
వన్డేల్లో ఐదు వందల పరుగుల మార్కును ముందుగా అందుకునే సత్తా ఇంగ్లండ్‌కే ఉందని ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. అయితే, అందరూ ఊహిస్తున్నట్టు వరల్డ్‌కప్‌లో అన్నీ హై స్కోరింగ్ మ్యాచ్‌లు ఉండకపోవచ్చని గురువారం జరిగిన పది జట్ల కెప్టెన్ల మీడియా సమావేశంలో కోహ్లీ అన్నాడు. గతేడాది ఆస్ట్రేలియా 481/6 రన్స్ చేసిన ఇంగ్లండ్ వన్డేల్లో టాప్ స్కోరు రికార్డును బద్దలు కొట్టింది. దాంతో, ఈ ఫార్మాట్‌లో 500 రన్స్ సాధ్యమేనా అన్న ప్రశ్నకు విరాట్ బదులిచ్చాడు. ‘ఇది మీ మీదే (ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌ను చూస్తూ) ఆధారపడి ఉంటుంది. 500 రన్స్‌ను అందరికంటే ముందుగానే అందుకోవాలని ఆతృతగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. టోర్నీలో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉన్నా.. 370–380 రన్స్‌ను ఛేజ్ చేయడం ఎంత కష్టమో 260–270 రన్స్ టార్గెట్‌ను అందుకోవడం కూడా కష్టమే అవుతుంది. మొదట్లో ఎక్కువ స్కోరు నమోదైనా టోర్నీ నడుస్తున్న కొద్ది హైస్కోరింగ్ మ్యాచ్‌లు ఉండకపోవచ్చు. 250 రన్స్‌ను డిఫెండ్ చేసుకోవడం కూడా చూస్తామ’ని కోహ్లీ అభిప్రాయపడ్డాడు.