ఇంగ్లండ్‌‌‌‌ దీటుగా..తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో 207/2

ఇంగ్లండ్‌‌‌‌ దీటుగా..తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో 207/2
  •     బెన్‌‌‌‌ డకెట్‌‌‌‌ సెంచరీ
  •     ఇండియా తొలి ఇన్నింగ్స్‌‌‌‌ 445 ఆలౌట్‌‌‌‌

రాజ్‌‌‌‌కోట్‌‌‌‌: ఇండియాతో జరుగుతున్న మూడో టెస్ట్‌‌‌‌లో ఇంగ్లండ్‌‌‌‌ దీటుగా ఆడుతోంది. బెన్‌‌‌‌ డకెట్‌‌‌‌ (118 బాల్స్‌‌‌‌లో 21 ఫోర్లు, 2 సిక్స్‌‌‌‌లతో 133 బ్యాటింగ్‌‌‌‌) సెంచరీతో చెలరేగడంతో.. శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో 35 ఓవర్లలో 207/2 స్కోరు చేసింది. డకెట్‌‌‌‌తో పాటు జో రూట్‌‌‌‌ (9 బ్యాటింగ్‌‌‌‌) క్రీజులో ఉన్నాడు.

రెండో సెషన్‌‌‌‌లో ఆట మొదలుపెట్టిన ఇంగ్లండ్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌కు డకెట్‌‌‌‌ వెన్నెముకగా నిలిచాడు. జాక్‌‌‌‌ క్రాలీ (15) ఫెయిలైనా.. తొలి వికెట్‌‌‌‌కు 89 రన్స్‌‌‌‌ జత చేసిన డకెట్‌‌‌‌.. ఒలీ పోప్‌‌‌‌ (39)తో రెండో వికెట్‌‌‌‌కు 93 రన్స్‌‌‌‌ జోడించి ఇన్నింగ్స్‌‌‌‌కు మంచి ఆరంభాన్నిచ్చాడు. అంతకుముందు 326/5 ఓవర్‌‌‌‌నైట్‌‌‌‌ స్కోరుతో ఆట కొనసాగించిన ఇండియా తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో 445 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది. రవీంద్ర జడేజా (225 బాల్స్‌‌‌‌లో 9 ఫోర్లు, 2 సిక్స్‌‌‌‌లతో 112) త్వరగా ఔటైనా, ధ్రువ్‌‌‌‌ జురెల్‌‌‌‌ (46) ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఇంగ్లిష్‌‌‌‌ టీమ్‌‌‌‌ ఇంకా 238 రన్స్‌‌‌‌ వెనకబడి ఉంది. 

వరుస ఓవర్లలో..

ఆట మొదలైన 4 ఓవర్ల తర్వాత ఇండియాకు డబుల్‌‌‌‌ స్ట్రోక్‌‌‌‌ తగిలింది. ఓవర్‌‌‌‌నైట్‌‌‌‌ బ్యాటర్‌‌‌‌ జడేజా, నైట్‌‌‌‌ వాచ్‌‌‌‌మన్‌‌‌‌ కుల్దీప్‌‌‌‌ యాదవ్‌‌‌‌ (4) ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. ఇన్నింగ్స్‌‌‌‌ 90వ ఓవర్‌‌‌‌లో అండర్సన్‌‌‌‌ (1/61) వేసిన రౌండ్‌‌‌‌ వికెట్‌‌‌‌ బాల్‌‌‌‌ కుల్దీప్‌‌‌‌ బ్యాట్‌‌‌‌ను టచ్‌‌‌‌ చేస్తూ కీపర్‌‌‌‌ చేతుల్లోకి వెళ్లింది. తర్వాతి ఓవర్‌‌‌‌లో జో రూట్‌‌‌‌ (1/70) వేసిన టర్నింగ్‌‌‌‌ బాల్‌‌‌‌ను జడేజా ఆన్‌‌‌‌సైడ్‌‌‌‌ ఆడేందుకు ట్రై చేశాడు.

కానీ బ్యాట్‌‌‌‌ పేస్‌‌‌‌ ఓపెన్‌‌‌‌ కావడంతో డైరెక్ట్‌‌‌‌గా రూట్‌‌‌‌ చేతుల్లోకి వెళ్లింది. 8 బాల్స్‌‌‌‌ తేడాలో ఈ ఇద్దరు ఔట్‌‌‌‌ కావడంతో ఇండియా స్కోరు 331/7గా మారింది. ఈ దశలో అశ్విన్‌‌‌‌, జురెల్‌‌‌‌ పోరాటం చేశారు. 29 ఓవర్లు క్రీజులో నిలిచిన ఈ జోడీ 8వ వికెట్‌‌‌‌కు 77 రన్స్‌‌‌‌ జత చేసింది. అయితే 4 ఓవర్ల తేడాలో ఈ ఇద్దరూ ఔటవ్వడంతో ఇండియా భారీ స్కోరుకు కళ్లెం పడింది. చివర్లో   బుమ్రా (26) వేగంగా ఆడినా వికెట్‌‌‌‌ను కాపాడుకోలేదు. స్పిన్నర్లను టార్గెట్‌‌‌‌ చేసి ఫోర్లు, ఓ సిక్స్‌‌‌‌ బాదగా, అవతలి వైపు మహ్మద్‌‌‌‌ సిరాజ్‌‌‌‌ (3 నాటౌట్‌‌‌‌) బ్యాట్‌‌‌‌ ఝుళిపించలేదు. 131వ ఓవర్‌‌‌‌లో  వుడ్‌‌‌‌ (4/114) వేసిన స్ట్రయిట్‌‌‌‌ డెలివరీకి బుమ్రా ఎల్బీ కావడంతో 10వ వికెట్‌‌‌‌కు 30 రన్సే జతయ్యాయి. 

