చెత్త కాల్చేస్తుండ్రు.. పొగతో స్థానికుల ఇబ్బందులు

చెత్త కాల్చేస్తుండ్రు..  పొగతో స్థానికుల ఇబ్బందులు

కాగజ్ నగర్, వెలుగు: కాగజ్ నగర్ లో మున్సిపాలిటీలో తడి చెత్త, పొడి చెత్త వేరు చేసే విధానం లేక  కాలుష్యం పెరిగి పర్యావరణం దెబ్బతింటోంది.  రాష్ట్రమంతా చెత్త సేకరణ లో పల్లెలు సైతం పోటీ పడి మరీ తడి, పొడి చెత్త ను  వేరు చేసి వర్మీ కంపోస్టు తయారు చేస్తున్నాయి.  అంతే కాకుండా పంచాయతీలకు ఆదాయాన్ని తీసుకొస్తున్నాయి. కాగజ్​నగర్​  బల్దియాలో మాత్రం చెత్త నిర్వహణ అధ్వానంగా తయారైంది. ఇప్పటికీ ఇక్కడ 90 శాతం మేర చెత్తను కాల్చేస్తున్నారు. దీని వల్ల పొగ ఎక్కువగా రావడంతో స్థానికులు  తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

రోజూ 25 మెట్రిక్​ టన్నుల చెత్త సేకరణ 

కాగజ్​నగర్​ పట్టణంలో అన్ని వార్డుల నుంచి చెత్తాచెదారం, ప్లాస్టిక్​ ను సేకరించి దాన్ని కాల్చేస్తున్నారు.  చెత్త నుంచి వచ్చిన పొగతో తీవ్ర కాలుష్యం ఏర్పడుతోంది.  రోజూ కాగజ్ నగర్ లోని వార్డుల్లో 25 మెట్రిక్ టన్నుల చెత్త పడుతోంది. పట్టణంలో మొత్తం 20 చెత్త ఏరే వాహనాలు ఉన్నాయి. రోజూ 22 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరిస్తున్నారు.  దీన్ని కాగజ్​నగర్ మండలంలోని కోసిని పంచాయతీ శివారులో ఉన్న డంప్ యార్డ్ కు తరలిస్తున్నారు.  అక్కడ చెత్త, ప్లాస్టిక్​ వ్యర్థాలను కాల్చేస్తున్నారు.  

పల్లెలు బెటర్​... 

పల్లెలకు నేర్పిన తడి పొడి చెత్త విధానం కాగజ్​ నగర్​ మున్సిపాలిటీలో పది శాతం కూడా అమలు కావడం లేదు.  దీనికి అధికారుల బాధ్యత రాహిత్యమే కారణమని తెలుస్తోంది.  ఇక  బలగాల దగ్గర ఉన్న  డంప్ యార్డ్ లో పారేస్తున్న చెత్తలో బయో వేస్ట్, మెడికల్ వేస్ట్ ఉండడంతో ప్రాణాంతక వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  మైనారిటీ గురుకుల పాఠశాలకు ఆనుకొని ఉన్న ఈ డంప్ యార్డ్ తో చెత్తా  చెదారం దుర్వాసన తో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. 

ఈ మున్సిపాలిటీకి జిల్లా అడిషనల్ కలెక్టర్ చాహత్ బజ్ పాయ్ స్పెషల్ ఆఫీసర్ గా ఉన్నారు. ఇదే విషయం పై మున్సిపల్ ఎన్విరాన్​ మెంట్ ఇంజనీర్ ప్రణీల్ ను వివరణ కోరగా తడి పొడి చెత్త వేరు  చేసేందుకు ప్రత్యేక భవనం నిర్మాణం జరుగుతోందని, అది పూర్తి అయ్యాక చెత్తను వేరు చేసే అవకాశం ఉందన్నారు. ఇప్పటికైతే మున్సిపల్ ఆఫీస్ వెనక కొంత చెత్త వేరు చేస్తున్నామని తెలిపారు. ప్రజలు మాత్రం భవనం ఎప్పుడూ పూర్తవుతుందోనని ఎదురు  చూస్తున్నారు. .