పెండింగ్ కేసుల కుప్పగా దేవాదాయ శాఖ.. 1,779 కేసుల్లో ఎక్కువగా భూముల ఆక్రమణలే

పెండింగ్ కేసుల కుప్పగా దేవాదాయ శాఖ.. 1,779  కేసుల్లో ఎక్కువగా భూముల ఆక్రమణలే
  • ఉన్నతాధికారులు పర్యవేక్షణ లేక 20 వేల ఎకరాలు కబ్జా
  • ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే 202 కేసులకు కౌంటర్ దాఖలు కాలే 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఆలయాలు, మఠాలు, ధార్మిక సంస్థల భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆక్రమణదారులపై కోర్టుల్లో కేసులు వేసినా.. ఏళ్ల తరబడి పెండింగ్‌‌‌‌‌‌‌‌లోనే ఉంటున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం, అధికారుల మధ్య సమన్వయలోపంతో  కేసుల్లో పురోగతి లేక ఏళ్ల తరబడి కోర్టులో పెండింగ్ లో ఉంటున్నాయి. కొన్ని కేసులు హియరింగ్ కు వచ్చినా.. వాటికి కౌంటర్  దాఖలు చేయడంలో జాప్యం జరుగుతున్నది. 

రాష్ట్రవ్యాప్తంగా 1,779 కేసులు ఉండగా..  అందులో 1,443 కేసుల్లో మాత్రమే కౌంటర్  దాఖలు చేశారు. వీటితోపాటు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన కేసులు 261 వరకు ఉన్నాయి. ఇందులో భూములకు సంబంధించిన కేసులే ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఆలయ భూములు 87,235.39 ఎకరాలు ఉండగా..  20,124.03 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి. విత్ అవుట్ లిటిగేషన్ తో మరో 5,569.35 ఎకరాలు కబ్జాకు గురైనట్లు అధికారులు చెబుతున్నా.. లెక్కల్లో చూపడం లేదు. అయితే, భూములు కబ్జా చేసినవారిపై  దేవాదాయ శాఖ అధికారులు కేసులు వేశారు. 

ఐదుగురు అడ్వకేట్లను నియమించినా.. 

ఎండోమెంట్​కు ప్రభుత్వం ఐదుగురు అడ్వకేట్లను నియమించింది. అందులో జీపీ, ఏజీపీలు ఉన్నారు. ఇద్దరు జీపీ, ఏజీపీలు ఉద్యోగుల సర్వీసు ఇతర అంశాలు, మరో ఇద్దరు ల్యాండ్, ట్రస్టీ భూములకు సంబంధించిన కేసులను కోర్టులో వాదించనున్నారు. మరో న్యాయవాది స్టాండింగ్  కౌన్సిల్  సర్వీసు కేసులను వాదించేందుకు ప్రభుత్వం నియమించింది. ఎండోమెంట్  కేసులు ఆశించిన స్థాయిలో పరిష్కారానికి నోచుకోవడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. కోర్టుల్లో ఏ కేసు ఎంత వరకు వచ్చింది? ఏ దశలో ఉంది? వాదనలు ఎలా జరుగుతున్నాయి? ఆ కేసులో ఇంకా సేకరించాల్సిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని సమీక్షలు నిర్వహించి న్యాయవాదుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాల్సి ఉంది. 

గత ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతోనే కేసులు ఏళ్ల తరబడి కోర్టుల్లోనే ఉంటున్నాయి. ప్రభుత్వం న్యాయశాఖ నుంచి ఒక్కోశాఖకు న్యాయవాదులను కేటాయిస్తుంది. ఆ న్యాయవాదులకు సంబంధిత శాఖ నుంచి వేతనాలు ఇస్తున్నారు. ఆయా శాఖల న్యాయవాదులు సంబంధిత శాఖకే బాధ్యత వహించాల్సి ఉంటుంది. కానీ, న్యాయవాదులు మాత్రం సంబంధిత శాఖకు సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

202 కేసులకు కౌంటర్​ దాఖలు కాలే 

రంగారెడ్డిలో 202 కేసులకు దేవాదాయ శాఖ అడ్వకేట్లు కోర్టుల్లో కౌంటర్లు వేయలేదు. రంగారెడ్డి జిల్లాలో భూముల విలువ కోట్లలో ఉంటుంది. ఆలయ భూములను సంరక్షిస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. కానీ, ప్రభుత్వం నియమించిన న్యాయవాదులు కౌంటర్లు వేయకపోవడం విమర్శలకు దారితీస్తోంది.  సికింద్రాబాద్ లో 21, నల్లగొండ జిల్లాలో 23, మహబూబ్ నగర్ జిల్లాలో 69, ఖమ్మంలో 5, కరీంనగర్ లో 3, ఆదిలాబాద్​లో 6, నిజామాబాద్ లో 3 ఇలా రాష్ట్రవ్యాప్తంగా 332 కేసులకు కౌంటర్లు దాఖ లు చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఎందుకు కౌంటర్​ దాఖలు చేయడం లేదు.. కావాలనే చేస్తున్నారా? లేకుంటే కేసులు ఎక్కువగా ఉండటంతో జాప్యం జరుగుతున్నదా? అనేది చర్చకు దారితీస్తోంది.