అశ్విన్‌‌‌‌ @ 500

ఆఫ్‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌ అశ్విన్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ల్లో 500 వికెట్ల మైలురాయి (98 మ్యాచ్‌‌‌‌లు)ని అందుకున్నాడు. దీంతో ఇండియా తరఫున ఈ ఫీట్‌‌‌‌ సాధించిన రెండో బౌలర్‌‌‌‌గా రికార్డులకెక్కాడు. అనిల్‌‌‌‌ కుంబ్లే (619) ముందున్నాడు. ఓవరాల్‌‌‌‌గా ఈ ఘనత సాధించిన మూడో ఆఫ్‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌గా రవి అశ్విన్‌‌‌‌ రికార్డు నెలకొల్పాడు. మురళీధరన్‌‌‌‌ (800), నేథన్‌‌‌‌ లైయన్‌‌‌‌ (517) టాప్‌‌‌‌–2లో ఉన్నారు.

మొత్తానికి 500 వికెట్ల క్లబ్‌‌‌‌లో చేరిన 9వ బౌలర్‌‌‌‌ అశ్విన్‌‌‌‌. మురళీధరన్‌‌‌‌, షేన్‌‌‌‌ వార్న్‌‌‌‌ (708), అండర్సన్‌‌‌‌ (696), కుంబ్లే, స్టువర్ట్‌‌‌‌ బ్రాడ్‌‌‌‌ (604), మెక్‌‌‌‌గ్రాత్‌‌‌‌ (563), కోట్నీ వాల్ష్‌‌‌‌ (519), లైయన్‌‌‌‌ ఈ జాబితాలో ఉన్నారు. ఇక బాల్స్‌‌‌‌(25,714) పరంగా అత్యంత వేగంగా 500 వికెట్ల ఫీట్‌‌‌‌ను సాధించిన రెండో బౌలర్‌‌‌‌ అశ్విన్‌‌‌‌. మెక్‌‌‌‌గ్రాత్‌‌‌‌ (25,528) ముందున్నాడు. మ్యాచ్‌‌‌‌ల పరంగా మురళీధరన్‌‌‌‌ (87 టెస్ట్‌‌‌‌లు) ముందుండగా, అశ్విన్‌‌‌‌ రెండో ప్లేస్‌‌‌‌లో ఉన్నాడు. 

సంక్షిప్త స్కోర్లు

ఇండియా తొలి ఇన్నింగ్స్‌‌‌‌: 445 ఆలౌట్‌‌‌‌ (జడేజా 112, ధ్రువ్‌‌‌‌ జురెల్‌‌‌‌ 46, మార్క్‌‌‌‌ వుడ్‌‌‌‌ 4/114). ఇంగ్లండ్‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌: 207/2 (బెన్‌‌‌‌ డకెట్‌‌‌‌ 133*, జో రూట్‌‌‌‌ 9*, అశ్విన్‌‌‌‌ 1/37).

ఫ్యామిలీ హెల్త్‌ ఎమర్జెన్సీ కారణంగా అశ్విన్‌ మూడో టెస్ట్‌ నుంచి అర్ధంతరంగా వైదొలిగాడు. అయితే క్రికెటర్​ కుటుంబంలో ఎవరికేమైందనే  అంశంపై బోర్డు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. 

ఇండియాకు 5 రన్స్‌‌‌‌ పెనాల్టీ

బ్యాటర్లు పిచ్‌‌‌‌ మధ్యలో పరుగెత్తినందుకు ఇండియాకు ఐదు రన్స్‌‌‌‌ పెనాల్టీ పడింది. తొలి రోజు ఆటలో జడేజా పిచ్‌‌‌‌ మధ్యలో పరుగెత్తగా అంపైర్లు హెచ్చరించి వదిలేశారు. కానీ రెండో రోజు ఇండియా ఇన్నింగ్స్‌‌‌‌ 102వ ఓవర్‌‌‌‌లో మూడో బాల్‌‌‌‌ తర్వాత అశ్విన్‌‌‌‌ కూడా పిచ్‌‌‌‌ మధ్యలో పరుగెత్తాడు. దీంతో రెండో తప్పిదంగా భావించిన అంపైర్లు పెనాల్టీ విధించారు. ఫలితంగా ఇంగ్లండ్‌‌‌‌ ఒక్క బాల్‌‌‌‌ కూడా ఆడకుండానే 5/0 స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌‌‌‌ను మొదలుపెట్టింది.