గ్రేటర్​ వరంగల్​లో నాలాలకు ఆక్రమణల ముప్పు

గ్రేటర్​ వరంగల్​లో నాలాలకు ఆక్రమణల ముప్పు
  • ఇరిగేషన్ ఎన్ వోసీ లేకుండానే కట్టడాలు
  • మంత్రి ఆదేశంతో రెడీ అయిన విస్తరణ ప్రపోజల్స్ 
  • మళ్లీ  వానాకాలం వస్తున్నా సర్కారు పర్మిషన్ రాలే 

హనుమకొండ, వెలుగు:  గ్రేటర్​ వరంగల్​పరిధిలో బొందివాగు, నయీంనగర్​ నాలాల ఆక్రమణలతో వరద ముప్పు పొంచి ఉంది. వర్షాలు పడినప్పుడల్లా వరద నీరు లోతట్టు కాలనీలను ముంచెత్తుతున్నా.. నాలాల బఫర్​ జోన్​లో అధికార పార్టీ లీడర్ల సపోర్టుతో  నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. గత ఏడాది చాలా కాలనీలు ముంపునకు గురికావడంతో నాలాలను విస్తరించేందుకు రెడీ చేసిన ప్రపోజల్స్​కాగితాలకే పరిమితమయ్యాయి.  ప్రభుత్వ అనుమతులు రాక విస్తరణ ముందుకు సాగడంలేదు. 

ఎన్​వోసీ తీసుకోవడంలేదు

ఇల్లు కట్టుకోవాలంటే టీఎస్​ బీపాస్​ లో అప్లై చేసుకున్నప్పుడే చుట్టుపక్కల నాలాలు, చెరువులుంటే ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్ నుంచి నో ఆబ్జెక్షన్​ సర్టిఫికేట్ కూడా సమర్పించాలి.  పెద్ద చెరువులకు 30 మీటర్లు, నాలాలు, చిన్నచిన్న కుంటలకు 30 ఫీట్ల వరకు బఫర్​జోన్​గా  నిర్ణయించారు. ఆ పరిధి లోపల ఎలాంటి నిర్మాణాలు చేయకూడదు. కానీ గ్రేటర్​లో ఈ రూల్​ను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎన్​ఓసీ తీసుకోకుండానే అప్లికేషన్​లో తప్పుడు డీటేయిల్స్​ఎంట్రీ చేస్తున్నారు. ఎంక్వైరీకి వచ్చిన ఆఫీసర్లను ఎలాగో మేనేజ్​ చేసి.. పర్మిషన్​ తీసుకుంటున్నారు. ఆ తర్వాత నాలాలకు ఆనుకునే బిల్డింగులు లేపుతున్నారు. బఫర్​ జోన్​ల పరిధిలో ఇరిగేషన్​ ఎన్​వోసీ లేకుండా కట్టిన అక్రమనిర్మాణాలు  8 వేలకు పైగా ఉన్నట్టు ఇదివరకే ఆఫీసర్లు గుర్తించినా.. వాటిని  తొలగించడంలేదు. 

142 కోట్లతో ప్రపోజల్స్​

రియల్టర్లు, బిల్డర్ల కారణంగా వరంగల్​ నగరానికి చుట్టూ ఉన్న గొలుసుకట్టు చెరువులు ధ్వంసమయ్యాయి. దీనికి తోడు నాలాలు కబ్జా కావడంతో  2020 ఆగస్టులో భారీ వర్షాలవల్ల లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ్యాయి. వారం రోజుల పాటు వరంగల్ సిటీ నీట మునిగింది. ఆ టైమ్​లో మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్​రావు, సత్యవతిరాథోడ్​, ఎమ్మెల్యేలు నీటమునిగిన ప్రాంతాల్లో పర్యటించారు. కాల్వలపై ఆక్రమణలు తొలగించాలని, నాలాలను విస్తరించాలని మంత్రి కేటీఆర్​ఆఫీసర్లను ఆదేశించారు. నగరంలో నాలాల సామర్ధ్యం 20 వేల క్యూసెక్కులుండాలని, కానీ బొందివాగు, భద్రకాళి, నయీంనగర్ నాలాలు 10 నుంచి 12 వేల క్యూసెక్కులకు మించి తట్టుకునే పరిస్థితి లేదని నిపుణులు అంటున్నారు. బొందివాగు బ్రిడ్జి నుంచి భద్రకాళి చెరువు వరకు నాలాను 20 మీటర్ల వరకు విస్తరించి, పైనుంచి వచ్చే వరదను నియంత్రించడానికి రామన్నపేట, గ్రీన్​ వుడ్​ స్కూల్​ సమీపంలో రెండు చోట్ల ఇన్​ ఫ్లో రెగ్యులేటర్లు, అలంకార్​ వైపు ఔట్​ ఫ్లో రెగ్యులేటర్​ నిర్మించాలని ప్రతిపాదించారు.  పద్మాక్షి టెంపుల్​ వైపు కూడా మరో ఇన్ పుట్​ రెగ్యులేటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ పనులకు  రూ.142 కోట్ల అంచనాలతో అధికారులు ప్రతిపాదనలు పంపించారు. ఇప్పటికీ ఈ పనులకు సర్కారు ఆమోదం ఇవ్వలేదు. 

