కొలంబో: ఇంగ్లండ్‌ను ఓడిస్తే నేరుగా సెమీఫైనల్‌కు చేరే అవకాశాన్ని న్యూజిలాండ్ చేజేతులా వదులుకుంది. చిన్న టార్గెట్‌ను కాపాడే ప్రయత్నంలో అద్భుతంగా బౌలింగ్ చేసి 2/2.. 58/4.. 117/6తో ఇంగ్లిష్ టీమ్‌ను వణికించిన కివీస్ చివరి మూడు ఓవర్లలో తడబడి గెలుపు ముంగిట బోల్తా కొట్టింది. తన సెమీఫైనల్ భవితవ్యాన్ని పాకిస్తాన్–శ్రీలంక చేతిలో పెట్టింది. శుక్రవారం ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠగా సాగిన సూపర్–8 రౌండ్ గ్రూప్–2 పోరులో న్యూజిలాండ్ 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయింది.
తొలుత కివీస్ 20 ఓవర్లలో 159/7 స్కోరు చేసింది. గ్లెన్ ఫిలిప్స్ (28 బాల్స్‌లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 39), టిమ్ సిఫర్ట్ (25 బాల్స్‌లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 35), ఫిన్ అలెన్ (19 బాల్స్‌లో 3 సిక్సర్లతో 29) రాణించారు. విల్ జాక్స్ (2/23), ఆదిల్ రషీద్ (2/28), రెహాన్ అహ్మద్ (2/28) తలో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఇంగ్లండ్ 19.3 ఓవర్లలో 161/6 స్కోరు చేసి గెలిచింది.
విల్ జాక్స్ (18 బాల్స్‌లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 32 నాటౌట్), రెహాన్ అహ్మద్ (7 బాల్స్‌లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 19 నాటౌట్) ఏడో వికెట్‌కు 16 బాల్స్‌లోనే 44 రన్స్ జోడించి తమ జట్టును గెలిపించారు. కివీస్ స్పిన్నర్ రచిన్ రవీంద్ర (3/19) మూడు వికెట్లు తీసినా ఫలితం లేకపోయింది. విల్ జాక్స్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇంగ్లిష్ టీమ్ హ్యాట్రిక్ విక్టరీతో గ్రూప్ టాపర్‌గా ముంబైలో సెకండ్ సెమీఫైనల్‌కు రెడీ అయింది.
ఓపెనర్ల జోరు.. స్పిన్నర్ల కట్టడి
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ మెరుపు ఆరంభంతో భారీ స్కోరు చేసేలా కనిపించినా.. ఇంగ్లండ్ స్పిన్నర్లు పక్కా ప్లాన్‌తో ఆ టీమ్‌ను కట్టడి చేశారు. స్టార్టింగ్‌లో ఓపెనర్లు ఫిన్ అలెన్, టిమ్ సిఫర్ట్ ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించారు. తొలి ఓవర్‌ను మెయిడిన్ చేసిన స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ వేసిన మూడో ఓవర్లో అలెన్ సిక్స్‌తో బౌండరీల ఖాతా తెరవగా.. ఆర్చర్ బౌలింగ్‌లోనే సిఫర్ట్ 4, 4, 6తో రెచ్చిపోయాడు. దాంతో పవర్ ప్లేను కివీస్ 54/0తో ముగించింది.
అయితే, ఫీల్డింగ్ పెరిగిన తర్వాత ఇంగ్లండ్ కెప్టెన్ బ్రూక్ స్పిన్నర్లను రంగంలోకి దించడంతో ఆట స్వరూపం మారిపోయింది. ఆదిల్ రషీద్ తన ఆరో బాల్‌కే సిఫర్ట్‌ను స్టంపౌట్ చేసి తొలి వికెట్‌కు 64 రన్స్ పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ చేశాడు. ఆ వెంటనే విల్ జాక్స్ బౌలింగ్‌లో అలెన్.. బెథెల్‌కు క్యాచ్ ఇవ్వడంతో కివీస్ స్పీడుకు బ్రేకులు పడ్డాయి. మిడిల్ ఓవర్లలో ఇంగ్లండ్ స్పిన్నర్లు రన్స్ వేగాన్ని పూర్తిగా నియంత్రించారు. జాక్స్, రషీద్ , రెహాన్ అహ్మద్ పోటాపోటీగా వికెట్లు తీశారు.
ఓ ఎండ్‌లో గ్లెన్ ఫిలిప్స్ ధాటిగా ఆడినా మరో ఎండ్‌లో వరుసగా రచిన్ రవీంద్ర (11), మార్క్ చాప్‌మన్ (15), డారిల్ మిచెల్ (3)ను పెవిలియన్ చేర్చారు. ఒంటరి పోరాటం చేస్తున్న ఫిలిప్స్‌ను జాక్స్ 18వ ఓవర్లో క్లీన్ బౌల్డ్ చేసి న్యూజిలాండ్ ఆశలపై నీళ్లు చల్లాడు. 19వ ఓవర్లో ఆదిల్ ఐదు రన్సే ఇవ్వగా.. లాస్ట్ ఓవర్లో మకొంచి (14) ఫోర్, శాంట్నర్ (9 నాటౌట్) సిక్స్‌తో కివీస్ స్కోరు 150 మార్కు దాటింది.
