జమ్మూ కాశ్మీర్‎లో ఎన్ కౌంటర్.. ఇద్దరు టెర్రరిస్టులను ప్రాణాలతో పట్టుకున్న ఆర్మీ

జమ్మూ కాశ్మీర్‎లో ఎన్ కౌంటర్.. ఇద్దరు టెర్రరిస్టులను ప్రాణాలతో పట్టుకున్న ఆర్మీ

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‎లో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ కొనసాగుతోంది. ఇందులో భాగంగానే ఆదివారం (ఆగస్ట్ 10) తెల్లవారుజూమున కిష్త్వార్ జిల్లాలోని దుల్ జనరల్ ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను ప్రాణాలతో పట్టుకున్నట్లు తెలిసింది. కాగా, కొండప్రాంత జిల్లాలోని దుల్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారని ఇంటలిజెన్స్ నుంచి ఇన్ పుట్స్ రావడంతో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టినట్లు అధికారులు తెలిపారు. 

ఈ క్రమంలో బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరపగా.. తిరిగి సైన్యం ఫైరింగ్ చేసిందని వెల్లడించారు. ఇద్దరు టెర్రరిస్టులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఘటన స్థలంలో ఆపరేషన్ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. సైన్యం అదుపులోకి తీసుకున్న ఉగ్రవాదుల వివరాలు తెలియాల్సి ఉంది. 

కాగా, పహల్గాం ఊచకోతకు పాల్పడిన టెర్రరిస్టుల కోసం జమ్మూ కాశ్మీర్‎ను బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఆపరేషన్ అఖాల్ పేరుతో ఉగ్రవాదుల కోసం వేట కొనసాగిస్తున్నాయి. శనివారం (ఆగస్ట్ 9) కుల్గాం జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్లో ఉగ్రవాదుల చేతిలో ఇద్దరు జవాన్లు వీర మరణం పొందిన విషయం తెలిసిందే. జవాన్ల మరణానికి ప్రతీకారం తీర్చుకోవడం కోసం భద్రతా దళాలు రగిలిపోతున్నాయి.