రేపటి నుంచి..జాతర హుండీల లెక్కింపు 

రేపటి నుంచి..జాతర హుండీల లెక్కింపు 

వరంగల్‍, వెలుగు :మేడారం జాతరలో ఏర్పాటు చేసిన హుండీలను ఎండోమెంట్​ ఆఫీసర్లు బుధవారం నుంచి లెక్కించనున్నారు. జాతర  ముగియడంతో సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల దగ్గర ఏర్పాటు చేసిన హుండీలను  ఆఫీసర్లు హన్మకొండ పబ్లిక్‍ గార్డెన్‍ ఎదురుగా ఉన్న టీటీడీ కల్యాణ మండపానికి తరలించి భద్రపరిచారు. బుధవారం నుంచి రోజు ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు హుండీలను తెరిచి కరెన్సీ లెక్కించనున్నారు. దీని కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 

500కు పైగా హుండీలు..

మేడారం జాతరలో ఎండోమెంట్​ఆఫీసర్లు 497 హుండీలను ఏర్పాటు చేశారు. బుధవారం తిరుగువారం ఉన్నందున మరో 10 నుంచి 15 హుండీలు పెట్టనున్నారు. ఇప్పటికే భక్తులు వేసిన కానుకలతో నిండిన హుండీల లెక్కింపు కోసం 200 మంది ఎండోమెంట్‍ స్టాఫ్​తో పాటు వివిధ స్వచ్ఛంధ సంస్థల నుంచి మరో 400 మందిని రెడీ చేశారు. మెషీన్ల ద్వారా కరెన్సీ లెక్కించి..వాటిని ఏ రోజుకారోజు అకౌంట్లో జమ చేయడానికి యూనియన్‍ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకులతో ఒప్పందం చేసుకున్నారు. ఎక్కడా ఎలాంటి పొరపాటు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షించనున్నారు.  

2020లో 11.64 కోట్ల ఆదాయం 

2018 జాతరలో రూ.10.17 కోట్ల ఇన్​కం రాగా, 2020లో రూ.11,64,61,774  వచ్చింది. ఇందులో ఫారిన్‍ కరెన్సీ ఆదాయం అదనం. గోల్డ్​కిలో 63 గ్రాముల 900 మిల్లీ గ్రాములు రాగా, గోవిందరాజులుకు 36 గ్రాముల 800 మిల్లీగ్రాములు, పగిడిద్దరాజుకు 24 గ్రాముల 750 మిల్లీగ్రాములు, సారలమ్మకు 370 గ్రాముల150 మిల్లీగ్రాములు వచ్చింది. అందరి కంటే ఎక్కువగా సమ్మక్క తల్లికి 632 గ్రాముల 200 మిల్లీ గ్రాముల బంగారాన్ని భక్తులు సమర్పించుకున్నారు. వెండి 53 కిలోల 450 గ్రాములు రాగా.. గోవిందరాజులుకు 3 కిలోలు, పగిడిద్దరాజుకు కిలోన్నర, సారలమ్మకు 19 కిలోల 500 గ్రాములు, సమ్మక్క తల్లికి 29 కిలోల 450 గ్రాములు వచ్చింది. గత జాతరలో ఫస్ట్​ 494 హుండీలు ఏర్పాటు చేయగా, తిరుగువారం కోసం 8 హుండీలు పెట్టారు.

10 రోజుల పాటు లెక్కింపు 

2020 జాతరలో 502 హుండీలు లెక్కించడానికి 15 రోజులు పట్టింది. జాతర చివర్లో భారీ వర్షం పడడంతో హుండీల్లోకి వర్షం నీరు చేరి కరెన్సీ తడిసిపోయింది. దీనికి బెల్లం, పసుపు, కుంకుమ అంటడంతో క్లీనింగ్‍, ఆరబెట్టడానికి ఎక్కువ సమయం పట్టింది. ఈసారి 497 హుండీలతో పాటు తిరుగువారంలో మరో 10 నుంచి 15 హుండీలు ఏర్పాటు చేస్తే ఈ సంఖ్య 510 వరకు చేరుకుంటుంది. వాన సమస్య లేకపోవడంతో నోట్లపై పసుపు, కుంకుమ, బెల్లాన్ని  క్లీన్‍ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దాదాపు10 రోజులు టైం పట్టే అవకాశముందని ఆఫీసర్లు చెప్పారు.  

33 శాతం కానుకలు పూజారులకే 

జాతరలో భక్తులు వేసే కానుకల్లో 33.33 శాతం ప్రధాన పూజారుల కుటుంబాలకే ఇవ్వాలనే సుప్రీంకోర్టు ఆదేశం మేరకు దేవాదాయశాఖ నడుచుకుంటోంది. ఇప్పటికే ఎండోమెంట్ ఆఫీసర్లు ప్రధాన పూజరుల కుటుంబాల నుంచి బ్యాంక్ అకౌంట్స్​ డిటెయిల్స్​ తీసుకున్నారు. లెక్కింపు పూర్తి కాగానే వాటాను వారి అకౌంట్లలో జమ చేస్తారు. 

పూనుగొండ్లకు చేరిన పగిడిద్దరాజు..రేపటి నుంచి తిరుగువారం

కొత్తగూడ(గంగారం) : మేడారం మహాజాతర ముగిశాక పూజారులు సమ్మక్క భర్త పగిడిద్దరాజును మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లకు తీసుకువచ్చారు. శనివారం రాత్రే బయలుదేరగా, కాలినడకన రావడంతో గమ్యస్థానానికి చేరడానికి ఒకరోజు పట్టింది. ఈ సందర్భంగా పగిడిద్దరాజుకు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. డోలు వాయిద్యాలతో శివసత్తుల పూనకాలతో స్వామివారిని గుడిలోకి గద్దెపైకి చేర్చారు.  ప్రధాన పూజారులు బుచ్చిరాములు, రాజేశ్వర్​, సురేందర్​, పురుషోత్తం మాట్లాడుతూ బుధవారం నుంచి 26 వరకు తిరుగువారం(నాగవెల్లి) జాతర నిర్వహిస్తున్నట్లు చెప్పారు.