
- నేడు వెస్టిండీస్‌తో కీలక మ్యాచ్
- మ. 3 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో
సౌతాంప్టన్: బంగ్లాదేశ్‌పై భారీ విజయం సాధించిన ఇంగ్లండ్ వరల్డ్‌కప్ లీగ్ దశలో మరోపోరుకు రెడీ అయ్యింది. ఇంగ్లిష్ జట్టుకు వెస్టిండీస్ రూపంలో శుక్రవారం పెద్ద సవాల్ ఎదురుకానుంది. టోర్నీలో ఇప్పటిదాకా మూడు మ్యాచ్‌లాడిన ఇంగ్లండ్ రెండింటిలో గెలిచి ఓ దానిలో ఓడిపోగా, విండీస్ మూడు మ్యాచ్‌ల్లో ఒకటి మాత్రమే గెలిచింది. ఒక మ్యాచ్‌లో ఓడిపోగా, సౌతాఫ్రికాతో సోమవారం జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయింది. దీంతో ఇరు జట్లుకు ఈ మ్యాచ్‌లో విజయం కీలకం.
వరల్డ్‌కప్‌కు ముందు కరీబియన్ గడ్డపై ఇరుజట్లు చివరిగా ఆడిన ఐదు వన్డేల సిరీస్ 2–2తో డ్రా గా ముగిసింది. ఈ సిరీస్‌లో యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ ఇంగ్లిష్ బౌలర్లపై తన ప్రతాపం చూపెట్టాడు. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 424 రన్స్ చేసిన గేల్ ఏకంగా 39 సిక్సర్లు బాదేశాడు. దీంతో ఈ మ్యాచ్‌లో గెలవాలంటే గేల్‌ను అడ్డుకోవడం ఇంగ్లండ్‌కు చాలా కీలకం. మరోపక్క పేసర్ జోఫ్రా ఆర్చర్ ఇంగ్లండ్‌కు ఈ మ్యాచ్‌లో తురుపు ముక్క కానున్నాడు. వెస్టిండీస్‌కు చెందిన 24 ఏళ్ల ఆర్చర్ బార్బడోస్‌లో జూనియర్ లెవల్ క్రికెట్ ఆడి గత ఏప్రిల్ నెలలోనే ఇంగ్లండ్‌కు ఎంపికయ్యాడు. తన పేస్‌తో అద్భుతాలు చేస్తున్న ఆర్చర్‌పై ఇంగ్లండ్ జట్టు భారీగానే ఆశలు పెట్టుకుంది. అయితే ఆర్చర్‌ను ఎలా ఎదుర్కోవాలో బాగా తెలుసని విండీస్ అంటోంది. దీంతో ఈ మ్యాచ్‌లో ఆర్చర్, గేల్ మధ్య పోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గేల్, ఆర్చర్ మినహా బలాబలాల విషయంలో ఇరుజట్లు సమానంగానే ఉన్నాయి. సొంతగడ్డతో పాటు టాపార్డర్ అంతా ఫామ్‌లో ఉండడం మోర్గాన్ సేనకు కలిసొచ్చే అంశాలు.