
బ్రిటన్: భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతోన్న ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్‌లో ప్రతి మ్యాచుకు ముందు టీమిండియా స్టార్ పేసర్ జస్ర్పీత్ బుమ్రా మ్యాచ్ ఆడతాడా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంటుంది. వర్క్ లోడ్ కారణంగా సిరీస్‌లోని ఏవైనా మూడు మ్యాచులు మాత్రమే బుమ్రా ఆడతాడని సిరీస్‌కు ముందే బీసీసీఐ చెప్పడమే ఇందుకు కారణం. టీమిండియా అతిగా బుమ్రా మీద ఆధార పడటంతో కొందరు విమర్శలు చేస్తున్నారు. సరిగ్గా ఇదే అంశాన్ని టార్గెట్ చేశారు ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ ప్లేయర్ గ్రెగ్ చాపెల్.
ఓ స్పోర్ట్స్ ఛానెల్‌తో చాపెల్ మాట్లాడుతూ.. టీమిండియా బుమ్రాపై అతిగా ఆధారపడటాన్ని తప్పుబట్టారు. ఇకనైనా టీమిండియా బుమ్రాపై అతిగా ఆధార పడటం మానేయాలని చురకలంటించారు. క్రికెట్ అనేది ఒక టీమ్ గేమ్ అని.. ఒక్కడి వల్లే ఎప్పుడు జట్టు గెలవదని.. టీమ్‌లోని సభ్యులంతా సమిష్టిగా రాణించినప్పుడే విజయం దక్కుతుందన్నారు చాపెల్. బుమ్రా లేకుండానే ఇటీవల భారత్ చాలా టెస్టులు గెలిచిందని గుర్తు చేశారు. ఆటలో ఎప్పుడైనా వ్యక్తిగత ప్రతిభ ముఖ్యం కాదని.. సమిష్టి ప్రదర్శన ముఖ్యమన్నారు. ప్రతి ఒక్కరూ తమ పని తాము చేసినప్పుడే జట్లు గెలుస్తాయన్నారు.
భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతోన్న ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్‌లో లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్, లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్టులో బుమ్రా ఆడాడు. అనూహ్యంగా ఈ రెండు టెస్టుల్లో భారత్ ఓటమి పాలైంది. బుమ్రా ఆడని రెండో టెస్టులో మాత్రం టీమిండియా విజయం సాధించింది. ఈ పాయింట్‌నే టార్గెట్ చేస్తూ చాపెల్ పై విధంగా కామెంట్స్ చేశారు. ఓవరాల్‌గా కూడా బుమ్రా ఆడని టెస్ట్‌లలో భారత్ 70 శాతం గెలవగా.. అతడు జట్టులో ఉన్న మ్యాచుల్లో 40 శాతం మాత్రమే విజయం సాధించిందని రికార్డులు చెబుతున్నాయి.
ఇక, ఐదు మ్యాచుల సిరీస్‌లో భారత్ 1-2 తేడాతో వెనుకబడి ఉంది. తొలి టెస్టులో అతిథ్య ఇంగ్లాండ్ గెలవగా.. రెండో టెస్టులో టీమిండియా విజయం సాధించి తొలి ఓటమికి రివేంజ్ తీర్చుకుంది. లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్టులో విజయంతో కంబ్యాక్ ఇచ్చిన ఇంగ్లాండ్ 1-2 తేడాతో సిరీస్‌లో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 2025, జూలై 23న మాంచెస్టర్‌లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో నాల్గో టెస్ట్ జరగనుంది. ఈ మ్యాచులో ఎలాగైనా గెలిచి సిరీస్ సమం చేయాలని భారత్.. మాంచెస్టర్‌లో విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని ఇంగ్లాండ్ జట్లు ఉవ్విళ్లురుతున్నాయి.