దళితుల అభ్యున్నతి కోసం ఎంపవర్ మెంట్ పధకం: కేసీఆర్

దళితుల అభ్యున్నతి కోసం ఎంపవర్ మెంట్ పధకం: కేసీఆర్
  • దళితుల్లో అర్హులైన కుటుంబాల గణన జరగాలి
  • పారదర్శకంగా మధ్య దళారులు లేని విధానం కోసం సూచనలివ్వండి
  • ప్రగతిభవన్ అఖిలపక్ష సమావేశంలో సీఎం కేసీఆర్

హైదరాబాద్: దళితుల అభ్యున్నతి కోసమే సీఎం దళిత్ ఎంపవర్ మెంట్ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని భావిస్తున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. రైతు బంధు పథకం, ఆసరా పెన్షన్ల  మాదిరి నేరుగా ఆర్ధిక సాయం అందే విధంగా...అత్యంత పారదర్శకంగా, మధ్య దళారీలు లేని విధానం కోసం సూచనలు, సలహాలు ఇవ్వాలని అఖిల పక్ష సమావేశంలో పాల్గొన్న నాయకులను కేసీఆర్ కోరారు. ఆదివారం ప్రగతి భవన్ లో అఖిలపక్ష భేటీ జరిగింది. 
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. భూమి ఉత్పత్తి సాధనంగా ఇన్నాళ్లూ జీవనోపాధి సాగింది, అయితే మారిన పరిస్థితుల్లో పారిశ్రామిక, సాంకేతిక తదితర రంగాల్లో దళిత యువత స్వయం ఉపాధి అన్వేషించాలని సీఎం కేసీఆర్ సూచించారు. గోరటి వెంకన్న.. గల్లీ చిన్నది.. ఆయన పాటను మనసు పెట్టి వింటే దళితుల సమస్యకు పరిష్కారాలు దొరుకుతాయని  సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దళితుల్లో అర్హులైన కుటుంబాల గణన జరగాల్సి ఉందని, గ్రామీణ, పట్టణ దళితుల సమస్యలను విడి విడిగా గుర్తించి పరిష్కారాలు వెతకాలన్నారు. దళితుల సామాజిక ఆర్థిక సమస్యలను గుర్తించి సమిష్టి కృషితో సమాధానాలు సాధించాల్సి ఉందన్నారు. అట్టడుగున వున్న వారి నుంచి సహాయం ప్రారంభించి వారి అభ్యున్నతిని సాంకేతిక విధానం ద్వారా నిత్యం పర్యవేక్షించాలన్నారు. అందుకు సంబంధించిన కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నదని సీఎం వెల్లడించారు.

ఈ బడ్జెట్ లో సిఎం దళిత్ ఎంపవర్ మెంట్ పథకానికి రూ.1000 కోట్లు కేటాయించాలనుకున్నాం, మరో 500 కోట్లు పెంచడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని కేసీఆర్ వెల్లడించారు. రాబోయే మూడు నాలుగేండ్లలో 35 నుంచి 40 వేల కోట్ల రూపాయలు ఖర్చుచేయాలని ప్రభుత్వం యోచిస్తున్నదని, ఈ బడ్జెట్, ఎస్సీ సబ్ ప్లాన్ కు అదనం అని  సిఎం కేసీఆర్ వివరించారు. దళిత సాధికారతను సాధించడానికి ప్రభుత్వం మిషన్ మోడ్ లో పనిచేయడానికి నిశ్చయించుకున్నదని మీరందరూ కలిసిరావాలన్నారు. నాకు భగవంతుడిచ్చిన సర్వ శక్తులన్నీ ఉపయోగించి, సిఎం దళిత సాధికారత పథకాన్ని సంపూర్ణంగా విజయవంతం చేయాలనేదే నా దృఢ సంకల్పం  సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.