టీ20వరల్డ్ కప్ నేపథ్యంలో..ప్రస్తుతం జట్లన్నీ..టీ20 మ్యాచులతో బిజీ బిజీగా ఉన్నాయి. ఇప్పటికే ఆసీస్ టీమిండియాతో టీ20 సిరీస్ ఆడుతుండగా..దాయాది పాకిస్తాన్..ఇంగ్లాండ్తో టీ20 సిరీస్లో పాల్గొంటోంది. ఇంగ్లాండ్, పాక్ జట్ల మధ్య ఏకంగా 7 టీ20 మ్యాచుల సిరీస్ జరుగుతోంది. రెండు జట్ల మధ్య ఇప్పటికే రెండు మ్యాచులు జరిగితే..అందులో చెరోటి గెలిచాయి. తాజాగా జరిగిన మూడో టీ20లో ఇంగ్లాండ్ సూపర్ విక్టరీ కొట్టింది. కరాచీలో పాక్పై ఏకంగా 63 పరుగుల భారీ తేడాతో ఆంగ్లేయులు విజయం సాధించారు.
చితక్కొట్టిన బ్రూక్..
ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 20 ఓవర్లల్లో 3 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. విల్ జాక్స్ 22 బంతుల్లో 40 పరుగులు చేయగా...బెన్ డకెట్ 42 బంతుల్లో 70 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. మరో మిడిలార్డర్ బ్యాట్స్మన్ హ్యారీ బ్రూక్ 35 బంతుల్లోనే 81 పరుగులతో పాకిస్తాన్ బౌలర్లను చితక్కొట్టాడు.
చేతులెత్తేసిన పాక్..
222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్.. లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 158 పరుగులే చేసింది. రిజ్వాన్, బాబర్ అజామ్, హైదర్ ఆలీ విఫలమయ్యారు. షాన్ మసూద్ ఒక్కడే 65 పరుగులు చేశాడు. లోయర్ ఆర్డర్‌లో ఖుష్దిల్ షా 29, మహ్మద్ నవాజ్ 19 పరుగులతో రాణించారు. కానీ..జట్టును మాత్రం గెలిపించలేకపోయారు.
