- కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం
- రోజుల తరబడి ఎదురుచూపులు
కోహెడ మండలం కూరెల్లకు చెందిన తోట దేవేందర్ పది ఎకరాల్లో వరి సాగు చేయగా 200 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఇరవై రోజుల కింద కూరెల్ల ఐకేపీ కేంద్రానికి ధాన్యాన్ని అమ్మకానికి తెచ్చాడు. ఇటీవల కురిసిన వర్షానికి ధాన్యం తడిసిపోవడంతో నిర్వాహకులు కొనుగోలు చేయలేదు.
దీనికి తోడు ఇటీవల చలి వాతావరణం ఏర్పడడంతో తేమ శాతం మరింత పెరిగింది. దీంతో దేవేందర్ ధాన్యం అమ్మడానికి నానా తంటాలు పడుతున్నాడు. ఇది ఒక్క దేవేందర్ ఎదుర్కొంటున్న సమస్య కాదు జిల్లాలో అనేక మంది రైతులు తేమ శాతం పెరగడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సిద్దిపేట, వెలుగు: జిల్లాలో రైతులు ధాన్యం అమ్మడానికి ఆపసోపాలు పడుతున్నారు. ఓ వైపు తడిసిన ధాన్యం ఎండడంలేదు. మరోవైపు చలి వాతావరణం పెరగడంతో తేమ శాతం మరింత పెరుగుతోంది. కొనుగోలు సెంటర్ల నిర్వాహకులు తేమ17 శాతం వరకు ఉంటేనే ధాన్యం కొంటున్నారు. దీంతో వేలాది మంది రైతులు కొనుగోలు కేంద్రాల్లో పంటను ఆరబెడుతూ తేమ శాతాన్ని తగ్గించడానికి నానా పాట్లు పడుతున్నారు. జిల్లాలో ప్రస్తుత వానా కాలం సీజన్ లో 5.03 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంతో మొత్తం 418 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 210 ఐకేపీ, 202 పీఏసీఎస్, 6 మెప్మా ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి.
లక్ష్యాలకు దూరంగా..
వానా కాలం సీజన్ లో ధాన్యం కొనుగోల్లు లక్ష్యాలకు దూరంగా సాగుతోంది. జిల్లాలో 5.03 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేసినా ఆదిశగా కొనుగోళ్లు జరగడం లేదు. వాతావరణ మార్పుల కారణంగా ధాన్యంలో తేమ శాతం పెరుగుతుండడం కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటి వరకు 5428 మంది రైతుల నుంచి 27,670 టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు. మొత్తం రైతుల నుంచి 60.10 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేసి రూ.13.15 కోట్లు చెల్లించగా ఇంకా రూ.46.95 కోట్లు చెల్లించాల్సి ఉంది.
ఒకే రోజు 526 టన్నుల ధాన్యం కొనుగోలు
మొంథా తుఫాన్ ప్రభావంతో హుస్నాబాద్ అగ్రికల్చర్ మార్కెట్ యార్డులో భారీగా ధాన్యం తడిసి పోయింది. దీంతో ప్రభుత్వం స్పందించి తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించడంతో ఆక్టోబర్ 31న ఒకే రోజు 526 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. సివిల్ సప్లై, రెవెన్యూ, పోలీస్, మార్కెటింగ్, వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో 18 లారీలు, 100 మంది హమాలీలను ఏర్పాటు చేసి 526 టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలించారు. తేమ శాతంతో సంబంధం లేకుండా హుస్నాబాద్ మార్కెట్ యార్డులో కొనుగోలు చేసినట్టుగా తమ ధాన్యం కొనుగోలుకు ఇబ్బంది తొలగిస్తే బాగుంటుందని అన్నదాతలు భావిస్తున్నారు.
తేమ శాతంపై పునరాలోచన చేయాలి
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం సడలింపులు ఇవ్వాలి. ఇటీవల తుఫాన్ తో పాటు చలి వాతావరణం పెరగడంతో ధాన్యం లో తేమ శాతం పెరుగుతోంది. దీని వల్ల రైతులు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. తేమ శాతం కారణంగా రైతులు పది రోజులుగా కొనుగోలు కేంద్రంలోనే పడిగాపులు పడుతున్నారు. – తుషాల లక్ష్మణ్, రైతు, గుగ్గిళ్ల
