చిల్లర కష్టాలకు చెక్: ఏటీఎంలోనే రూ.10, రూ.20 నోట్లు.. మార్కెట్లోకి సరికొత్త 'హైబ్రిడ్' మిషన్లు..?

చిల్లర కష్టాలకు చెక్: ఏటీఎంలోనే రూ.10, రూ.20 నోట్లు.. మార్కెట్లోకి సరికొత్త 'హైబ్రిడ్' మిషన్లు..?

డిజిటల్ చెల్లింపుల యుగంలో యూపీఐ పేమెంట్స్ పెరిగాయి. అయినప్పటికీ సామాన్యుడికి 'చిల్లర' కష్టాలు తీరడం లేదు. 500 రూపాయల నోటు పట్టుకుని మార్కెట్‌కు వెళ్తే.. పది రూపాయల చాక్లెట్ కొన్నా, వంద రూపాయల కూరగాయలు కొన్నా.. చిల్లర లేదండీ అనే సమాధానమే వినిపిస్తోంది. ఈ సమస్యకు పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం సరికొత్త హైబ్రిడ్ ఏటీఎంల ఆలోచనతో ముందుకొచ్చింది.

సాధారణంగా ఏటీఎంకు వెళ్తే మనకు రూ.100 లేదా రూ.500 నోట్లు మాత్రమే వస్తాయి. కానీ త్వరలో రాబోయే కొత్త ఏటీఎంల ద్వారా ప్రజలు నేరుగా రూ.10, రూ.20, రూ.50 నోట్లను కూడా విత్ డ్రా చేసుకోవచ్చు. అలాగే ఈ హైబ్రిడ్ ఏటీంలలో కేవలం క్యాష్ విత్ డ్రా చేసుకోవటం మాత్రమే కాకుండా.. మీ దగ్గర ఉన్న 100,500 నోట్లను మిషన్‌లో ఉంచితే.. అది వెంటనే మీకు చిన్న నోట్లుగా మార్చి చిల్లర ఇస్తుంది. అందుకే వీటిని 'హైబ్రిడ్ ఏటీఎంలు' అని పిలుస్తున్నారు.

ముంబైలో పైలట్ ప్రాజెక్ట్..

ప్రస్తుతం ఈ సరికొత్త ఏటీఎంలను ముంబైలో పైలట్ ప్రాజెక్టుగా పరీక్షిస్తున్నారు. అక్కడ ఈ ప్రయోగం విజయవంతమైతే, త్వరలోనే దేశవ్యాప్తంగా వీటిని విస్తరించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, మార్కెట్లు, హాస్పిటల్స్, ప్రభుత్వ కార్యాలయాల వంటి రద్దీ ప్రాంతాల్లో కొత్త హైబ్రిడ్ ఏటీఎంలను ఏర్పాటు చేయనున్నారు. సామాన్యులకు చిల్లర కోసం ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా చేయడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశ్యం.

డిజిటల్ యుగంలో అసలు క్యాష్ ఎందుకు..?

డిజిటల్ చెల్లింపుల్లో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్నప్పటికీ.. ఇప్పటికీ ఇండియాలో క్యాష్ రియల్ కింగ్. గ్రామీణ ప్రాంతాల్లో, చిన్న చిన్న లావాదేవీల కోసం నగదుపైనే చాలామంది ఆధారపడుతున్నారు. అందరికీ స్మార్ట్‌ఫోన్లు లేకపోవడం, కొన్ని చోట్ల ఇంటర్నెట్ సిగ్నల్స్ సరిగ్గా లేకపోవడం వల్ల క్యాష్ వాడకం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే చిన్న నోట్ల సర్క్యులేషన్‌ను పెంచాలని రిజర్వ్ బ్యాంక్ భావిస్తోంది.

అయితే ఈ హైబ్రిడ్ ఏటీఎంల నిర్వహణ బ్యాంకులకు కొంత భారంగా మారే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చిన్న నోట్ల ట్రాన్స్‌పోర్టేషన్, మిషన్లలో వాటిని రీఫిల్ చేయడం, నిర్వహణ ఖర్చులు ఎక్కువగా ఉంటాయని వారు హెచ్చరిస్తున్నారు. కేవలం యంత్రాలు ఏర్పాటు చేస్తే సరిపోదని, ఆర్బీఐ చిన్న నోట్ల ముద్రణను కూడా భారీగా పెంచాల్సి ఉంటుందని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రజలు యూపీఐ వాడటానికి బాగానే అలవాటు పడినప్పటికీ.. పర్సులో కొన్ని చిన్న నోట్లు ఉంటే ఉండే ధైర్యమే వేరు. ప్రభుత్వం చేపడుతున్న ఈ కొత్త ప్రయోగం సక్సెస్ అయితే.. భవిష్యత్తులో "చిల్లర లేదు" అనే మాట వినిపించకపోవచ్చు.