Sankranti Special : దేశం మొత్తం సంక్రాంతి.. పేరు తీరు వేరువేరు అంతే..

Sankranti Special : దేశం మొత్తం సంక్రాంతి.. పేరు తీరు వేరువేరు అంతే..

ఇంటి ముందు రంగుల ముగ్గులు, వంటింట్లో పిండి వంటలు, తెల్లారి భోగిమంటలు, పొద్దున్నే పూజలు ఇవన్నీ ఉన్నాయంటే అదే సంక్రాంతి పండుగ. పండుగనాడు చాలామంది స్వీట్లు, గిఫ్ట్లు, బట్టలు వంటివి ఇచ్చిపుచ్చుకుంటారు. మనదేశంలోనే కాదు, ఇతర దేశాల్లో ఉన్న మనవాళ్లంతా పండుగ చేసుకుంటారు. అయితే మనదేశంలో జరుపుకునే ఈ పండుగకు రాష్ట్రానికో పేరు, సెలబ్రేషన్ కు తీరూ ఉన్నాయి. అవేంటంటే... 

సంక్రాంతి పండుగను తమిళనాడులో తాయ్ పొంగల్ లేదా ఉజావర్ తిరునాళ్, పశ్చిమ పండుగను తమిళనాడులో తాయ్ బెంగాల్, బంగ్లాదేశ్ లో పౌశ్ సంక్రాంతి, అస్సాంలో మాఘ్ బిహు, పంజాబ్లో మాఫీ, కర్నాటకలో సుగీ హబ్బ, ఉత్తరాఖండ్ లో గుగుటి, ఒడిశాలో మకర మేళా లేదా మకర చౌళ, కేరళలో మకర విలక్కు, త్రిపురలో హంగ్రె, కాశ్మీర్ వ్యాలీలో శిశుర్ సేంక్రాత్, మిథిలలో తిలా సక్రెయిత్ అంటారు. 

కిచీ : 

ఉత్తరప్రదేశ్ లో సంక్రాంతిని కిచీ లేదా 'ఫెస్టివల్ ఆఫ్ డొనేషన్' అంటారు. అలహాబాద్లో ఉన్న గంగా, యమున, సరస్వతీ నదులు కలిసే చోట మాఘ జాతర చేస్తారు. ఇది సంక్రాంతి నుంచి నెల రోజుల పాటు జరుగుతుంది. సంక్రాంతి రోజున ఉపవాసం ఉంటారు. ఉపవాసం అయిపోయాక కిద్దీ తింటారు. ఈ సందర్భంగా గోరఖ్ పూర్ లో కిచ్దీ మేళా కూడా జరుగుతుంది. 

ఉత్తరాయణ్ : 

గుజరాత్ లో 'ఉత్తరాయణ్' అంటారు. గుజరాత్లో ప్రతి ఏడాది రెండొందల పండుగలు జరుగుతాయి. వాటిలో పెద్ద పండుగ ఉత్తరాయణ్. పండుగనాడు తల్లిదండ్రులు కూతుళ్లకు స్వీట్లు పంపుతారు. అంతేకాకుండా ఈరోజు పెద్ద ఎత్తున గాలిపటాలు ఎగరేస్తారు. అందుకోసం కొన్ని నెలల ముందునుంచే వాటిని తయారుచేయడం మొదలుపెడతారు. 

మాఘే సంక్రాంతి: 

పొరుగునున్న నేపాల్లో సంక్రాంతి పిలిచే పేరిది. ఈ రోజు తారు ప్రజలకు స్పెషల్. మగర్ కమ్యూనిటీకి ఇది సంవత్సరాది పండుగగా అక్కడి గవర్నమెంట్ ప్రకటించింది. లడ్డూలు, నెయ్యి, చిలగడ దుంపల (గెన్సుగడ్డ, మొరం గడ్డ) ను పంచుకుంటారు. 

లోహ్రి :

మకర సంక్రాంతిని హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో లోహ్రీ అని పిలుస్తారు. రాత్రుళ్లు అందరూ ఒక చోట చేరి భోగిమంట వేస్తారు. ఆ చలి రాత్రిలో భగభగమంటూ భోగిమంట ఎగిసిపడుతుంటే, ఆ మంటలో మరమరాలు (బొంగులు), నువ్వులు, పాప్ కార్న్లు వేస్తుంటారు. సంతోషం, సమృద్ధి కలగాలని కోరుతూ భోగిమంటకు పూజ చేస్తారు. బీహార్లో పండుగనాడు మినప్పప్పు, బియ్యం, బంగారం, ఉలెన్ బట్టలు, దుప్పట్లు వంటివి డొనేట్ చేస్తారు. మహారాష్ట్రలో పెళ్లైన ఆడవాళ్లంతా పత్తి, నూనె, ఉప్పు ఇచ్చిపుచ్చుకుంటారు. పాకిస్తాన్లో కూడా సంక్రాంతి పండుగ చేసుకుంటారు. అక్కడ తిర్మూరి అని పిలుస్తారు. సింధీ ప్రజలు మాత్రమే ఈ పండుగ చేస్తారు. 

సంక్రాంతి స్పెషల్స్...

ఈ పండుగనాడు స్పెషల్ అంటూ బోలెడు రకాలు మార్కెట్లో కనిపిస్తున్నాయి. వాటిలో గిఫ్ట్స్, యాక్సెసరీలు, కాఫీ కప్, బ్యాడ్జ్, దిండు, చాక్లెట్లతోపాటు పసుపు, కుంకుమలు ఉండే గిఫ్ట్ బాక్స్లు కొన్ని. ముగ్గులు వేయడం రాని వాళ్లు లేదా వెరైటీగా ఇంటిని అలంకరించుకోవాలి అనుకునేవాళ్ల కోసం ఫ్యాబ్రిక్ రంగోలి మ్యాట్లు ఉన్నాయి. ఇలా మరెన్నో సంక్రాంతి స్పెషల్ ఐటమ్స్ ఆన్లైన్లో దొరుకుతున్నాయి.