నాలా పొడవునా కబ్జాలు

వరంగల్ ఉర్సు  చెరువు, బెస్తం చెరువు నుంచి వచ్చే వరదను బొందివాగు నాలాలో కలిపేందుకు రూ. 90 లక్షలతో కొండా సురేఖ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు డ్రెయిన్​నిర్మించారు. ఈడ్రెయిన్​ను ఆక్రమించి రెండు ఫంక్షన్ హాల్స్​వాళ్లు శ్లాబులు వేశారు. న్యూశాయంపేట, భట్టుపల్లి చెరువుల నీరు  బొందివాగు నాలాలో కలిసే మార్గంలో బీ ఆర్​నగర్​ వద్ద బ్రిడ్జి కట్టారు. అక్కడి నుంచి భద్రకాళి చెరువు వరకు ప్రొటెక్షన్​లేకపోవడంతో కొందరు  బ్రిడ్జి కింది స్థలాన్ని ఆక్రమించి నాలాను మళ్లించారు. దీంతో బీఆర్ నగర్​ నుంచి రైల్వే లైన్​ వరకు బొందివాగు మెలికలు తిరుగుతూ భద్రకాళిలో కలుస్తుంది. వరంగల్ రైల్వే గేటు దగ్గర నాలా మీద బార్లు, హోటళ్లు, ఎల్ బీ కాలేజ్​దగ్గర  ఫంక్షన్​ హాల్​ కట్టారు. నయీంనగర్​ నాలాపై ఉన్న గుడిసెలను కొద్దిరోజుల కిందట టౌన్​ ప్లానింగ్​ ఆఫీసర్లు తొలగించారు. బొందివాగు వరదతో గత ఏడాది  70 కాలనీలు నీటమునిగాయి. ఈ ఏడాది కూడా వానలు గట్టిగా పడితే ముంపు తప్పదు.  నాలాలో గుర్రపు డెక్క, అంతర దామెర పేరుకుపోయినా దాన్ని తొలగించడంలేదు. దీనికి తోడు కాజీపేట, విజయవాడ మధ్య మూడో ట్రాక్​ పనుల కోసం  బొందివాగు ప్రవాహానికి అడ్డంగా  మట్టితో కట్ట పోశారు. వర్షాలు ముంచెత్తక ముందే నాలాలను విస్తరించి, ఆక్రమణలను తొలగించాలని  ప్రజలు కోరుతున్నారు. 

నాలాల విస్తరణకు ప్రపోజల్స్​ పంపించాం

వరంగల్ లో నాలాల విస్తరణకు ప్రపోజల్స్​ పంపించాం. అనుమతులు రాగానే వర్క్స్​ స్టార్ట్ చేస్తాం. నాలాల చుట్టుపక్కలా నిర్మాణాలు చేపడితే ఇరిగేషన్​పర్మిషన్ తీసుకోవాలి. లేదంటే తర్వాత ఇబ్బంది పడాల్సివస్తుంది. పర్మిషన్​లేకుంటే బిల్డింగులను కూల్చే అవకాశముంది. 
–  బి.ఆంజనేయులు, ఇరిగేషన్​ ఈఈ, హనుమకొండ