జూన్ 28 నుంచి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ..మూడు విడతల్లో బీటెక్ అడ్మిషన్ల ప్రక్రియ

జూన్ 28 నుంచి  ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ..మూడు విడతల్లో బీటెక్ అడ్మిషన్ల ప్రక్రియ
  • తొలిసారిగా జోసా తరహాలో మాక్ సీట్ల అలకేషన్ 
  • కొత్తగా మూడు ప్రభుత్వ వర్సిటీ కాలేజీలు
  • అందుబాటులో మొత్తం 1.10 లక్షల సీట్లు
  • ఎస్సీ వర్గీకరణ, దివ్యాంగులకు5% రిజర్వేషన్లూ అమలు

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో బీటెక్ ఫస్టియర్ సీట్ల భర్తీ కోసం శనివారం నుంచి ఈఏపీసెట్–2025 అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. మూడు విడుతల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఈసారి ఏపీ నాన్​లోకల్​ కోటాను తొలగించారు. దీంతో ఆ సీట్లు కూడా ఇప్పుడు మనవాళ్లకే దక్కనున్నాయి. ఎస్సీ వర్గీకరణ, దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్లను అమలు చేయనున్నారు. శుక్రవారం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్​లో టీజీఈఏపీసెట్ అడ్మిషన్ కమిటీ సమావేశం టీజీసీహెచ్​ఈ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన నేతృత్వంలో జరిగింది. ఈ సందర్భంగా 2025–26 విద్యాసంవత్సరానికి గానూ ఇంజనీరింగ్​ అడ్మిషన్ షెడ్యూల్​ను రిలీజ్ చేశారు. మూడు విడుతల్లో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగనుండగా.. ఈ నెల 28 నుంచి ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు మొదలవుతాయి. జులై 7 వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు అవకాశం ఉంది.

 జులై 1 నుంచి 8 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్  ఉంటుంది. జులై 6 నుంచి10 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశమిచ్చారు. తొలిసారిగా జోసా తరహాలో మాక్ సీట్ల అలకేషన్ చేపడ్తున్నారు. ఇది జులై 13న ఉంటుంది. ఫస్ట్​ ఫేజ్​కు సంబంధించి ఫైనల్​గా సీట్ల కేటాయింపు జులై 18న ఉంటుంది. సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ జులై 25 నుంచి ఆగస్టు 2 వరకు, ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ ఆగస్టు 5 నుంచి 13 వరకు నిర్వహిస్తారు. కాగా, ఆగస్టు 18 నుంచి 23 వరకూ కన్వీనర్ ద్వారానే ఇంటర్నల్ స్లైడింగ్  ప్రక్రియను నిర్వహిస్తారు. కమిటీ సమావేశంలో టీజీసీహెచ్​ఈ వైస్ చైర్మన్లు ఇటిక్యాల పురుషోత్తం, ఎస్​కే మహమూద్, సెక్రెటరీ శ్రీరామ్ వెంకటేశ్, క్యాంప్ ఆఫీసర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 

అన్ని సీట్లూ మనకే...

రాష్ట్ర విభజన చట్టం–2014 ప్రకారం పదేండ్ల పాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం అన్ని కోర్సుల్లో ప్రవేశాలు జరిగాయి. దీని ప్రకారం తెలంగాణలోని సీట్లను 15 శాతం నాన్‌‌‌‌‌‌‌‌ లోకల్ కోటా కింద ఏపీ స్టూడెంట్లకూ కేటాయించే వారు. దీనివల్ల ఏటా ఏపీవాళ్లు సుమారు 4 వేల మంది వరకు లబ్దిపొందారు. అయితే, పదేండ్లు పూర్తయిన నేపథ్యంలో 2025–26 విద్యాసంవత్సరం నుంచి నాన్ లోకల్ కోటా తీసేశారు. తెలంగాణలోని అన్ని సీట్లూ రాష్ట్రానికి చెందిన విద్యార్థులకే కేటాయించనున్నారు. ఈ లెక్కన ఏపీకి చెందిన విద్యార్థికి టాప్ ర్యాంకు వచ్చినా.. తెలంగాణలో కన్వీనర్ కోటాలో సీటు అలాట్ చేయరు. స్టేట్ లో సుమారు 176 ఇంజనీరింగ్ కాలేజీల వరకు ఉండగా, దాదాపు 1.10 లక్షల వరకు సీట్లు అందుబాటులో ఉన్నాయి. 

