టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో ఇంజినీరింగ్‌‌ కాలేజీ హెచ్‌‌ఓడీ అరెస్టు

టీఎస్పీఎస్సీ  పేపర్ల లీకేజీ కేసులో  ఇంజినీరింగ్‌‌ కాలేజీ హెచ్‌‌ఓడీ అరెస్టు
  • ఫిజికల్  డైరెక్టర్  కూడా 
  • మాల్‌‌ ప్రాక్టీస్ కోసం రూ.10 లక్షలు తీసుకున్న ఆ ఇద్దరు
  • 55కు చేరిన నిందితుల సంఖ్య
  • టీఎస్​పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో ఇంజినీరింగ్‌‌ కాలేజీ హెచ్‌‌వోడీ అరెస్టు

హైదరాబాద్‌‌, వెలుగు : టీఎస్‌‌ పీఎస్‌‌సీ పేపర్ల  లీకేజీ కేసులో కొత్త కోణం బయటపడింది. కరీంనగర్‌‌‌‌లో హైటెక్ మాల్‌‌ ప్రాక్టీస్‌‌ డొంక కదిలింది. ఏఈఈ, డీఏవో పరీక్షల్లో మాల్‌‌ ప్రాక్టీస్‌‌కు సహకరించిన ఓ ప్రముఖ ఇంజినీరింగ్‌‌  కాలేజీ హెచ్‌‌ఓడీ విశ్వప్రకాశ్, ఫిజికల్  డైరెక్టర్‌‌‌‌  వెంకటేశ్వర్లును మంగళవారం సిట్  అధికారులు కరీంనగర్ లో అరెస్టు చేశారు. వారిని బుధవారం కోర్టులో ప్రొడ్యూస్  చేసి రిమాండ్‌‌కు తరలించారు. కరీంనగర్‌‌‌‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రధాన నిందితుడు రమేశ్  మాల్‌‌ప్రాక్టీస్ నెట్‌‌వర్క్‌‌ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఏఈఈ, డీఏవో పరీక్షలు జరిగిన కాలేజీలు,సెంటర్ల వివరాలను సేకరిస్తున్నారు.ఈ ఇద్దరి అరెస్టుతో ఈ  కేసులో నిందితుల సంఖ్య 55కు చేరింది. 

హైటెక్  మాల్‌‌ ప్రాక్టీస్ ఫెయిల్ అయితే ఇలా

ఏఈఈ, డీఏవో పరీక్షల్లో హైటెక్  మాల్‌‌ ప్రాక్టీస్‌‌  చేసేందుకు పూల రమేశ్  ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌‌ మలక్‌‌పేటలో కంట్రోల్‌‌ రూమ్ ఏర్పాటు చేసుకొని డిజిటల్ డివైజెస్‌‌, మైక్రో ఫోన్లతో అతను సమాధానాలు అందించాడు. రూ.10 కోట్లు టార్గెట్‌‌గా నెట్‌‌వర్క్‌‌ ఏర్పాటు చేసుకున్నాడు. హైటెక్ మాల్‌‌ ప్రాక్టీస్‌‌లో సమస్యలు తలెత్తితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇందు కోసం రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు జరిగే సెంటర్లు,  పనిచేస్తున్న హెచ్‌‌ఓడీలు, ప్రిన్సిపాళ్లను సంప్రదించాడు. తమకు సహకరించిన వారికి పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు. ఈ క్రమంలో కరీంనగర్‌‌‌‌లోని ఓ ప్రముఖ ఇంజనీరింగ్‌‌  కాలేజీ  హెచ్‌‌ఓడీ విశ్వప్రకాశ్, ఫిజికల్ డైరెక్టర్‌‌‌‌  వెంకటేశ్వర్లుతో ఒప్పందం చేసుకున్నాడు. 

హైటెక్‌‌  మాల్‌‌ ప్రాక్టీస్‌‌,అభ్యర్థుల వివరాలు అందించాడు. పరీక్ష సమయంలో మాల్‌‌ప్రాక్టీస్‌‌లో సమస్యలు తలెత్తితే తమ అభ్యర్థులకు సమాధానాలు అందించాలని చెప్పాడు. ఇందుకోసం ఒక్కొక్కరికి రూ.5 లక్షలు ఇచ్చాడు. అయితే, మాల్‌‌ ప్రాక్టీస్ సక్సెస్ కావడంతో వారి నుంచి ఎలాంటి సహకారం తీసుకోలేదు. దర్యాప్తులో భాగంగా రమేశ్  బ్యాంకు ఖాతాలు, కాల్‌‌డేటాను సిట్‌‌  అధికారులు పరిశీలించారు. రూ.10 లక్షల ట్రాన్సాక్షన్లతో పాటు కాల్‌‌ డేటా ఆధారంగా కరీంనగర్‌‌‌‌లో మాల్‌‌ప్రాక్టీస్ జరిగినట్లు గుర్తించారు. ఇలా మరో 8 మందికి సంబంధించిన వివరాలను కూడా సేకరించారు.