
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ భూక్యా హరిరాం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ దర్యాప్తు మమ్మరం చేసింది. కోర్టు అనుమతితో 5 రోజుల పాటు ఆయనను విచారించనున్నది. శుక్రవారం ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి హరిరాంను ఏసీబీ తమ కస్టడీలోకి తీసుకున్నది. సిటీ రేంజ్– 1 డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో హరిరాంను ప్రశ్నిస్తున్నారు. సోదాల్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లు, బ్యాంక్ అకౌంట్లు, బినామీ పేర్లతో ఉన్న ఆస్తుల వివరాలను రాబట్టనున్నారు.
ఏఈ నుంచి ఈఎన్సీ దాకా కీలక పదవులే
మొదటి రోజు కస్టడీ విచారణలో భూక్యా హరిరాం(59)కు చెందిన వ్యక్తిగత , కుటుంబ, ఆర్థిక వివరాలు సేకరించారు. ఉద్యోగంలో చేరడానికి ముందు, చేరిన తర్వాత ఆయన సంపాదన గురించి ఆరా తీశారు. ఇప్పటికే ఏసీబీ సేకరించిన ప్రాథమిక వివరాల ప్రకారం.. ఏపీపీఎస్సీ రిక్రూట్‌మెంట్ ద్వారా1989 అక్టోబర్ 11న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఏఈఈ)గా ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో హరిరాం చేరారు. ప్రమోషన్లవారీగా వివిధ హోదాల్లో పనిచేశారు. ఈ క్రమంలో నాటి సర్కారు ఆశీస్సులతో అతి తక్కువ సమయంలోనే ఇంజినీర్ ఇన్ చీఫ్‌గా ప్రమోషన్ పొందినట్టు అధికారులు గుర్తించారని సమాచారం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్‌కు ముందు గజ్వేల్ ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్(సీఏడీ) ఇంజినీర్ ఇన్ చీఫ్‌గా హరిరాం పనిచేస్తున్నారు.
ఇరిగేషన్ శాఖలో అత్యున్నత పదవులు
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో హరిరాం కీలకంగా వ్యవహరించారు. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ డైరెక్టర్, ఎండీగా విధులు నిర్వర్తించారు. 2016 ఆగస్టు 5 నుంచి 2017 ఫిబ్రవరి 28 వ తేదీ వరకు డైరెక్టర్‌గా కొనసాగారు. ఆ తర్వాత తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నామినీ డెరెక్టర్‌గా 2017 జూన్ 29 వరకు, మంజీరా లిఫ్ట్ ఇరిగేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ డైరెక్టర్‌గా 2022 జనవరి 20వ తేదీ వరకు పనిచేశారు.
గజ్వేల్ ఇరిగేషన్ అండ్ సీఏడీ ఈఎన్సీగా విధులు నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ సహా ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో కీలక పదవులు నిర్వహించిన సమయంలో భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు గత నెల 26న టోలిచౌకీలోని హరిరాం నివాసంతో పాటు సిద్దిపేట, ఖమ్మం జిల్లాలు సహా మొత్తం 13 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.
అధికారికంగా కొంతే.. అక్రమాస్తులు ఎన్నో!
హరిరాం ఉద్యోగంలో చేరిన నుంచి 36 ఏండ్ల సర్వీస్‌లో జీతభత్యాలుసహా అధికారికంగా రూ.6.75 కోట్లు సంపాదించగా.. భార్య, ఇద్దరు పిల్లల అవసరాల కోసం రూ.3,05,69,638 ఖర్చు చేసినట్లు ఏసీబీ అధికారులు అంచనా వేశారు. ఆయన సంపాదనలో ఖర్చులు పోను రూ.3 కోట్ల 69 లక్షల 29 వేల 789 మాత్రమే సేవింగ్స్ ఉండాలని లెక్కలు తేల్చారు.
కానీ, రూ.5 కోట్ల 26 లక్షల 13 వేల 294 అదనంగా ఉన్నట్లు గుర్తించారు. ఇది ఆదాయానికి మించి అక్రమ సంపాదనగా అనుమానిస్తున్నారు. ఈ మేరకు సోదాల్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల ప్రకారం ఆస్తుల విలువ మొత్తం రూ.8 కోట్ల 95 లక్షల 43 వేల 789. వీటి విలువ బహిరంగ మార్కెట్లో రూ.200 కోట్ల నుంచి రూ.300 కోట్ల దాకా ఉంటుందని భావిస్తున్నారు. కాగా, 5 రోజుల కస్టడీలో ఈ ఆస్తుల చిట్టాను బయటపెట్టే అవకాశం కనిపిస్తున్నది.