మూడు కొత్త కాలేజీలు..

ఈ విద్యాసంవత్సరం కొత్తగా ప్రభుత్వం మంజూరు చేసిన మూడు సర్కారు యూనివర్సిటీ కాలేజీలు అడ్మిషన్ల ప్రక్రియలో చేరాయి. శాతవాహన వర్సిటీ పరిధిలో హుస్నాబాద్​లో గల యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీలో 240 సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంట్లో సీఎస్ఈ, సీఎస్​ఏ(ఏఐ), ఐటీ, ఈసీఈ కోర్సులకు పర్మిషన్ ఇవ్వగా.. ఒక్కోదాంట్లో 60 సీట్లు కేటాయించారు. పాలమూరు వర్సిటీ పరిధిలోని మహబూబ్​నగర్​లో గల యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీలో 180 సీట్లకు సర్కార్​ ఓకే చెప్పింది. ఇందులో సీఎస్ఈ, సీఎస్​ఎం(ఏఐఎంఎల్), సీఎస్​డీ కోర్సులు ఉన్నాయి. కొత్తగూడెంలోని ఎర్త్ సైన్స్ యూనివర్సిటీలో 300 సీట్లకు ప్రభుత్వం పర్మిషన్  ఇచ్చింది. ఇందులో సీఎస్ఈ, ఈఈఈ, ఈసీఈ, ఐటీ, మైనింగ్  కోర్సులు ఉన్నాయి. 

ఎస్సీ వర్గీకరణ అమలు

ఇటీవలే ఎస్సీ వర్గీకరణ జరగ్గా.. ఇంజనీరింగ్ కౌన్సెలింగ్​లో దాన్ని అమలు చేయనున్నారు. మూడు కేటగిరీల్లో సీట్లను అలాట్ చేయనున్నారు. మొత్తం 15 శాతం రిజర్వేషన్లు ఎస్సీలకు ఉండగా.. దాంట్లో ఒకటో కేటగిరీలో ఒక్క శాతం, రెండో కేటగిరీలో 9 శాతం, మూడో కేటగిరీలో ఐదు శాతం సీట్ల విభజన చేయనున్నారు. మరోపక్క దివ్యాంగుల రిజర్వేషన్లనూ మూడుశాతం నుంచి ఐదుశాతానికి పెంచుతూ ప్రభుత్వంనిర్ణయం తీసుకోగా.. దాన్నీ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్​లో అమలు చేయనున్నారు. 


ఇంజనీరింగ్​ అడ్మిషన్ షెడ్యూల్ ఇదీ..

ఫస్ట్ ఫేజ్:

  • ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ రిజిస్ట్రేషన్, 
  • ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్    జూన్ 28 నుంచి జులై 7 వరకు 
  • సర్టిఫికెట్ల వెరిఫికేషన్ (స్లాట్ బుక్ చేసుకున్న వారికి)     జులై 1 నుంచి  8 వరకు 
  • వెబ్ ఆప్షన్ల ప్రక్రియ  జులై 6 నుంచి 10 వరకు 
  • మాక్ సీట్ల అలకేషన్  జులై13న 
  • ఆప్షన్ల ఎడిట్​కు అవకాశం  జులై 14, 15 
  • సీట్ల కేటాయింపు  జులై 18న 
  • ఫీజు చెల్లింపు, 
  • ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్   జులై 18 నుంచి 22 వరకు
  • సెకండ్ ఫేజ్
  • ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ రిజిస్ట్రేషన్, 
  • ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్  జులై 25 
  • సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జులై 26
  • వెబ్ ఆప్షన్ల ప్రక్రియ   జులై 26, 27
  • సీట్ల కేటాయింపు   జులై 30 
  • ఫీజు చెల్లింపు, 
  • ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్  జులై 30, ఆగస్టు 1 
  • కాలేజీల్లో రిపోర్టింగ్     జులై 31 నుంచి ఆగస్టు 2 వరకు
  • ఫైనల్ ఫేజ్:
  • ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ రిజిస్ట్రేషన్, 
  • ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్    ఆగస్టు 5 
  • సర్టిఫికెట్ల వెరిఫికేషన్   ఆగస్టు 6 
  • వెబ్ ఆప్షన్ల ప్రక్రియ   ఆగస్టు 6,7 
  • సీట్ల కేటాయింపు  ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆగస్టు 10
  •  చెల్లింపు, 
  • ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్     ఆగస్టు 10 నుంచి 12 వరకు