రాష్ట్రంలో భారీగా పెరిగిన ఇంజినీరింగ్ ఫీజులు

రాష్ట్రంలో భారీగా పెరిగిన ఇంజినీరింగ్ ఫీజులు

రాష్ట్రంలో ఇంజినీరింగ్ ఫీజులు భారీగా పెరిగాయి. ఫీజుల పెంపుపై ఎలాంటి జీవో ఇవ్వకుండానే రాష్ట్ర ప్రభుత్వం కౌన్సెలింగ్ ప్రారంభించడంపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. హైకోర్టును ఆశ్రయించిన 79 ఇంజినీరింగ్ కళాశాలలు ఫీజు పెంపునకు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు పొందాయి. టీఎస్‌ఏఎఫ్‌ఆర్‌సీ వద్ద అంగీకరించిన ఇంజినీరింగ్‌ ఫీజులకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో రాష్ట్రంలో 36 ఇంజినీరింగ్ కాలేజీల్లో వార్షిక ఫీజు రూ.లక్ష దాటింది.

సీబీఐటీలో రూ.1.73లక్షలు, వాసవి, వర్దమాన్, సీవీఆర్, బీవీఆర్ఐటీ మహిళ కాలేజీలలో రూ.1.55లక్షల ఫీజు ఉండనుంది. శ్రీనిధి, వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కాలేజీలలో రూ.1.50లక్షలు, ఎంవీఎస్ఆర్ కాలేజీలో రూ.1.45 లక్షల ఫీజు ఉండనుంది. 10 వేల ర్యాంకు దాటిన బీసీ, ఈబీసీ విద్యార్థులపై ఫీజుల భారం అధికంగా పడనుంది. బీసీ, ఈబీసీ కోటా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పెంపు ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు రేపు మొదటి విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు జరగనుంది. ఈనెల 13 వరకు ఫీజు చెల్లింపునకు గడువు విధించారు.