రూ.42 కోట్లతో ‘ఏన్కూరు’లో అభివృద్ధి పనులు : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

రూ.42 కోట్లతో ‘ఏన్కూరు’లో అభివృద్ధి పనులు : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

తల్లాడ, వెలుగు: ఏన్కూరు మండల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బుధవారం నాచారం అద్భుత వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మంత్రిని ఘనంగా సన్మానించారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ ఏన్కూరు నుంచి నాచారం ఆలయానికి వెళ్లే రహదారిని డబుల్‌‌‌‌ రోడ్డుగా అభివృద్ధి చేస్తున్నామని, పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. 

ఇప్పటికే మండలానికి రూ.42 కోట్ల నిధులు మంజూరు చేసి వివిధ అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. ఆలయ అభివృద్ధికి కూడా ప్రభుత్వ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా ప్రవహిస్తున్న గోదావరి జలాలను మంత్రి పరిశీలించారు. కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, జిల్లా కాంగ్రెస్ నాయకుడు గుత్తా వెంకటేశ్వరరావు, దేవదాయ శాఖ ఇన్‌‌‌‌స్పెక్టర్ సమత, ఆలయ ఈవో రామారావు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మేల్‌‌‌‌-ఫిమేల్‌‌‌‌ మొక్కజొన్న  రైతుల గోడు మంత్రి దృష్టికి..

కొణిజర్ల: మేల్‌‌‌‌–ఫిమేల్‌‌‌‌ మొక్కజొన్న సాగు చేసిన రైతులకు ఆరు నెలలుగా పంట డబ్బులు అందకపోవడంపై రైతులు బుధవారం ఖమ్మం క్యాంప్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి తమ సమస్యను వివరించారు. కొణిజర్ల మండలంలోని సింగరాయపాలెం, సిద్ధిక్‌‌‌‌నగర్, మేకలకుంట, తీగలబంజర, ఏన్కూరు మండలంలోని రేపల్లెవాడ గ్రామాల్లో ఏఎన్‌‌‌‌ఎం సీడ్స్‌‌‌‌ ద్వారా మేల్‌‌‌‌–ఫిమేల్‌‌‌‌ మొక్కజొన్న సాగు చేయించినట్లు తెలిపారు. పంటను కంపెనీకి తరలించిన 10–15 రోజుల్లో డబ్బులు చెల్లిస్తామని హామీ ఇచ్చారని, ఆరు నెలలు గడిచినా బకాయిలు చెల్లించలేదని మంత్రికి వివరించారు. విచారణ జరిపించి బకాయిలు ఇప్పిస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు రైతులు తెలిపారు. ఈ విషయాన్ని వైరా ఎమ్మెల్యే మాలోత్‌‌‌‌ రామదాస్‌‌‌‌ నాయక్‌‌‌‌ దృష్టికి కూడా తీసుకెళ్లి, తమకు రావాల్సిన డబ్బులు ఇప్పించాలని కోరారు. సమస్య పరిష్కారం కాకపోతే పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని రైతులు పేర్కొన్నారు.

అంతర్జాతీయ ప్రమాణాలతో గురుకుల పాఠశాల

ఖమ్మం టౌన్ : గిరిజన ప్రాంతాల్లో విద్యా ప్రమాణాలను పెంచడంతో పాటు ఖమ్మం, ఉమ్మడి ఖమ్మం జిల్లాల విద్యార్థులకు నాణ్యమైన, విలువలతో కూడిన విద్య అందించేందుకు రఘునాథపాలెం మండలం జింకలతండాలో స్వామినారాయణ గురుకుల పాఠశాల నిర్మాణానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్‌‌‌‌తో కలిసి బుధవారం భూమిపూజ, శంకుస్థాపన చేశారు. ఈ గురుకులంతో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య అందుబాటులోకి వస్తుందని మంత్రి అన్నారు. అనంతరం ఖమ్మం జిల్లా ప్రజలకు సులభతరమైన, సమర్థవంతమైన ఆధార్ సేవలు అందించేందుకు కవిరాజ్‌‌‌‌నగర్‌‌‌‌లో ఏర్పాటు చేసిన ఖమ్మం ఆధార్ సేవా కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.