీడీ, సూర్యాపేట జిల్లా