తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ వైపే ప్రజలు : ఏనుగు రవీందర్ రెడ్డి

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ వైపే ప్రజలు : ఏనుగు రవీందర్ రెడ్డి

కోటగిరి, వెలుగు: ఈ ఎన్నికల్లో కాంగ్రెస్​ను గెలిపించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్​ బాన్సువాడ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని ఎత్తొండలో సోమవారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో అల్పాహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన 50 మంది కాంగ్రెస్ చేరారు. 

ఏనుగు మాట్లాడుతూ....తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు కాంగ్రెస్ రాష్ట్రమిస్తే, సీఎం కేసీఆర్​అభివృద్ధి పేరుతో అప్పులు చేసి లక్షల కోట్లు దండుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాన్సువాడలో పోచారం కుటుంబ సభ్యుల అరాచకాలను అంతం చేయడానికే తాను వచ్చినట్లు చెప్పారు. బాన్సువాడలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సమాఖ్య అధ్యక్షుడు సోమశేఖర్ రావు, డీసీసీ ఉపాధ్యక్షుడు గంగాధర్ దేశాయ్, డీసీసీ డెలిగేట్ యలమంచిలి శ్రీనివాస్​రావు పాల్గొన్నారు.

వర్ని: ఉమ్మడి వర్ని మండలంలో పలు గ్రామాలకు చెందిన బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు చెందిన సుమారు 2 వేల మంది ఏనుగు రవీందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. పార్టీలో చేరిన వారిలో లక్ష్మాపుర్ మాజీ ఎంపీటీసీ బడ్యానాయక్, వర్ని మండల మాజీ జడ్పీటీసీ రంజ్యానాయక్, ఎస్ఎన్ పురం సర్పంచ్ తదితరులు ఉన్నారు.
బాన్సువాడ: మైనార్టీలకు అండగా ఉంటానని కాంగ్రెస్ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన బాన్సువాడ జమా మసీదులో మైనార్టీలను కలిసి వారి మద్దతు కోరారు. బాన్సువాడ వదిలి ఎక్కడికి వెళ్లనని, అర్ధరాత్రి ఫోన్ చేసిన కార్యకర్తలకు అందుబాటులో ఉంటాన్నారు. రవీందర్ రెడ్డి సతీమణి మంజుల కోటగిరి మాజీ జడ్పీటీసీ శివరాజ్ దేశాయ్​ని కలిసి మద్దతు కోరారు.

ALSO READ : ఆరు గ్యారంటీలతో మోసం చేసే కుట్ర : సత్యవతి రాథోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