20 మంది జవాన్ల త్యాగానికి న్యాయం జరగాలి: మన్మోహన్‌

20 మంది జవాన్ల త్యాగానికి న్యాయం జరగాలి: మన్మోహన్‌
  • మోడీ ప్రకటనలపై విమర్శలు చేసిన మాజీ ప్రధాని

న్యూఢిల్లీ: ఇండియా – చైనా బోర్డర్‌‌లోని గాల్వాన్‌ లోయలో జరిగిన ఘటనపై ప్రధాని మోడీ చేసిన ప్రకటనను మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ తప్పుబట్టారు. ఆల్‌ పార్టీ మీటింగ్‌లో మోడీ చెప్పిన మాటలను ఉద్దేశిస్తూ ఆయన ఈ ప్రకటన చేశారు. గాల్వాన్‌ లోయల్‌ వీరమరణం పొందిన కల్నల్‌ సంతోష్‌ బాబు సహా 20 మంది జవాన్ల త్యాగాలను వృథా కనివ్వొద్దని, వాళ్ల కుటుంబాలకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా మన్మోహన్‌సింగ్‌ డిమాండ్‌ చేశారు. వాళ్లకు ఏమైనా తక్కువ చేస్తే ప్రజలకు చారిత్రాత్మక మోసం చేసినట్లుఉ అవుతుందని అన్నారు. “ ప్రస్తుతం చాలా క్లిష్టమైన పరిస్థితులలోఉన్నాం. గవర్నమెంట్‌ తీసుకుంటున్న నిర్ణయాలు భవిష్యత్తు తరాలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ప్రధాని తాను మాట్లాడే మాటల పర్యావసనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. డెమోక్రసీలో బాధ్యత అంతా ప్రధాని ఆఫీస్‌కే ఉంటుంది. వ్యూహాత్మక, ప్రాదేశిక ప్రయోజనాలతో పాటు దేశ సెక్యూరిటీపై ఆయన మాటలు, ప్రకటనలు స్పష్టంగా ఉండాలి” అని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు కలిసి పనిచేయాలని అన్నారు. దౌత్య, లేదా నిర్ణయాత్మక నాయకత్వానికి తప్పుడు సమాచారం ఇవ్వడం ప్రత్యామ్నాయం కాదని ఆయన చెప్పారు.