జాక్స్, రెహాన్ సూపర్ ఫినిషింగ్
చిన్న టార్గెట్ ఛేజింగ్‌లో ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే వరుస ఎదురుదెబ్బలు తగిలాయి. తొలి ఎనిమిది బాల్స్‌లోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి2/2తో డీలాపడింది. కివీస్ పేసర్ మ్యాట్ హెన్రీ నాలుగో బాల్‌కే ఫిల్ సాల్ట్ (2)ను పెవిలియన్ పంపగా, తర్వాతి ఓవర్లో లోకీ ఫెర్గూసన్.. బట్లర్ (0)ను ఔట్ చేసి దెబ్బకొట్టడంతో ఇంగ్లిష్ టీమ్ తీవ్ర ఒత్తిడిలో పడింది. ఈ టైమ్‌లో ఇన్‌ఫామ్ బ్యాటర్, కెప్టెన్ హ్యారీ బ్రూక్ (26), జాకబ్ బెథెల్ (21) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు.
దాంతో పవర్ ప్లేలో 47/2తో నిలిచిన ఇంగ్లిష్ టీమ్ కోలుకున్నట్టు కనిపించింది. కానీ, ఎనిమిదో ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన గ్లెన్ ఫిలిప్స్ తన తొలి బ్రూక్‌ను ఔట్ చేసి మూడో వికెట్‌కు 54 రన్స్ పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ చేశాడు. ఆపై, రచిన్ రవీంద్ర బౌలింగ్‌లో బెథెల్ ఇచ్చిన క్యాచ్‌ను ఫిలిప్స్ అద్భుతమైన డైవ్‌తో అందుకోగా.. ఇంగ్లిష్ టీమ్ 58/4తో కష్టాల్లో పడింది.
అయితే, సామ్ కరన్ (24), టామ్ బాంటన్ (33) క్రీజులో నిలదొక్కుకొని జట్టును రేసులో నిలిపారు. క్రమం తప్పకుండా బౌండరీలు కొట్టడంతో 14 .2 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోరు వంద దాటింది. కానీ రచిన్ తన వరుస ఓవర్లలో ఈ ఇద్దరినీ పెవిలియన్ చేర్చి కివీస్ క్యాంప్‌లో జోష్ నింపాడు. చివరి 18 బాల్స్‌లో 43 రన్స్ అవసరం అవగా ఇంగ్లండ్‌పై ఒత్తిడి పెరిగింది.
కానీ, కివీస్ కెప్టెన్ శాంట్నర్ 18వ ఓవర్లో అనూహ్యంగా ఫిలిప్స్‌ను బౌలింగ్‌కు దింపి తప్పు చేశాడు. ఆ ఓవర్లో రెహాన్ అహ్మద్ సిక్స్.. విల్ జాక్స్ 6, 4, 4 సహా 22 రన్స్ రాబట్టి మ్యాచ్‌ను మలుపు తిప్పారు. ఆపై శాంట్నర్ బౌలింగ్‌లో రెహాన్ భారీ సిక్స్ కొట్టి సమీకరణాన్ని 6 బాల్స్‌లో 5 రన్స్‌గా మార్చగా.. హెన్రీ బౌలింగ్‌లో ఫోర్‌తో జాక్స్ మ్యాచ్ ముగించాడు.
పాక్ 64 రన్స్ తేడాతో నెగ్గితేనే
ఇంగ్లండ్ చేతిలో ఓడినా న్యూజిలాండ్ సెమీస్ రేసులో ముందుంది. గ్రూప్–2లో ఇంగ్లండ్ 6 పాయింట్లతో టాప్‌లో ఉండగా.. కివీస్ 3 పాయింట్ల (+1.39 రన్‌రేట్)తో రెండో ప్లేస్‌లో నిలిచింది. ఒక పాయింట్‌తో మూడో ప్లేస్‌లో ఉన్న పాక్ రన్‌రేట్ (–0.461) తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో కివీస్‌ను దాటి ముందుకెళ్లాలంటే శనివారం శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో పాక్‌కు భారీ విజయం కావాలి. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 64 రన్స్ తేడాతో నెగ్గాలి. ఛేజింగ్ చేయాల్సి వస్తే 13.1 ఓవర్లలోనే టార్గెట్‌ను పూర్తి చేయాలి. ఈ రెండింటిలో ఏది జరగకపోయినా.. పాక్ ఓడినా న్యూజిలాండ్ సెకండ్ ప్లేస్‌తో సెమీస్ చేరి కోల్‌కతాలో ఫస్ట్ సెమీఫైనల్ ఆడనుంది.
