భారత్‌తో సిరీస్‌కు జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్.. 20 ఏళ్ల కుర్రాడికి చోటు

భారత్‌తో సిరీస్‌కు జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్.. 20 ఏళ్ల కుర్రాడికి చోటు

వచ్చే ఏడాది ప్రారంభంలో ఇంగ్లాండ్ జట్టు.. ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం భారత పర్యటనకు రానున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌ కోసం ఇంగ్లీష్ బోర్డు 16 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టులో ఏకంగా ముగ్గురు అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లు ఉండగా, నలుగురు స్పిన్నర్లను ఎంపిక చేసింది. 

భారత పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలిస్తాయి కనుక ఇంగ్లాండ్ అండ్‌ వేల్స్‌ క్రికెట్ బోర్డు (ఈసీబీ) స్పిన్నర్లకే అధిక ప్రాధాన్యమిచ్చింది. రెహాన్ అహ్మద్, జాక్ లీచ్ తో పాటు టామ్ హార్ట్‌లీ, షోయబ్ బషీర్‌ అనే ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లకు తుది జట్టులో చోటు కల్పించింది. ఈ జట్టుకు బెన్‌ స్టోక్స్‌ సారథ్యం వహించనున్నాడు. మొత్తంగా ఈ జట్టులో ఏడుగురు బ్యాటర్లు, ఒక ఆల్‌రౌండర్, నలుగురు పేసర్లు, నలుగురు స్పిన్నర్లు ఉన్నారు.

ఎవరీ షోయబ్ బషీర్..?

షోయబ్ బషీర్(20) ఆఫ్ స్పిన్నర్. ఇతను కౌంటీ క్రికెట్‌లో సోమర్‌సెట్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలోనే ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లోకి అరంగేట్రం  చేసిన ఈ  కుర్రాడు తన బౌలింగ్ యాక్షన్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. దీంతో ఉపఖండ పిచ్‌లపై రాణించగలడనే నమ్మకంతో సెలెక్టర్లు అతనికి చోటు కల్పించారు.

భారత పర్యటనకు ఇంగ్లాండ్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ ఫోక్స్, రెహాన్ అహ్మద్, షోయబ్ బషీర్, టామ్ హార్ట్లీ, జాక్ లీచ్, ఆలీ రాబిన్సన్, జేమ్స్ ఆండర్సన్, గుస్ అట్కిన్సన్, మార్క్ వుడ్.