IND vs ENG 2025: టీమిండియాతో నాలుగో టెస్ట్.. ప్లేయింగ్ 11 ప్రకటించిన ఇంగ్లాండ్

IND vs ENG 2025: టీమిండియాతో నాలుగో టెస్ట్.. ప్లేయింగ్ 11 ప్రకటించిన ఇంగ్లాండ్

మాంచెస్టర్‌లో ఇండియాతో బుధవారం (జూలై 23) ప్రారంభం కానున్న నాలుగో టెస్ట్ కోసం ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు సోమవారం (జూలై 21) తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించింది. ఆతిథ్య ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ లో ఒక మార్పుతో బరిలోకి దిగుతుంది. లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో గాయపడిన షోయబ్ బషీర్ స్థానంలో ఆఫ్ స్పిన్నర్ లియామ్ డాసన్‌ను ఇంగ్లాండ్ తుది జట్టులో చోటు కల్పించింది.

ఈ ఒక్క మార్పు మినహాయిస్తే ఇంగ్లాండ్ జట్టు మూడో టెస్టులో ఆడిన జట్టుతోనే మ్యాచ్ ఆడనుంది. బషీర్ గాయంతో 8 ఏళ్ళ తర్వాత  ఇంగ్లాండ్ స్క్వాడ్ లోకి  వచ్చిన డాసన్ ప్లేయింగ్ 11లో ఛాన్స్ దక్కించుకోవడం విశేషం. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టులో స్పిన్నర్లు ఎవరూ లేకపోవడం డాసన్ కు కలిసొచ్చింది. ఆల్ రౌండర్ గా పేరున్న ఈ ఆఫ్ స్పిన్నర్ బ్యాటింగ్ కూడా చేయగలగడం కలిసొచ్చే అంశం. 

ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఆర్డర్ విషయానికి వస్తే ఓపెనర్లుగా బెన్ డకెట్, జాక్ క్రాలీ ఆడనున్నారు. మూడో స్థానంలో పోప్ బ్యాటింగ్ చేస్తాడు. సీనియర్ బ్యాటర్ జో రూట్, యువ సంచలనం హ్యారీ బ్రూక్ వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో బ్యాటింగ్ కు వస్తారు. కెప్టెన్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ఆరో స్థానంలో బరిలోకి దిగనున్నాడు. సూపర్ ఫామ్ లో ఉన్న వికెట్ కీపర్ బ్యాటర్ జెమీ స్మిత్ ఏడో స్థానంలో ఆడతాడు. సీనియర్ బౌలర్ క్రిస్ వోక్స్, జోఫ్రా ఆర్చర్,బ్రైడాన్ కార్సే ఫాస్ట్ బౌలింగ్ బాధ్యతలు పంచుకుంటారు. స్పెషలిస్ట్ స్పిన్నర్ గా డాసన్ కు తుది జట్టులో స్థానం దక్కింది.

ALSO READ : అన్షుల్‌‌x ప్రసిధ్.. నాలుగో టెస్టుకు ఆకాశ్ అనుమానమే

8 ఏళ్ళ తర్వాత ఇంగ్లాండ్ టెస్ట్ జట్టులో డాసన్ 

డాసన్ 8 ఏళ్ళ తర్వాత ఇంగ్లాండ్ తరపున టెస్ట్ ఆడబోతున్నాడు. చివరిసారిగా జూలై 2017లో ఇంగ్లాండ్ తరఫున డాసన్ టెస్ట్ క్రికెట్ ఆడాడు. 35 ఏళ్ల  ఈ ఆఫ్ స్పిన్నర్ కొన్నేళ్లుగా హాంప్‌షైర్ తరపున నిలకడగా ఆడుతున్నాడు. 2023, 2024లో PCA ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు స్క్వాడ్ నుంచి పేసర్లు సామ్ కుక్, జామీ ఓవర్టన్‌లను విడుదల చేసింది. వీరిద్దరూ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఆడటానికి అనుమతిని ఇచ్చారు.

బషీర్ కు గాయం:
 
ఇంగ్లాండ్ ఆఫ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ గాయంతో టెస్ట్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. టీమిండియాతో జరిగిన మూడో టెస్టులో భాగంగా మూడో రోజు బషీర్ ఎడమ చేతి చిటికెన వేలికి గాయం అయింది. స్కాన్‌ చేస్తే పగుళ్లు ఉండడంతో సర్జరీ అవసరమని డాక్టర్లు సూచించారు. దీంతో నాలుగు, ఐదు టెస్టులకు ఈ ఇంగ్లాండ్ ప్రధాన స్పిన్న దూరమయ్యాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్ 78వ ఓవర్‌లో బషీర్ వేసిన బంతిని జడేజా బలంగా బాదాడు. బంతిని ఆపే క్రమంలో బషీర్ చేతికి బలంగా తగిలింది. దీంతో బౌలింగ్ చేయలేక ఓవర్ మధ్యలోనే బషీర్ గ్రౌండ్ వదిలి వెళ్ళిపోయాడు. మిగిలిన ఓవర్ రూట్ పూర్తి చేశాడు. 

విరిగిన వేలు తోనే బషీర్ నాలుగో రోజు బ్యాటింగ్ కు వచ్చాడు. ఐదో రోజు కూడా జట్టు కోసం గాయంతోనే బౌలింగ్ చేశాడు. ఐదో రోజు తీవ్ర ఉత్కంఠ సమయంలో సిరాజ్ వికెట్ తీసి బషీర్ ఇంగ్లాండ్ కు చివరి వికెట్ అందించాడు. దీంతో ఇంగ్లాండ్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. 

ఇంగ్లాండ్ ప్లేయింగ్ XI:

జాక్ క్రాలే, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), లియామ్ డాసన్, క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్సే, జోఫ్రా ఆర్చర్